ఆర్ఎస్ఎస్ ను ఎందుకు నిషేధించాలి

ఆర్ఎస్ఎస్ ను ఎందుకు నిషేధించాలి

ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఏ)కు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరడం. గల్ఫ్​ దేశాల నుంచి హవాలా డబ్బులు రావడం కల్లోలంగా ఉంది. ఈ సంస్థ అబుదాబీలోని దర్బార్​ రెస్టారెంట్​ను తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని భారత్​లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిందని ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణాదిలో కేరళ ఈ గుంపునకు ప్రధాన కేంద్రంగా తెలుస్తున్నది. ఈ సంస్థ కార్యకలాపాలు నియోజకవర్గ పట్టణ స్థాయికి పాకడం ఆందోళన కలిగించే అంశం. ఈ అతివాద సంస్థ ‘జీహాదీ హెహదత్’ పేరుతో ప్రత్యేక స్క్వాడ్​ను ఏర్పాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి. మాస్​ కిల్లింగ్స్, టార్గెట్​ కిల్లింగ్స్​పేరుతో భయోత్పాతం సృష్టించాలని ఈ సంస్థను, దాని అనుబంధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వెంటనే లాలూ, మాయావతి, వామపక్షాలు, కాంగ్రెస్​లోని కొందరు, చిన్నా చితకా సంస్థల వాళ్లు ఆరెస్సెస్​ను నిషేధించాలని యథాలాపంగా డిమాండ్​చేశారు. ఇదీగాక ఇటీవల కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ తరచూ ‘ఆరెస్సెస్​ దేశానికి  ప్రమాదకరం’ అంటున్నారు. ఆరెస్సెస్​ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తుందని వామపక్ష నాయకులు ‘మంత్ర జపం’లా చెబుతుంటారు.

గతంలో అహ్మద్​పటేల్, సల్మాన్​ ఖుర్షీద్, దిగ్విజయ్​ సింగ్​ వంటి కాలం చెల్లిన నేతలు సోనియా గాంధీ చుట్టూ చేరి ఆరెస్సెస్​ను రోజూ తిట్టిస్తుండేవారు. యూపీఏ కాలంలో స్వయంగా సర్​ సంఘ్​ చాలక్​ సుదర్శన్​జీతో సహా ‘సంఘ్’ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఇపుడు రాహుల్​గాంధీ చుట్టూ చేరి ‘ఆరెస్సెస్’ను దోషిని చేయాలని ఆయనతో మాట్లాడిస్తున్నరు.. మార్క్స్​సిద్ధాంతాన్ని గాంధేయవాదం ముసుగులో కాంగ్రెస్​చుట్టూ చేరిన ఆస్థాన విద్వాంసులు వామపక్షాలే. విశ్వవిద్యాలయాల్లో మీడియా, మేథో రంగాల్లో బీజేపీ మీద, ఆరెస్సెస్​ మీద గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించే వర్గాలు కాంగ్రెస్​కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఈ గుంపే ఇప్పుడు ‘సంఘ్’ను నిషేధించాలని కాంగ్రెస్​ బయటా, లోపలా అరచి గీపెడుతున్నది.

