ఆకాశానికి స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లలో ఆశలకు 5 కారణాలు ఇవే..

ఆకాశానికి స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లలో ఆశలకు 5 కారణాలు ఇవే..

ఇరాన్ వార్ ముగింపునకు రాబోతోందనే సానుకూల వార్తలు స్టాక్ మార్కెట్లను ఆకాశమే హద్దుగా ర్యాలీకి ప్రేరేపిస్తోంది. టెన్షన్స్ తగ్గుదలతో ఇన్వెస్టర్లలో ఆశలు చిగురించటంతో పాటు ప్రధానంగా తక్కువ ధరల వద్ద క్వాలిటీ స్టాక్స్ కొనేందుకు పెరుగుతున్న డిమాండ్ మార్కెట్లలో బుల్స్ హవా కొనసాగేలా చేస్తోంది. బుధవారం ఉదయం 10.27 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1230 పాయింట్ల లాభంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా లాభపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచ 1093 పాయింట్లు, నిప్టీ మిడ్ క్యాప్ సూచీ 1265 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో దూసుకుపోతున్నాయి. 

దేశీయ స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపిస్తున్న కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. ముడిచమురు ధరల పతనం:
గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 4.34% తగ్గి బ్యారెల్‌కు 99.95 డాలర్ల వద్దకు చేరుకుంది. చమురు ధరలు 100 డాలర్ల మార్కు కంటే దిగువకు రావడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇది ద్రవ్యోల్బణ భయాలను తగ్గించి, మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

2. అమెరికా - ఇరాన్ శాంతి చర్చల ఆశలు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లకు బూస్ట్ ఇచ్చాయి. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశం ఉందని, వివాదం త్వరలోనే ముగియవచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నేరుగా చర్చలను ఖండించినప్పటికీ.. ఒక పరిష్కార ప్రతిపాదన ఇప్పటికే టెహ్రాన్‌కు చేరినట్లు వస్తున్న వార్తలు యుద్ధ మేఘాలను తొలగించాయి.

3. గ్లోబల్ మార్కెట్ల సానుకూలత:
ఆసియా మార్కెట్లైన నిక్కీ, కోస్పి, హాంగ్ సెంగ్ సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభమవుతాయన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ సానుకూల వాతావరణం మన మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపింది.

4. హార్ముజ్ జలసంధి భద్రత:
క్రూడ్ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలకు ఆటంకం ఉండదని ఇరాన్ భరోసా ఇవ్వడం మరో ప్లస్ పాయింట్. దీనివల్ల ఇంధన సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మార్కెట్ భావిస్తోంది. ఇది చమురు ధరల స్థిరీకరణకు తోడ్పడింది. దీంతో మార్కెట్లలో బుల్స్ జోష్ తిరిగొచ్చింది.

5. తగ్గిన ఇండియా VIX:
మార్కెట్ భయాన్ని సూచించే ఇండియా VIX ఇండెక్స్ 0.31% తగ్గి 24.66కు చేరుకుంది. ఈ సూచీ తగ్గడం అంటే మార్కెట్లో అనిశ్చితి తగ్గుతోందని, ఇన్వెస్టర్లలో భయాందోళనలు పోయి నమ్మకం పెరుగుతోందని అర్థం. తక్కువ ఓలటాలిటీ ఎప్పుడూ ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా ఉంటుంది. సో మొత్తం మీద.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి, చమురు ధరలు అదుపులోకి రావడమే ప్రస్తుత బుల్ జోరుకు ప్రధాన కారణాలుగా మారాయి.