వ్యూ పాయింట్​ : డ్రగ్స్ కేసుల అదుపు ఎలా?

వ్యూ పాయింట్​ : డ్రగ్స్ కేసుల అదుపు ఎలా?

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని ఎదుర్కోవడానికి నార్కొటిక్​ డ్రగ్ అండ్​ సైంటిఫిక్​ చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన డాక్టర్లే ఈ నేరానికి, మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతుంటే రోగుల పరిస్థితి ఏమిటి?  ఇది చాలామందిని తొలిచివేస్తున్న ప్రశ్న. అదుపు లేకుండా మాదక ద్రవ్యాల వాడకం సమాజానికి హాని కలిగిస్తుంది. యువతరం భవిష్యత్తుని నాశనం చేస్తుంది.  కేసు నిరూపణ జరిగేవరకు ముద్దాయిలను అమాయకులుగా పరిగణించాలని మన న్యాయశాస్త్రం చెబుతున్నది. 

ఈ కేసుల విచారణ సత్వరం జరగాల్సిన అవసరం ఉంది. నేరాలను అరికట్టడంలో ఈ సత్వర విచారణ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు, కోర్టులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్రమ మాదక ద్రవ్యాల రవాణా, వినియోగమనేది జాతీయ, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మీద తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తీవ్రమైన సమస్యగా మారిపోయింది. మాదక ద్రవ్యాలు సమాజానికి ముప్పు అని చెప్పడంతో సరిపోదు. చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి. ఈ నార్కొటిక్ చట్టంలోని నిబంధనలను నిజాయతీగా, జాగ్రత్తగా అమలుచేయాలి. అలా అమలు చేయకపోతే మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగి మన సమాజాన్ని నాశనం చేస్తుంది. 

మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను నియంత్రించకపోతే యువతరం నాశనం అవుతుంది.  ఫలితంగా దేశ భవిష్యత్తు దెబ్బతింటుంది. మన దేశంలో  సగటున 30 నుంచి 35 సంవత్సరాల వయస్సుగల యువ జనాభా ఎక్కువగా ఉంది.  ఈ  మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఈ సమస్యను  మరింత ఆందోళనకరంగా మారుస్తుంది. మాదక ద్రవ్యాల వ్యసనం సమాజానికి ముప్పు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు తీర్పుల్లో ప్రకటించాయి. ఈ ముప్పును అధిగమించాలంటే  న్యాయవ్యవస్థ, లా ఎన్​ఫోర్స్​మెంట్​ సంస్థల చురుకు పాత్రతో సరిపోదు. ప్రజలు కూడా జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం నేపథ్యం

1985లో నార్కొటిక్ (ఎన్​డిపిఎస్) చట్టం అమల్లోకి వచ్చింది.  అంతకు పూర్వం మాదక ద్రవ్యాలను నియంత్రించే చట్టాలు లేవు. 1985 వరకు గంజాయి, హాషీష్, భంగ్​ మొదలైనవి మనదేశంలో చట్టబద్ధంగా విక్రయించారు. నార్కొటిక్స్ డ్రగ్స్​పై  సింగిల్​ కన్వెన్షన్, అదేవిధంగా  ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కు అనుగుణంగా ఈ నార్కొటిక్ చట్టం రూపొందించడం జరిగింది.  1985లో తయారైన ఈ చట్టానికి 1988, 2001, 2014 సంవత్సరాల్లో మూడుసార్లు సవరణ జరిగింది. 

ఈ చట్టప్రకారం నార్కొటిక్స్ డ్రగ్స్ అంటే  గంజాయి, నల్లమందులాంటివి. సైకోట్రాఫిక్​ పదార్థాలలో 1971నాటి సైకోట్రాఫిక్​ సబ్​స్టాన్సెస్​ కన్వెన్షన్​ ద్వారా రక్షించబడిన సహజ లేదా సింథటిక్​ పథార్థం.  ఎన్​డిపిఎస్​ చట్టం ప్రకారం నార్కొటిక్​డ్రగ్​ లేదా సైకోట్రాఫిక్​ పదార్థాన్ని కలిగి ఉండటం, కొనుగోలు చేయడం, అమ్మడం, రవాణా చేయడం, వినియోగించడం నేరం. ఆ వ్యక్తులు శిక్షార్హులు అవుతారు. శాస్త్రీయ లేదా ఔషధ ప్రయోజనాల కోసం నార్కొటిక్​ డ్రగ్స్, సైకోట్రాఫిక్​ పదార్థాలను ఉపయోగించడానికి చట్టం మినహాయింపును ఇచ్చింది. అయితే, ఆ సందర్భాలలో కూడా అవసరమైన అనుమతి లేదా అధికారం కలిగి ఉండాలి. 

కఠిన శిక్షలు

ఈ చట్టం ప్రకారం బెయిలు దొరకడం అంత సులభం కాదు.  దోషిగా నిరూపణ అయినవారికి శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అయినా, నేరాలు తగ్గడం లేదు. నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది.  ఈ కేసుల్లో విధానపరమైన సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి. సోదా చేసేటప్పుడు, జప్తు చేసేటప్పుడు అధికారులు పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. 

కఠిన శిక్షలు ఉండటం వల్ల కోర్టులు ఈ సాంకేతిక కారణాలను చూపించి నేరస్తులను విడుదల చేస్తున్నాయి. కఠిన బెయిలు నిబంధనలు ఉన్నప్పటికీ ధనిక కుటుంబ నేపథ్యం ఉన్నవారు, విద్యాధికులు సైతం ఈ నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్లు కూడా ఈ మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని మెయిన్​ స్ట్రీమ్​ మీడియా పట్టించుకోకపోవడం మరింత బాధాకరం.  

నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయి నిర్దోషి

నేర నిరూపణ జరిగేవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిని అమాయకుడిగానే పరిగణించాలి. ఇది క్రిమినల్​ జ్యురిస్​ప్రుడెన్స్​లోని ప్రాథమిక సూత్రాలలో ఒకటి.  ముద్దాయి దోషిగా నిరూపణ జరిగేవరకు ఆ వ్యక్తిని నిర్దోషిగా భావించాలని న్యాయసూత్రం చెబుతుంది. అయితే, ఈ న్యాయసూత్రాన్ని తిప్పి కొట్టడానికి ప్రత్యేక చట్టాలలో కొన్ని కొత్త నిబంధనలను పొందుపరుస్తున్నారు. తాము అమాయకులమని నిరూపించుకుని భారాన్ని ముద్దాయిలపై ఉండేవిధంగా ఈ నిబంధనలు ఉంటున్నాయి. 

ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే నేరాల అణచివేతకు ఇలాంటి నిబంధనలను చట్టాల్లో పొందుపరుస్తున్నారు. అలాంటి నిబంధన నార్కొటిక్ చట్టంలోనూ పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం నేరాలను విచారిస్తున్నప్పుడు దోషిగా భావించే మానసిక స్థితిని కోర్టు అంచనా వేస్తుంది. అయితే సెక్షన్​ 54 ప్రకారం కొన్ని అక్రమ వస్తువులు, పదార్థాలు కలిగి ఉండటం వల్ల ఉత్పన్నమయ్యే అపరాధ భావనను సృష్టిస్తుంది. ఈ నేరాల నియంత్రణ కోసం ఇలాంటి నిబంధనలను చట్టంలో ఏర్పరిచారు. సుప్రీంకోర్టు ఈ నిబంధనలను రాజ్యాంగబద్ధమే అని ప్రకటించింది. 

- డా. మంగారి రాజేందర్, రిటైర్డ్​ జిల్లా జడ్జి-