సంఘ్​పై నిషేధం-ఎత్తివేత

‘‘బాగా సంఘటితమైన జనాభా లేకుండా బలమైన వ్యక్తిత్వం, త్యాగస్ఫూర్తి గల వ్యక్తులతో కూడిన స్వచ్ఛంద దళం లేకుండా చెప్పుకోదగిన విజయాలేమీ సాధించలేం”అని సంఘ్​ పెద్దలు దేశ విభజన సమయంలో ఎల్కే అద్వానీకి చెప్పిన మాటలు ఇక్కడ స్మరణీయం. గాంధీజీ హత్య తర్వాత 1948 ఫిబ్రవరి 4వ తేదీన ‘సంఘ్’ను నెహ్రూ ప్రభుత్వం నిషేధించింది. నిజానికి నాథూరాం గాడ్సే1933 నుంచే గాంధీని వ్యతిరేకించడమే గాక మరాఠీ పత్రిక అగ్రానీలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవాడు. గాంధీజీ మరణం తర్వాత చెన్నైలో ఉన్న సర్​ సంఘ్​చాలక్​ ఈ దారుణాన్ని ఖండించారు. ఆ తర్వాత 13 రోజులు సంతాప దినాలు ప్రకటించడమే గాక, నాగపూర్​ నుంచి ప్రధానికి విపులంగా లేఖ రాశారు. ఇవన్నీ చరిత్రలో రికార్డయినా మేథోవర్గం పేరుతో సంఘ్​ను నిందిస్తున్నారు. వామపక్షాల తీవ్రమైన కాకి అరుపులకు నెహ్రూ ప్రభుత్వం సంఘ్​పై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది స్వయం సేవకులు అరెస్టయ్యారు.1948 ఫిబ్రవరి 5న సర్దార్​పటేల్​ నెహ్రూకు రాసిన ఓ లేఖ కూడా నిషేధానికి కారణమైంది. కానీ సంఘ్​ మిలిటెన్సీతో ఎన్నడూ తిరగబడలేదు. తర్వాతి కాలంలో సర్దార్​పటేల్ – నెహ్రూల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘సంఘ్’ నిర్దోషి అని పటేల్​ స్వయంగా ఒప్పుకున్నాడు. ‘‘బాపూ హత్య కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణ ప్రగతిని నేనే రోజువారీగా సమీక్షిస్తున్నాను. ప్రధాన నిందితుల కార్యకలాపాల గురించి సుదీర్ఘ ప్రకటనలు చేశారు. ఈ హత్యలో ఆరెస్సెస్​ ప్రమేయం లేదని తేలింది” అని పటేల్​ చెప్పాడు. దాంతో 1949 జులై12న సంఘ్​పై నిషేధం ఎత్తేశారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై శ్రీమతి ఇందిర జెజె కపూర్​ చైర్మన్​గా కమిటీ వేస్తే వాళ్లూ సంఘ్​కు గాంధీ హత్యతో సంబంధం లేదని తేల్చారు. 1949 అక్టోబర్​ 7న సీడబ్ల్యూసీ ఆరెస్సెస్​ సభ్యులను కాంగ్రెస్​లో చేరనివ్వమని తీర్మానం చేసింది.

జాతి ప్రయోజనాల కోసం

1962లో చైనాతో భారత యుద్ధం జరిగింది. అప్పుడు ఆరెస్సెస్ ​తన దేశభక్తి ప్రదర్శించి జాతిని సంసిద్ధం చేసింది. ఈ మేరకు1963 జనవరి 26న రిపబ్లిక్​ పరేడ్​లో పాల్గొనాలని నెహ్రూ ఆరెస్సెస్​ను కోరారు. 30 వేల మంది స్వయం సేవకులకు గణవేషతో ఆహ్వానం లభించింది. అలాగే 1965లో పాకిస్థాన్​ భారత్​పై దాడి చేసినప్పుడు అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని ప్రధాని లాల్ బహదూర్​శాస్త్రి సంఘ్​కు ఆహ్వానం పంపాడు. ఎమర్జెన్సీ విధించిన ఇందిర.. ఆనంద్​మఠ్, ఆరెస్సెస్​ వంటి సంస్థలను నిషేధించింది. 60 కోట్ల మంది స్వేచ్ఛను హరించిన ఈ చీకటి రోజులను సంఘ్ ​మౌనంగా భరించింది. స్వాతంత్ర్యోద్యమంలో సంఘ్​ పాల్గొనలేదనే అజ్ఞానులు ఈ దేశంలో లెక్కకు మిక్కిలి ఉన్నారు. వాళ్లంతా  పఠన పరిజ్ఞానం, పరిశోధనా దృక్పథం లేని శూన్య మనస్కులు. సావర్కర్ యథాలాంపంగా, వ్యూహంలో భాగంగా ‘కాలాపానీ’ శిక్షకు వ్యతిరేకంగా పెట్టుకున్న అర్జీలను సంఘ్​కు అంటగట్టి, బ్రిటీష్​ వాళ్లకు లొంగిపోయిందని విషం చల్లారు. ఇన్ని విషవలయాల నుంచి సంఘ్ తనను తాను ఎప్పుడూ సంస్కరించుకుంటూ సమాజంలో మార్పులకు అనుగుణంగా కార్యకలాపాలు విస్తరిస్తూ పనిచేస్తున్నది. దేశం కోసం మాత్రమే పని చేయాలనే సంఘ్ తన కార్యకలాపాల్లో ఏ పార్టీని విమర్శించదు. జాతి ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తే వాళ్ల వైపు నిలబడుతున్నది. దేశం కోసం నిబద్ధులైన కార్యకర్తలను సృష్టించే పని ‘కర్మాగారంలా’ సంఘ్​ నిరంతం చేస్తున్నది. దేశ విభజన అయినా, దివిసీమ ఉప్పెన అయినా, కరోనా కష్టకాలమైనా.. నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందించింది సంఘ్. ఇవన్నీ తెలియని వాళ్లు ఆరెస్సెస్​ను పీఎఫ్ఐతో పోలుస్తూ నిషేధం విధించాలని కోరుతున్నారు. సంఘ్​ బంతిలాంటిది. ఎంత అణిచేస్తే అంత పైకి లేస్తూనే ఉంటుంది. అది ఈ దేశ మూలతత్వ భావనకు ప్రతీకగా నిలబడింది. 1925లో విజయదశమి రోజు ప్రారంభమైన ఆరెస్సెస్​ విజయ రహస్యం ఇదే.

