
- ఇక్కడి పరిశ్రమలను పట్టించుకోని రాష్ట్ర సర్కారు
- పక్క రాష్ట్రంలోని వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రానికి లేఖలు
- ఆజంజాహీ మిల్స్, నిజాం షుగర్స్‌ను తెరుస్తామని గతంలో హామీలు
- ఆజంజాహీ మిల్స్ భూములు రియల్ ఎస్టేట్‌కు
- అన్యాక్రాంతమవుతున్న నిజాం షుగర్స్ భూములు
- ఐడీపీఎల్, హెచ్‌ఎంటీ, ప్రాగా టూల్స్ ఊసెత్తుతలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నో ప్రధాన ఫ్యాక్టరీలు మూతబడినయ్. వాటిని తెరిపిస్తామని రాష్ట్ర సర్కారు చెప్పినా.. అడుగు కూడా ముందుకు పడుతలేదు. ఏండ్లుగా క్లోజ్‌లోనే ఉన్న పరిశ్రమల ఊసెత్తని ప్రభుత్వం.. ఇప్పుడు పక్క రాష్ట్రంలోని ఫ్యాక్టరీపై కేంద్రానికి లేఖలు రాస్తున్నది. కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్స్, ఐడీపీఎల్, హెచ్ఎంటీ వంటి వాటిని పట్టించుకోని బీఆర్ఎస్.. ఏపీలోని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. వైజాగ్‌లో భారీ సభ నిర్వహించేందుకూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ రెడీ అవుతుండటం గమనార్హం. రాష్ట్రంలోని ఫ్యాక్టరీలను పునరుద్ధరించకుండా.. పొరుగు రాష్ట్రంలోని ప్లాంట్ కోసం పోరాడుతామని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.
10 వేల మందికి ఉపాధినిచ్చిన ఆజంజాహీ మిల్స్
కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన నిజామ్ షుగర్స్, ఆజంజాహీ మిల్స్, రామగుండం ఎరు వుల ఫ్యాక్టరీ, ప్రాగాటూల్స్, ఐడీపీఎల్, హెచ్ఎంటీ వంటి సంస్థలను ఉమ్మడి రాష్ట్రంలో నాటి సర్కార్లు మూసివేశాయి. వాటిని తిరిగి ప్రారంభించేందుకు అప్పటి సీఎం వైఎస్సార్ ప్రయత్నాలు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు. తర్వాత ఆ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని తెలంగాణ తొలి ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మరిచిపోయారు. ఆజంజాహీ మిల్స్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా ఉండేది.
దాదాపు 10 వేల మందికి ఉపాధి కల్పించింది. 1934లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారుడి పేరిటే ఆ సంస్థను స్థాపించారు. 1974లో నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ దాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. వివిధ కారణాలతో 1990ల్లో సంస్థను మూసివేశారు. 2008లో 200 ఎకరాల సంస్థ భూములను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 30 ఎకరాల జాగా మాత్రమే మిగిలి ఉంది. ఆ జాగాలోనే కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ఇటీవలే రాష్ట్ర సర్కారు జీవోను విడుదల చేసింది.
27 ఎకరాల స్థలంలో కలెక్టరేట్‌ను నిర్మించేందుకు.. భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించాల్సిందిగా చేనేత జౌళి శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కొందరు మిల్లులోని భూములను కబ్జా పెడుతున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కార్మికులు హక్కుల కోసం పోరాడేందుకు చందాలు వేసి నిర్మించుకున్న కార్యాలయాన్ని ఓ నేత తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న వార్తలు బయటికొచ్చాయి. దీంతో మిల్లును రీ ఓపెన్ చేస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.
కాకా కృషి.. వివేక్ పోరాటంతో తెరుచుకున్న రామగుండం ఫ్యాక్టరీ
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని వివిధ కారణాలతో 1990ల్లో మూసివేశారు. అయితే ఆ కర్మాగారాన్ని తెరిపించేందుకు మాజీ ఎంపీ జి.వెంకటస్వామి (కాకా) ఎంతో కృషి చేశారు. పెద్దపల్లి ఎంపీగా 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర కేబినెట్ ఓకే కూడా చేసింది. అయితే ఆ తర్వాత అది కొంత ఆలస్యమైంది. కాకా తర్వాత ఆయన కుమారుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులనూ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు.
