పదేండ్లలో జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలె?.. బీఆర్ఎస్ సర్కారును ప్రశ్నించిన నిరుద్యోగులు

పదేండ్లలో జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలె?.. బీఆర్ఎస్ సర్కారును ప్రశ్నించిన నిరుద్యోగులు

ఖైరతాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్‌‌ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా లేక వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని నిరుద్యోగ చైతన్య యాత్ర కో-ఆర్డినేటర్ సలీమ్ పాషా అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఈ పదేండ్లలో జాబ్ క్యాలెండర్ హామీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 15న చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్రలో భాగంగా నిరుద్యోగులతో కలిసి బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

నిరుద్యోగులు బీఆర్‌‌ఎస్‌కు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల వల్ల ఈ ఎన్నికల్లో నష్టం తప్పదనే కేటీఆర్ చిక్కడపల్లికి ఏసీ బస్సులను పంపించి స్టూడెంట్లను తన వద్దకు పిలుపించుకుని డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. నిజంగా నిరుద్యోగుల పట్ల కేసీఆర్‌‌కు చిత్తశుద్ధి ఉంటే చిక్కడపల్లి లైబ్రరీ వద్దకు వచ్చి తప్పు జరిగిపోయినట్లు చెప్పాలి కదా అని అన్నారు. దేశంలో ​తెలంగాణలోనే నిరుద్యోగం అధికంగా ఎక్కువగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలిందని ప్రొఫెసర్​పీఎల్‌ విశ్వేశ్వర్‌‌ రావు అన్నారు.