గాంధీ హత్య తర్వాత..

వార్డు మెంబర్​ ఎన్నికల్లో పోటీ చేసి కూడా గెలవలేదని ఇటీవల కొందరు ‘సర్ ​సంఘ్​ చాలక్’ను ఎద్దేవా చేస్తున్నారు. ‘సంఘ్’ ఈ దేశ సాంస్కృతిక చరిత్రకు సజీవ సాక్ష్యం అని వాళ్లకు తెలియదు. 1925 నుంచి ఈ వందేళ్లలో అనేక రాజకీయ, సామాజిక పరిణామాలను ‘సంఘ్’ చూడటమే గాక, అందులో భాగస్వామి అయింది. దాని పరిణామమే ఈరోజు కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు. సంఘ్​ సిద్ధాంతం భారతదేశ మహోన్నత వైభవం. ఇంతకు మించి వాళ్లకు ఏ ప్రయోజనం లేదు. ఈ క్రమంలో జరిగే అనేక ఘటనలు సంఘ్​ను దోషిగా చూపెడుతాయి. తర్వాత మబ్బుల్లా తేలిపోతాయి. ఇది కొత్తేమీ కాదు. మహాత్మా గాంధీ హత్యతో దేశమంతా అలజడి రేగింది. విజయవాడ ఎస్​ఆర్​ఆర్–సీవీఆర్​ కాలేజీలో 10 వేల మందితో ఓ క్యాంపు జరుగుతున్నది. మహాత్ముడి హత్య వార్త తెలియగానే కమ్యూనిస్టులు జీప్​లకు మైకులు పెట్టుకొని క్యాంపుపై దాడి చేయండని రెచ్చగొట్టారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట అయిన విజయవాడలోని కొందరు స్టేషన్​లో రైళ్ల నుంచి దిగుతున్న ఆరెస్సెస్​ స్వయం సేవకులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది గాయపడ్డారు. కానీ అక్కడున్న ఎందరో నాయకులు ఎదురు దాడి చేయమని చెప్పలేదు. కార్యకర్తలను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. ఉత్తర తెలంగాణలో ఎందరో అఖిల భారత విద్యార్థి పరిషత్​ కార్యకర్తలను నక్సలైట్లు పట్టపగలు ప్రాణాలు తీశారు. కేరళలోనూ ‘కిషన్​మాస్టర్’​ అనే టీచర్​ను కమ్యూనిస్టులు క్లాస్​రూంలోనే నరికి తలను బల్లపై విద్యార్థుల ముందు పెట్టారు. వందలాది స్వయం సేవకులు ఈ రోజుకూ మరణిస్తూనే ఉన్నారు. అయినా వాళ్లు సేవ చేయడం మానటం లేదు. క్రమశిక్షణలో లోపం లేకుండా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అదే వారికి శ్రీరామ రక్ష అవుతున్నది.

- డా. పి. భాస్కర యోగి, సోషల్​ ఎనలిస్ట్