దీంతో ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు 2015లో కేంద్రం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2022లో ఓపెన్ అయింది. ఆ ఏడాది నవంబర్ 12న ఫ్యాక్టరీని ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. 12.7 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీలో రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటా ఉండగా.. మరో 11.7 శాతం వాటా డెన్మార్క్‌కు చెందిన హల్దార్ టాప్స్ కంపెనీకి ఉంది. మిగతా వాటాను నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (26%), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (26%), ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (11%), గెయిల్ (14.3%) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిగి ఉన్నాయి.
మిగతా సంస్థలపైనా అదే తీరు
ప్రభుత్వ రంగంలో ఔషధాల ఉత్పత్తికి ఒకప్పుడు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యుటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు మంచి పేరుండేది. ఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, రిషికేశ్లలోనూ ఫ్యాక్టరీలుండేవి. కానీ నష్టాలు రావడంతో హైదరాబాద్ యూనిట్ మూతపడింది. 2017లో హైదరాబాద్‌లో ఒక కొత్త ఫార్ములేషన్ యూనిట్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక దాన్ని నడపడం ఆర్థికంగా సాధ్యం కాదని బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ తేల్చింది. దీంతో సంస్థ ఆస్తులమ్మి ఉన్న అప్పులను తీర్చాలని భావిస్తున్నారు.
ఈ సంస్థను పునరుద్ధరిస్తామని కేసీఆర్‌హామీ ఇచ్చినా.. అది ఆచరణ సాధ్యం కావడం లేదు. చేతి వాచ్‌ల తయారీకి పేరున్న హెచ్ఎంటీ (హిందూస్థాన్ మెషీన్ టూల్స్), వివిధ సంస్థలకు టూల్స్‌ను అందించే ప్రాగా టూల్స్‌నూ రివైవ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పటికీ ఆ హామీలు మాటల మూటలుగానే మిగిలిపోయాయి.
నిజామ్ షుగర్స్.. గతం ఘనం
ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీగా నిజామ్ డెక్కన్ షుగర్స్‌కు పేరుండేది. నిజామాబాద్ జిల్లాలోని శక్కర్‌నగర్‌లో 15 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఒకప్పుడు భారీ లాభాలను ఆర్జించింది. కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక 2002లో దాన్ని ప్రైవేటోళ్లకు అప్పగించా రు. దీంతో ఒడుదొడుకులకు లోనైంది. మూసేయాల్సి వచ్చింది. సంస్థను ప్రభుత్వమే టేకోవర్ చేసేలా నాటి సీఎం వైఎస్సార్ ప్రయత్నించినా అడుగులు ముందుకు పడ లేదు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఫ్యాక్టరీని తెరుస్తామంటూ 2014లో కేసీఆర్ హామీ ఇచ్చినా ఇప్పటి వరకు దిక్కు లేదు.
2015లో ఆ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండగా.. మిగతా వాటా డెక్కన్ షుగర్స్ అనే సంస్థకు వాటా ఉంది. దాన్ని నడిపే స్థోమత లేదని చెప్పి ప్రభుత్వానికే మిగతా వాటానూ అప్పగించేసిందా సంస్థ. అప్పటి నుంచి సంస్థ పూర్తిగా మూతపడిపోయింది. కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఫ్యాక్టరీకున్న జాగాలో కేవలం 400 ఎకరాలే మిగిలాయన్న చర్చ నడుస్తున్నది. కార్మికులూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఫ్యాక్టరీని తెరిపించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు.
కనీసం తమకొచ్చే బెనిఫిట్స్ అయినా ఇస్తే బాగుంటుందని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు సంస్థ లే ఆఫ్ ప్రకటించడంతో కార్మికులు న్యాయపోరాటానికి దిగారు. నేషనల్ ఇండస్ట్రీ లా ట్రిబ్యునల్‌ను ఆ సంస్థ యజమాని గోకరాజు గంగరాజు ఆశ్రయించారు. కోర్టు లో కేసు నడుస్తుండగానే.. 2019లో ఫ్యాక్టరీ భూములమ్మి కార్మికుల క్లెయిమ్స్ సెటిల్ చేయాలని గోకరాజు నిర్ణయించినా రాష్ట్ర సర్కారు అడ్డుపుల్ల వేసింది. దీంతో ట్రిబ్యునల్ ఏ తీర్పూ ఇవ్వకుండానే కేసు కొట్టేసింది.