సంచార జాతి వాళ్లని అడ్డుకున్న థియేటర్ సిబ్బంది.. తమిళనాడులో రచ్చ రచ్చ 

సంచార జాతి వాళ్లని అడ్డుకున్న థియేటర్ సిబ్బంది.. తమిళనాడులో రచ్చ రచ్చ 

డబ్బులు ఉంటే సరిపోదు.. డాబు ఉండాలి.. టికెట్ ఉంటే సరిపోదు సినిమా థియేటర్ లోకి వెళ్లటానికి.. హోదా ఉండాలి.. నీట్ గా ఉండాలి అంటున్నారు చెన్నైలోని మల్లీప్లెక్స్ థియేటర్స్ సిబ్బంది. మార్చి 30వ తేదీ హీరో శింబు నటించిన పత్తు తల సినిమా రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. చెన్నైలోని ప్రముఖ రోహిణి థియేటర్ లో ఫస్ట్ షో కోసం పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. ఇదే సమయంలో సంచార జాతులకు చెందిన ఓ ఫ్యామిలీ కూడా వచ్చింది. పది టికెట్లు కొనుగోలు చేశారు. అయితే  టికెట్ ఉన్నా వీళ్లను ధియేటర్ లోకి అనుమతించలేదు సిబ్బంది. మిమ్మల్ని అనుమతించం.. టికెట్ ఉన్నా లోపలికి పంపించం అంటూ అడ్డుకున్నారు.

వీళ్లు సంచార జాతికి చెందిన వారు. దోమ తెరలు అమ్ముకుంటూ జీవిస్తుంటారు. వారి వేషధారణ అంద విహీనంగా ఉండటంతో థియేటర్ సిబ్బంది అనుమతించలేదు. టికెట్ ఉన్నా పంపించకపోవటంపై అక్కడే ఉన్న జర్నలిస్టులు ప్రశ్నించినా.. రోహిణి థియేటర్ సిబ్బంది ససేమిరా అన్నారు. ఈ విషయాన్ని వివేక్ అనే జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. సంచార జాతికి చెందిన వారు అయినా..150 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేశారని.. అయినా థియేటర్ వాళ్లు ఎందుకు అమనతించటం లేదంటూ నెటిజన్లు రచ్చరచ్చ చేశారు. సోషల్ మీడియాలో ఏకంగా క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది. అంతే రోహిణి థియేటర్ యాజమాన్యం దిగివచ్చింది.

పత్తు తల సినిమాకు యూ, ఏ సర్టిఫికెట్ ఉందని.. 12 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదని.. అందుకే ధియేటర్ సిబ్బంది అడ్డుకున్నారని వివరణ ఇచ్చింది. రోహిణి ధియేటర్ యాజమాన్యం వివరణతో మరింత రెచ్చిపోయారు నెటిజన్లు. అన్ని సినిమాలకు.. అందరికీ ఇలాంటి నిబంధనే అమలు చేస్తారా.. యూ, ఏ సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమాకు 12 ఏళ్లలోపు పిల్లలను గతంలో అనుమతించలేదా.. ఇక నుంచి అనుమతించరు కదా అంటూ ఫొటోలు, వీడియోలతో బీభత్సం చేశారు నెటిజన్లు. 

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడవటంతో.. మొత్తానికి సంచార జాతికి చెందిన ఫ్యామిలీ మొత్తానికి.. పిల్లలతో సహా ధియేటర్ లోకి అనుమతించారు.. శింబు సినిమా పత్తు తల చూపించారు. ఈ వీడియోను కూడా స్వయంగా పోస్ట్ చేసింది రోహిణి ధియేటర్ యాజమాన్యం. 

అసలు కారణం ఏంటంటే.. ఫస్ట్ డే.. ఫస్ట్ షోకు వీఐపీలు వస్తుంటారని.. వీళ్లను థియేటర్ లోకి అనుమతిస్తే.. వీరి పక్కన కూర్చోవటానికి మిగతా ఆడియన్స్ కు ఇబ్బందిగా ఉంటుందంటూ ధియేటర్ సిబ్బంది సమర్థించుకోవటం సంచలనంగా మారింది.  

మొత్తానికి ఒక్క విషయంపై మరోసారి క్లారిటీ వచ్చింది..  దొంగ  దొరగా వచ్చినా గౌరవిస్తారు.. అదే డబ్బుతో.. నిజాయితీగా వచ్చినా అంద విహీనంగా ఉంటే మాత్రం రానివ్వరు అనేది తేలిపోయింది.. సోషల్ మీడియాలో స్పందించింది కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే వీళ్లను ధియేటర్ కనీసం గేటు దగ్గరకు కూడా రానిచ్చేది కాదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..