బెంగళూర్: కర్నాటకలో బుధవారం ఓటేసే జనానికి చీపుర్లు, సీలింగ్ ఫ్యాన్లు కనిపించవు. పోలింగ్ బూత్ లు సహా వాటి పరిసర ప్రాంతాల్లో ఒక్క చీపురు గానీ, ఫ్యాన్ గానీ ఉండదు. అదేంటి ఎన్నికలకు.. చీపుర్లు, ఫ్యాన్లకు సంబంధం ఏంటి, వాటిని కనబడకుండా చేయడమేంటి అనుకుంటున్నారా? ఇవి రెండూ ఎలక్షన్ సింబల్స్. అందుకే వాటిపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది. పోలింగ్ బూత్ లలో చీపుర్లు కనిపించొద్దని, ఫ్యాన్లు ఉంటే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ బూత్ లకు 200 మీటర్ల ప్రాంతంలో ఎక్కడా చీపుర్లు, ఫ్యాన్లు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
పోలింగ్ కు రెండ్రోజుల ముందే వాటన్నింటినీ తొలగించాలని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ చీపురు. ఈ పార్టీ కర్నాటకలో చాలాచోట్ల పోటీ చేస్తోంది. అలాగే బెంగళూర్ లో ఓ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయించారు. ఎలక్షన్ చట్టాల ప్రకారం.. ఓటర్లను ప్రభావితం చేయకుండా ఆ నియోజకవర్గంలోని ఏ పార్టీ జెండా గానీ, సింబల్ గానీ పోలింగ్ బూత్‌లో ఉండకూడదు.
