
- ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై వెలిచాల దృష్టి
- కరీంనగర్ ఇన్‌చార్జి పోస్టుపై అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆశలు
- రెండేళ్లుగా సరైన నేత లేక కేడర్ ఢీలా
- త్వరగా పార్టీ ఇన్‌చార్జిని ప్రకటించాలని కోరుతున్న శ్రేణులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడి కోసం ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఎవరినీ నియమించకపోవడంతో కేడర్‌లో గందరగోళం నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల ముందు హుస్నాబాద్‌పై ఫోకస్ పెంచాక కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్‌ను నడిపించే నాయకుడు లేకుండాపోయారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన పురుమల్లకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం మైనస్‌గా మారింది. ఆ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మంత్రి పొన్నంను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసి సస్పెన్షన్ కు గురయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికైనా నియోజకవర్గ ఇన్‌చార్జిని ప్రకటించి, పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలనే డిమాండ్ ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
వెలిచాలకు సీఎం, పీసీసీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ?
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న వెలిచాల రాజేందర్‌రావు గత లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఎంపీగా ఓడిపోయినా కరీంనగర్‌లోనే ఎక్కువగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు యాక్టివ్ పాలిటిక్స్‌లో లేని ఆయన.. ఏడాది కాలంగా ఫుల్ టైం పొలిటీషియన్‌గా మారారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేందుకు వెలిచాల ప్రజాకార్యాలయం పేరిట సువిశాలమైన ఆఫీసును నిర్మించారు.
బల్దియాలోని ప్రధాన సమస్యలపై ఫోకస్ చేయడంతోపాటు పార్టీ బలోపేతం కోసం పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనకు డీసీసీ అధ్యక్షుడిగా లేదంటే కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించాలని వెలిచాల పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండాను ఎగరేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని, భవిష్యత్ నీదేనంటూ తనకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ నెల రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఎవరికో దక్కేనో పదవులు..
ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవితోపాటు కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు నాయకులను ఊరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులకు ప్రధానంగా వెలిచాల రాజేందర్‌రావు, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పోటీపడుతున్నారు. వీరితోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జి పోస్టును అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.. సిటీలో పార్టీ కార్యక్రమాలను సక్సెస్ చేశారనే పేరుంది.
ఈ నేపథ్యంలోనే ఆయనకు మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో సుడా చైర్మన్ పదవి దక్కింది. ఇప్పటికే కీలకమైన నామినేటెడ్ పదవి ఉన్నందున మరో పదవి ఇవ్వకపోచ్చనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఒకవేళ వెలిచాలకు డీసీసీ లేదా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోస్టు ఇచ్చినట్లయితే అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.