ప్రయాణంలో వాంతులు ఎందుకు వస్తాయి..రాకుండా ఇలా చేయండి

ప్రయాణంలో వాంతులు ఎందుకు వస్తాయి..రాకుండా ఇలా చేయండి

ప్రయాణ సమయాల్లో చాలా మందికి వాంతులు అవుతూ ఉంటాయి.  బస్సులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించే సమయంలో చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది. తల తిరగడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఎక్కువగా  వాంతులు చేసుకుంటారు. ఈ సమస్య కోసం కొందరు మందులు వాడతారు..మరికొందరు ఇతర ఉపాయాలను ప్రయత్నిస్తారు..అయినా సమస్య తీరదు. ప్రయాణ సమయాల్లో వాంతులకు అసలు కారణం ఏమిటి..?..ఈ సమస్యకు చెక్ పెట్టడం ఎలా  తెలుసుకుందాం.

ఈ సమస్యను ఏమంటారు..

ప్రయాణంలో వాంతులు అవడాన్ని వైద్య భాషలో మోషన్ సికె నెస్ అంటారు. ఈ సమస్య అందరికీ ఉండదు. ప్రతి ముగ్గురిలో ఒకరే ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. బస్సు, లేదా కారెక్కారో లేదో ఇలా వాయక్ వాయక్ మంటూ వాంతులు చేసుకుంటారు. మరి కొందరు కొంత దూరం  ప్రయాణం చేశాక వాంతులు చేసుకుంటారు. ఇంకొందరికి ఎగుడుదిగుడు రోడ్లలో ప్రయాణం, ఘాట్ రోడ్లలో ప్రయాణం చేయడం వల్ల వాంతులు అవుతాయి. 

ఏ వయసు వారికి వాంతులు అవుతాయి..

ప్రయాణ సమయాల్లో వాంతులు ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు అవుతుంటాయి. వీరితో పాటు మహిళలు వాంతులు చేసుకుంటారు. మగవాళ్లలో ఈ సమస్య తక్కువ. ఈ సమస్య జన్యు పరంగా కూడా ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో నెలసరి సమయంలో.. గర్భిణులకు, మైగ్రేన్, పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నవాళ్లకు ప్రయాణంలో వాంతులు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుందట. 

వాంతుల ఎందుకు అవుతాయి. ..కారణాలేంటి..

ప్రయాణ సమయాల్లో వాంతులు అవడం  వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు.  నాడీ వ్యవస్థ అసమతుల్యత స్థితిలో ఉన్నప్పుడు వాంతులు అవతాయంటున్నారు. వాంతులతోపాటు కళ్లు తిరగడం, ఆయాసం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనికి మూడు కారణాలున్నాయి.  ముందుగా ప్రయాణ సమయంలో ఫుడ్ తింటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. తీసుకున్న ఆహారం  జీర్ణం అవడానికి సమయం తీసుకుంటుంది. ప్రయాణంలో అటు ఇటు కదలడం వల్ల ఆహారం జీర్ణం కాక వాంతులు అవుతాయట. ప్రయాణ సమయంలో  శరీరం నియంత్రణ కోల్పోయినప్పుడు కూడా వాంతులు అవుతాయట. ప్రయాణంలో  మన మెదడు  చెవి, కళ్ళు, చర్మం నుండి వేర్వేరు సంకేతాలను అందుకుంటుంది, దీని కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది.అందువల్ల వాంతులు అవతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. 

వాంతులు రావొద్దంటే ఏం చేయాలి..

వాంతుల సమస్య ఉన్న వారు.. ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆల్కహాల్, కెఫిన్, వేయించిన, మసాలా ఆహారాలను తినకుండా ఉండటం మేలు. అలాగే ప్రయాణం చేసే సమయంలో లేదా..ప్రయాణానికి ముందు తక్కువ ఆహారం తీసుకోవాలి. నీరు పుష్కలంగా త్రాగండి. సీట్లలో సరిగా కూర్చోవాలి. వెనుక సీట్లలో కాకుండా ముందు సీట్లలో కూర్చోవడానికి ప్రయత్నించాలి. మాస్క్ ధరించండి, తద్వారా చెడు గాలులు ఇబ్బంది పెట్టవు. పుస్తకాన్ని చదవవద్దు.  దాని వల్ల మోషన్ సిక్‌నెస్ లక్షణాలు కనిపిస్తాయి. నిమ్మకాయ, అల్లం, పుదీనా, మిఠాయి, చూయింగ్ గమ్ మొదలైన వాటిని మీ దగ్గర ఉంచుకోండి. వాంతులు వస్తున్నాయని అనిపించినప్పుడల్లా వాటిని తీసుకోండి. ప్రయాణంలో కాస్త ఇబ్బందిగా ఉంటే కిటికీ తెరిచి  స్వచ్ఛమైన గాలికి  సేద తీరండి.