27 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం..భారీగా తగ్గిన హోల్ సేల్ ధరలు

27 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం..భారీగా తగ్గిన హోల్ సేల్ ధరలు
  • అక్టోబర్‌‌‌‌లో మైనస్ 1.21 శాతంగా నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హోల్​సేల్​ ధరలు భారీగా తగ్గాయి. దీంతో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్​ 2025లో (–-) 1.21 శాతానికి పడిపోయింది. ఇది 27 నెలల కనిష్టం. ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అని అనగా, ధరలు తగ్గిపోవడాన్ని  నెగెటివ్ ద్రవ్యోల్బణంగా పిలుస్తారు.  

ఆహార పదార్థాలు, ఇంధనం, ఇతర వస్తువుల ధరలు అక్టోబర్‌‌‌‌లో భారీగా తగ్గాయి.  సెప్టెంబర్​లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.13 శాతం ఉండగా, గత ఏడాది అక్టోబర్​లో 2.75 శాతంగా ఉంది. అక్టోబర్​లో పప్పుధాన్యాలు,  కూరగాయలు వంటి ఆహార వస్తువుల సెగ్మెంట్‌‌లో (–-) 8.31 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. 

కూరగాయల్లో నెగెటివ్‌‌ ద్రవ్యోల్బణం ఏకంగా 34.97 శాతానికి పడిపోయింది. పప్పుధాన్యాల్లో 16.50 శాతం, ఆలుగడ్డలు, ఉల్లిపాయల్లో వరుసగా 39.88 శాతం, 65.43 శాతం నెగెటివ్‌‌ ద్రవ్యోల్బణం ఉంది. ఇతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.33 శాతం నుంచి 1.54 శాతానికి తగ్గింది. 

ఇంధనం, విద్యుత్​లో నెగెటివ్‌‌ ద్రవ్యోల్బణం  2.55 శాతంగా ఉంది. జీఎస్​టీ తగ్గడం, సానుకూల బేస్​ ఎఫెక్ట్​ వల్ల టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గింది.  రిటైల్ ద్రవ్యోల్బణం కూడా అక్టోబర్​లో 0.25 శాతం ఆల్-టైమ్​ కనిష్టానికి చేరింది. దీంతో  ఆర్​బీఐ వడ్డీ రేట్లను 25-–50 బేసిస్ ​పాయింట్ల మేరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.