బీఆర్​ఎస్​ నేతలకు ఎందుకంత తొందర? : మంత్రి శ్రీధర్​బాబు

బీఆర్​ఎస్​ నేతలకు ఎందుకంత తొందర?  : మంత్రి శ్రీధర్​బాబు
  • వాళ్లు 3,500 రోజులున్నరు.. మేం వచ్చి 35 రోజులు కూడా కాలే
  • అప్పుడే విమర్శలా..  ఓటమి డిప్రెషన్​లో ఏవేవో మాట్లాడ్తున్నరు : మంత్రి శ్రీధర్​బాబు
  • బుక్​లెట్​ విడుదల చేసి వాళ్ల పరువు వాళ్లే పోగొట్టుకున్నరు
  • పదేండ్లు ప్రజలను బానిసల్లా చూశారు.. ఇంకా నియంతల్లా పాకులాడుతున్నరు
  • తెలంగాణకు పాపం, శాపం, కోపం అన్నీ బీఆర్​ఎస్సే అని ఫైర్​
  • టీఆర్​ఎస్​ నుంచి బీఆర్​ఎస్​గా మారినా వాళ్ల 420 పేరు పోదు: మంత్రి సీతక్క

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 3,500 రోజుల పాటు బీఆర్ఎస్​ పార్టీ పాలించిందని, కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చి 35 రోజులైనా కాకముందే బీఆర్​ఎస్​ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. కాంగ్రెస్​ హామీలపై పుస్తకాలను విడుదల చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని, అంత తొందర ఎందుకని ఆయన ప్రశ్నించారు.

‘‘కాంగ్రెస్​ హామీలపై బుక్​లెట్​ను విడుదల చేసి బీఆర్​ఎస్​ నేతలు వాళ్ల పరువును వాళ్లే తీసుకున్నరు. పదేండ్లలో వాళ్లు ఏం చేశారు? మేం అధికారంలోకి వచ్చి 35 రోజులన్నా కాకముందే విమర్శలు చేస్తున్నారు. వాళ్లు చెప్పిన దళితులకు మూడు ఎకరాల భూమి, దళితబంధు, డబుల్​ బెడ్రూం ఇండ్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, విభజన హామీలు, ఐటీఐఆర్​, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటివి ఏమయ్యాయి? వాళ్ల గురించి, వాళ్ల హామీల గురించి రాసుకోవాలనుకుంటే రామయణమంతా పెద్ద కథ.. చెప్పుకోవాలనుకుంటే మహాభారతమంత కథ అవుతాయి. వాటన్నింటినీ గమనించి ఎవరు 420నో ఎవరు డబుల్​ 420నో ప్రజలే బేరీజు వేసుకుంటారు” అని అన్నారు.  తాము ఇచ్చిన హామీలకు కొంచెం ఎక్కువే చెప్పి బీఆర్​ఎస్ మేనిఫెస్టోను తయారు చేసిందని, అధికారంలోకి వచ్చాక ఆరు నుంచి ఏడు నెలల తర్వాత వాటిని అమలు చేస్తామని అందులో పేర్కొందని తెలిపారు. తెలంగాణకు పాపం, శాపం, కోపం అన్నీ బీఆర్​ఎస్​ పార్టీనేనన్నారు. మంత్రి సీతక్క, పీసీసీ క్రమ శిక్షణా కమిటీ చైర్మన్​ చిన్నారెడ్డితో కలిసి గురువారం గాంధీభవన్​లో మంత్రి శ్రీధర్​బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘తలసరి ఆదాయం పెరిగిందని గప్పాలు కొట్టుకుంటున్న బీఆర్​ఎస్​ నేతలు.. నిజంగానే తలసరి ఆదాయం పెరిగినట్టయితే కోటి కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఎందుకున్నాయో చెప్పాలి” అని సవాల్​ విసిరారు. ‘‘మార్పు కావాలని ప్రజలు కచ్చితమైన తీర్పును ఇచ్చారు. ఆ వెంటనే 48 గంటల్లోనే సీఎం, మంత్రులం ప్రమాణం చేశాం. ఆ తర్వాత రెండు రోజులకే అసెంబ్లీని సమావేశపరిచి ఎమ్మెల్యేలతోనూ ప్రమాణం చేయించాం. కానీ, 2018లో టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక 36 రోజుల తర్వాతగానీ అసెంబ్లీ సమావేశాలను పెట్టలేదు. మేము వెనువెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు పాలన అందిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యాంగా నడపాలనుకున్నారు కాబట్టే బీఆర్​ఎస్​ను ప్రజలు ఓడించారన్నారు. పేదలకు మంచి జరుగుతుందని భావించి కాంగ్రెస్​కు అవకాశం ఇచ్చారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, మిగతా హామీలు కూడా అమలు చేస్తామని స్పష్టంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని, ఇప్పటిదాకా ఆరున్నర కోట్ల జీరో టికెట్లను మహిళలకు అందించామని చెప్పారు. రాజీవ్​ ఆరోగ్య శ్రీ కింద ఫ్రీ ట్రీట్​మెంట్​ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు.

