చికెన్ 65 అని ఎందుకు అంటారు తెలుసా ? చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో హిట్ అయ్యింది..

చికెన్ 65 అని ఎందుకు అంటారు తెలుసా ? చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో  హిట్ అయ్యింది..

చికెన్ 65 అనేది మన దేశంలో చిన్న, పెద్ద అందరూ ఇష్టంగా తినే వంటకం. పెళ్లిళ్లు, హోటళ్లు, పార్టీలు, ప్రయాణాలు... ఇలా ఎక్కడ చూసినా ఇది కనిపిస్తుంది. కరకరలాడుతూ, కారంగా, ఎర్రగా ఉండే ఈ చికెన్ ముక్కలను తినడం ఎవరికైనా ఆపడం కష్టం. కానీ, దీనికి "చికెన్ 65" అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయంపై ఇప్పటికీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. 65 అంటే మిరపకాయల సంఖ్యనా ? కోడి వయసా ? లేక మెనూ నంబరా ? దీని వెనుక ప్రచారంలో ఉన్న కొన్ని ముఖ్యమైన కథలు ఇవే....

పేరు వెనుక ఉన్న రకరకాల కథలు
1.  చాలా మంది నమ్మే కథ ప్రకారం, ఈ వంటకం చెన్నైలోని ఫెమస్  'బుహారీ హోటల్' లో పుట్టింది. దీని వ్యవస్థాపకుడైన ఎ.ఎం. బుహారీ 1965లో మొదటిసారిగా ఈ వంటకాన్ని తయారు చేశారు. ఆ సంవత్సరం గుర్తుగా దీనికి 'చికెన్ 65' అని పేరు పెట్టారు. ఆ తర్వాత  చికెన్ 78, చికెన్ 82, చికెన్ 90 అనే వంటకాలను కూడా పరిచయం చేశారు.

2. మెనూ నంబర్ కథ
మిలిటరీ క్యాంటీన్లకు వెళ్లే సైనికులకు భాష రాకపోవడం వల్ల, పెద్ద పెద్ద పేర్లు పలకడం కష్టంగా ఉండేది. అందువల్ల వారు మెనూ కార్డులో 65వ నంబర్ స్థానంలో ఉన్న చికెన్ వంటకాన్ని ఆర్డర్ చేసేవారని, అలా దీనికి ఆ పేరు వచ్చిందని అంటుంటారు.

3. 65 మిరపకాయల కథ
ఈ వంటకం తయారీలో మొదట 65 ఎర్ర మిరపకాయలు వాడేవారని ఒక కథ ప్రచారంలో ఉంది. అంత కారం తినడం ఎవరికైనా ప్రమాదకరమే అయినా, ఈ వంటకం ఘాటును చెప్పడానికి ఈ కథ పుట్టింది.

4. 65 రోజుల కోడి కథ
మరికొందరు 65 రోజుల వయసు ఉన్న కోడి మాంసంతోనే ఈ వంటకం చేస్తారని నమ్ముతారు. 

5. న్యూ ఇయర్ పార్టీ కథ
1965 నూతన సంవత్సర వేడుకల్లో బుహారీ ఈ వంటకాన్ని వడ్డించారని, అతిథులు దీని పేరు అడగడంతో అప్పటికప్పుడు ఆ సంవత్సరం పేరును పెట్టారని మరొక కథ చెప్తారు.

దేశమంతటా ఎలా పాపులర్ అయిందంటే 
చెన్నైలో మొదలైన చికెన్ 65, హైదరాబాద్ చేరిన తర్వాత సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. హైదరాబాదీల రుచికి తగ్గట్టుగా దీనికి కరివేపాకు, పెరుగు, పచ్చిమిరపకాయలతో తాలింపు వేయడం ప్రారంభించారు. ఇదే ఇప్పుడు మనకు హోటళ్లలో దొరికే అసలైన చికెన్ 65 రూపురేఖలను మార్చేసింది. ఇప్పుడు  చికెన్ 65 డ్రైగా, గ్రేవీగా, బోన్‌లెస్‌గా రకరకాల పద్ధతుల్లో దొరుకుతోంది. శాకాహారుల కోసం పనీర్ 65, గోబీ 65 వంటి వంటకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.