మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ట్రిక్: కోటీశ్వరులను చేస్తున్న SIP మ్యాజిక్

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ట్రిక్:  కోటీశ్వరులను చేస్తున్న SIP మ్యాజిక్

ఈరోజుల్లో ఉద్యోగుల నుంచి మధ్యతరగతి ఫ్యామిలీస్ వరకూ చాలా మంది తమ పెట్టుబడులను SIP రూపంలో చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో వచ్చిన అనేక సౌకర్యాలతో సిప్ పెట్టుబడులు పాపులారిటీ అయ్యాయి. సిప్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే కేవలం డబ్బు దాచుకోవడం కాదు.. అది ఒక మ్యాజిక్ అని చెప్పొచ్చు. సాధారణంగా మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి చాలామంది ఇన్వెస్టర్లు తప్పులు చేస్తుంటారు. అయితే తెలివితేటల కంటే క్రమశిక్షణే ఇన్వెస్టర్లను ధనవంతులను చేస్తోందని  డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘నేత్రా’ రిపోర్ట్ బయటపెట్టింది. 

ఎందుకు SIP తోనే ఎక్కువ లాభం?
చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్ పడిపోయినప్పుడు భయంతో అమ్మేయడం, పెరిగినప్పుడు ఆశతో కొనడం చేస్తుంటారు. ఈ ఎమోషనల్ డెసిషన్స్ వల్ల మార్కెట్ ఇచ్చే అసలు లాభాలను వారు అందుకోలేరు. ఇక్కడే SIP ఒక సైలెంట్ వారియర్ లా పనిచేస్తుంది. మార్కెట్ పెరిగినా, తగ్గినా SIP ఆగదు. దీనివల్ల బిహేవియరల్ గ్యాప్ తగ్గి.. అసలైన మార్కెట్ లాభాలు ఇన్వెస్టర్ ఖాతాలోకి చేరతాయి. గత 30 ఏళ్లలో దేశంలో SIP దాదాపు 12% రిటర్న్స్ ఇచ్చింది. ఐదేళ్ల కాలపరిమితితో చూస్తే 74% రాబడులను తెచ్చిపెట్టింది ఇన్వెస్టర్లకు.

లార్జ్ క్యాప్స్ వైపు మొగ్గు..
ప్రస్తుతం స్మాల్ అండ్ మిడ్-క్యాప్ షేర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆకర్షణీయమైన వాల్యుయేషన్లలో అందుబాటులో ఉన్నాయని రిపోర్ట్ వెల్లడించింది. నిఫ్టీ ధరలు ప్రస్తుతం లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే తక్కువగా ఉండటం ఇన్వెస్టర్లకు ఒక మంచి సంకేతం. అయితే మార్కెట్ ఇంకా పడుతుందని వేచి చూడటం చేయకుండా.. మీ బడ్జెట్ కి అనుకూలంగా ఈక్విటీ కేటాయింపులను పెంచుకోవడం బెస్ట్.

దేశంలో ప్రైవేట్ వినియోగం కొంత నెమ్మదించినా.. అది కుప్పకూలడం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా బలంగానే ఉంది. కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఇప్పుడు చాలా క్లీన్‌గా ఉన్నాయి. అప్పులు తగ్గి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెరగడం వల్ల నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్‌కు భారత్ సిద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఇన్వెస్టర్లు తమ SIP ని ఆపకుండా కొనసాగిస్తే.. మార్కెట్ ఇచ్చే లాభాల కంటే మీ క్రమశిక్షణ ఇచ్చే లాభమే రేపటి కోటీశ్వరులుగా మారుస్తుందని దీని ద్వారా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, జపాన్, బ్రెజిల్, కొరియా, తైవాన్ వంటి దేశాలతో పోల్చితే ఇండియాలో సిప్ రిటర్న్స్ 12 శాతం ఉండటం గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇన్వెస్టర్లకు.