బానిసల్లా చూశారు

పదేండ్ల పాటు ప్రజలను బీఆర్​ఎస్​ నేతలు బానిసల్లా చూశారని, నియంతృత్వ పోకడలతో పాలించారని మంత్రి శ్రీధర్​ బాబు మండిపడ్డారు. అధికారం పోయినా నియంతల్లా పాకులాడుతున్నారని విమర్శించారు. ఏ సమయంలో ఏం చేయాలో తమ ప్రభుత్వానికి ప్రణాళికలున్నాయన్నారు. తెలంగాణ భవన్​లో కూర్చొని బీఆర్​ఎస్​ వాళ్లిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్​ ప్రభుత్వం నడవదని హెచ్చరించారు.  ‘‘మేమేం చేశామో ఒకసారి బస్సుల్లో జర్నీ చేస్తే తెలుస్తుంది. మహిళల మొహాల్లో చిరునవ్వును చూడండి. వారి నుంచి ఫీడ్​బ్యాక్​ తీసుకోండి. వారికి ఇంకేమైనా చేస్తే బాగుంటుందని మీరు చెప్తే అది మేం చేయడానికి సిద్ధం. ప్రజావాణికి వేలాది మంది వస్తున్నారు. సమస్యలు చెప్పుకుని దరఖాస్తులు ఇస్తున్నారు’’ అని ఆయన అన్నారు. రూ. 6.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్​ఎస్​ నేతలు దివాలా తీయించారని మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. వారిని చెత్తబుట్టలోకి ప్రజలు విసిరేసినా ఇంకా బుద్ధి రావడం లేదని అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం వల్లే వాళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఓటమి డిప్రెషన్​లో ఏవేవో అంటున్నారని విమర్శించారు. ‘‘మేమేదో వారి ప్రభుత్వాన్ని బలవంతంగా గుంజుకున్నట్టు.. సీఎం సీటు నుంచి కేసీఆర్​ను తోసేసి రేవంత్​ కూర్చున్నట్టు.. అసలు ప్రజా తీర్పే లేనట్టు మాట్లాడుతున్నారు. దేవుడు, ప్రజలు మాతో ఉన్నారు. ఈ ఐదేండ్లపాటు ప్రజల మొహాల్లో చిరునవ్వులు చూడాలనుకుంటున్నాం. అలాంటి మాకు బీఆర్​ఎస్​ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆర్థిక క్రమశిక్షణతో హామీలను అమలు చేస్తాం. ప్రజలకు ఒక ఉదాహరణగా నిలుస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

