బార్డర్ లో వీడని భయం.. ఏడు నగరాలకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు..

బార్డర్ లో వీడని భయం.. ఏడు నగరాలకు ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు రద్దు..

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమనిగినప్పటికీ సరిహద్దు నగరాల్లో భయం కొనసాగుతునే ఉంది. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత పాక్ వంకర బుద్ధి చూపించిన క్రమంలో భయం నుంచి జనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.. ఏడు నగరాలకు ఫ్లైట్స్ రద్దు చేసినట్లు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ( మే 13 )  జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు టూవే ఫ్లైట్స్ రద్దు చేసినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.

జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్ మరియు రాజ్‌కోట్‌లకు టూవే ఫ్లైట్స్ రద్దు చేసినట్లు తెలిపింది ఇండిగో. సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా భద్రతను దృష్టిలో ఉంచుకొని జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్ రాజ్‌కోట్‌లకు బయలుదేరే విమానాలు మంగళవారం రద్దు చేశామని... పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తదుపరి సమాచారం అందిస్తామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ఎయిర్ ఇండియా.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని... ఇందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇండిగో. తమ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని... తదుపరి సమాచారం అందిస్తామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విమానాల రద్దు తర్వాత సోమవారం ( మే 12 ) తిరిగి తమ సేవలు పారంబించాయి ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్.గత వారం తాత్కాలికంగా మూసేసిన 32 విమానాశ్రయాలలో మే 15న తిరిగి ప్రారంభమవుతాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది