జోషిమఠ్ ఎందుకు కుంగుతోంది?

జోషిమఠ్ ఎందుకు కుంగుతోంది?
  • విరిగిన కొండచరియపై ఉండటమే కారణమంటున్న ఎక్స్​పర్ట్స్
  •     రోడ్లు, ఇండ్లు, ప్రాజెక్టులతో నేలపై మోయలేని భారం  
  •     డ్రైనేజీ సిస్టం సరిగ్గాలేక భూమిలోకి ఇంకుతున్న నీళ్లు
  •     మట్టి కరిగి కుంగుతున్న టౌన్​

జోషిమఠ్ (ఉత్తరాఖండ్): హిమాయలన్ టౌన్ జోషిమఠ్ ఎందుకు కుంగిపోతోంది? ఇండ్లు, రోడ్లు ఎందుకు బీటలు వారుతున్నయి? యాపిల్, ఇతర చెట్లు ఎందుకు నేలలోకి కూరుకుపోతున్నయి? కరెంట్ స్తంభాలు ఎందుకు ఒరిగిపోతున్నయి? నేల నుంచి నీళ్లు పైకి ఎందుకు పొంగుకొస్తున్నయి? అంటే.. రకరకాల కారణాలు వినిపిస్తున్నయి. పురాతన కాలంలో ఓ పెద్ద పర్వతం నుంచి జారిపోయిన పెద్ద కొండచరియపైనే ఈ టౌన్ ఉండటం ప్రధాన కారణమైతే.. గత కొన్ని దశాబ్దాలుగా రోడ్లు, ఇండ్లు, ప్రాజెక్టులు పెరగడంతో ఇక్కడి నేలపై మోయలేని భారం పడటం ఇంకో కారణమని చెప్తున్నారు. అలాగే డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేకపోవడం, వరదలతో నాలాలు పూడిపోవడంతో వాన నీళ్లు, ఇండ్ల నుంచి విడుదలవుతున్న నీళ్లు ఇక్కడి మట్టిలోనే ఇంకిపోతున్నాయని.. ఫలితంగా ఏటవాలుగాఉన్న ఈ ప్రాంతం నుంచి నీళ్లు ఇంకిపోతూ లూజ్ మట్టి కరిగిపోయి నేల కుంగుతోందని అంటున్నారు.  

కొండచరియపైనే ఊరు..

ఉత్తరాఖండ్​లోని చమోలి జిల్లాలో హిమాలయ పర్వతపాదాల వద్ద ఓ పెద్ద పర్వతానికి దిగువన ఉంది జోషిమఠ్. ఉత్తరాన అలకనంద నది.. తూర్పున ధౌలి గంగ.. మధ్యన భారీ కొండచరియపైన ఉన్నది ఈ టౌన్. జోషిమఠ్ అడుగున ఉన్న నేల వాస్తవానికి.. ఇది కొండచరియ కావడంవల్లే దీనిలోని మట్టి, రాళ్లు ఎక్కువ బరువు మోసే అవకాశంలేదని చెప్తున్నారు.  

అర్బనైజేషన్ తోనూ..   

కొన్ని దశాబ్దాలుగా వేగంగా అభివృద్ధి చెందిన జోషిమఠ్ ఇప్పుడు చిన్న స్థాయి పట్టణంగా మారింది. అర్బనైజేషన్ కారణంగా బలహీనంగా ఉన్న నేలపై మోయలేని బరువు పడింది. మరోవైపు, నీళ్లు సహజంగా కిందకు వెళ్లిపోయేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఒక్కోచోట నీళ్లు కంట్రోల్ లేకుండా పెద్దమొత్తంలో ప్రవహించడంతో నేల కోతకు గురవుతోంది. 2013లో వరదలకు బురద పేరుకుపోయి ఇక్కడి నాలాలు బ్లాక్ అయ్యాయి. ఆ తర్వాత 2021లో మరోసారి వరదలు రావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైందని 
సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.  

1976లోనే ముప్పు తెలిసినా.. 

జోషిమఠ్​కు ఉన్న ముప్పు గురించి 1976లోనే బయటపడింది. అప్పట్లో కూడా నేలపై నుంచే నీళ్లు పైకి ఉబికివచ్చాయి. కొన్ని చోట్ల నేల కుంగింది. దీనిపై ప్రభుత్వం నియమించిన మిశ్రా కమిటీ అధ్యయనం చేసింది. అర్బనైజేషన్ కారణంగా భవిష్యత్తులో టౌన్ కుంగిపోయే ప్రమాదం ఉందని కమిటీ రిపోర్ట్​ ఇచ్చింది. అయితే, అప్పట్లో ఆ కమిటీ రిపోర్ట్​ను ప్రజలు తేలిగ్గా తీసిపారేశారు. ప్రభుత్వాలు కూడా పెద్దగా చర్యలు చేపట్టలేదు.