శివరాత్రి రోజు జాగరణ.. ఉపవాసం ఎందుకు చేయాలి..

శివరాత్రి రోజు జాగరణ.. ఉపవాసం ఎందుకు చేయాలి..

 మహా శివరాత్రి  ( మార్చి 8) ఎంతో పర్వదినం అయిన రోజు. ఆ రోజు జాగరణ చేస్తే ఎంతో మంచిదంటారు పండితులు. శివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. అయితే శివరాత్రి నాడు ప్రతి ఒక్కరు జాగరణ ఉండాలని అంటారు. అసలు మహా శివరాత్రి రోజు ఎందుకు జాగరణ ఉండాలి, ఎందుకు ఉపాసం ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మహా శివరాత్రిని పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి, శివభక్తులు మహా శివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందుతారట. ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి. ఈరోజున రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచినవారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు. ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు. అందుకే వీరంతా వెన్నెముక నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు.అలాగే గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో.. వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు. మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు.

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.

ఉపవాసం:

శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేబుతుంది.  చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. 

ALSO READ :- Ranji Trophy 2024: క్రికెట్‌లో సంచలనం.. చివరి వికెట్‌కు 232 పరుగులు

ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.  శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.

అభిషేకం :

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

జాగరణ:

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుతుందని చెప్తారు.