మాది గల్లీ బిడ్డల పాలన :  సీతక్క

అధికారం పోయిందన్న అక్కసుతోనే  బీఆర్​ఎస్​ నేతలు కాంగ్రెస్​ ప్రభుత్వంపై దుష్ప్రచారాలకు దిగుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది గడీల పాలన కాదని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన అని చెప్పారు. ‘‘దేశంలో 420 పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బీఆర్​ఎస్సే.  టీఆర్​ఎస్​ పేరును బీఆర్​ఎస్​గా మారిస్తే 420 పోతుందనుకున్నారు.. కానీ, పార్టీ పేరు మారినా 420 పోదు. రాష్ట్రం తమ ఎస్టేట్​.. తమ గడీలు అన్నట్టు పాలన చేసిన బీఆర్​ఎస్​ను కూలదోసి.. ప్రజాపాలనను అందిస్తారనే కాంగ్రెస్​కు ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రజల నుంచి కాంగ్రెస్​ ప్రభుత్వానికి వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేకే బీఆర్​ఎస్​ వాళ్లు భయపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వస్తే.. తెల్లారి నుంచే కూలుస్తం.. పేలుస్తమంటూ బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడారు. పదేండ్ల దోపిడీ పాలనను దించాలనే మాకు  ప్రజలు అధికారం ఇచ్చారు” అని ఆమె పేర్కొన్నారు. మహిళలు బయటకు వచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తుంటే.. మహిళలు బయటకు రావడం ఇష్టం లేని ఫ్యూడల్ బీఆర్​ఎస్​పార్టీ మాత్రం కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. ‘‘బీఆర్​ఎస్​ నేతలు ఆటో డ్రైవర్లను అడ్డం పెట్టుకుని అధికార దాహంతో ఊగిపోతున్నరు. వాళ్లు చెప్పే బడ్జెట్​ బారెడుంటే.. ఖర్చు మాత్రం చారెడంతే. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టిన ఘనులు. మేము శ్వేత పత్రం అంటే.. వాళ్లు స్వేద పత్రమన్నరు. కానీ, వాళ్ల స్వేదం ఎక్కడుంది? ఉద్యమకారులు, ప్రజల కష్టం కాదా అది? బంగారు తెలంగాణ అంటే లక్షల కోట్ల అప్పులు చేయడమా? వాళ్లే బాగా సంపాదించుకున్నారు. రాష్ట్రాన్ని ఆగంపట్టించారని చెప్తే రాష్ట్రాన్ని అవమానించామని అంటున్నారు. బీఆర్​ఎస్​ చేసిన పాపాలకు ప్రజల మీదకు నెపాన్ని ఎందుకు నెడుతున్నారు” అని నిలదీశారు.  త్వరలోనే రూ.500కే గ్యాస్​, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వబోతున్నామని, వాటిని అమలు చేస్తే బీఆర్​ఎస్​కు  గతి ఉండదనే తమపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలపై మంత్రి సీతక్క ఫైర్​ అయ్యారు.

ఫ్రీ జర్నీపై బీఆర్​ఎస్​ కుట్రలు

బస్సుల్లో ఫ్రీ జర్నీ వచ్చిందని మహిళలు ఆనందపడుతుంటే.. బీఆర్​ఎస్​ నేతలు కుట్రలకు తెరదీస్తున్నారని మంత్రి శ్రీధర్​ బాబు  అన్నారు.  ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆటో కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మేనిఫెస్టోలోనూ వారి కోసం హామీలిచ్చామని గుర్తు చేశారు. ‘‘మహిళలకు ఫ్రీ బస్​ జర్నీ వద్దంటే బీఆర్​ఎస్​ వాళ్లు చెప్పాలి. ఆ విషయం మహిళలకూ వాళ్లు చెప్పాలి” అని సవాల్​ విసిరారు. కాగా, రాష్ట్ర ప్రగతితో కలసివచ్చే వాళ్లను కలపుకొని పోతామని శ్రీధర్​ బాబు చెప్పారు. అందులో భాగంగానే అదానీతో సమావేశమయ్యామన్నారు. పెట్టుబడుల విషయంలో పారదర్శకంగా ఉంటామని, సీఎం రేవంత్​ రెడ్డి పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారని ఆయన చెప్పారు.