పొగాకు రహిత దేశంగా న్యూజిలాండ్ ఆదర్శం : కనుమ ఎల్లారెడ్డి

పొగాకు రహిత దేశంగా న్యూజిలాండ్ ఆదర్శం : కనుమ ఎల్లారెడ్డి

సిగరెట్ వ్యక్తిని నెమ్మది, నెమ్మదిగా ప్రాణం తీస్తుంది. కొందరికి సిగరెట్లు లేనిదే ఏమీ తోచదు. ఎంత వద్దనుకున్నా కొందరికి ధూమపానం చేయాలి  అనే ప్రాణం లాగుతూనే ఉంటుంది. ఇక్కడే ధూమపాన ప్రియులు నిక్కచ్చిగా ఉండి, సిగరెట్ స్థానంలో ఏదో ఒకటి తీసుకోవాలి. అసలు పొగనే పీల్చరాదు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఒకటైన గాంధేయ సూత్రాలలో ధూమపానం, మత్తు పానం కూడదు అని చెప్పబడింది. అయినా దీనిని ఎవరూ ఖాతరు చేయడం లేదు. నేడు యువత ఎక్కువగా ఈ ధూమపానంకు అలవాటు పడిపోతున్నారు. ఒక ఫ్యాషన్ గా అలవాటు చేసుకుని పూర్తిగా బానిసలు అవుతున్నారు. వయసు మళ్ళిన వాళ్ళలో  ఇది కొంచెం తగ్గినా ఇది పూర్తిగా తగ్గాలి. పని ఒత్తిడి లో ఉన్న వాళ్ళు ధూమపానంకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కొంతమంది రోజుకు నాలుగు నుంచి పది ప్యాక్ ల సిగరెట్లు తాగే ఘనులు ఉన్నారు. వీరికి ఏమి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. తమ ఆరోగ్యానికి తామే తూట్లు పొడుచుకుంటున్నామని తెలుసు కోలేక పోతున్నారు. అది గ్రహించే న్యూజిలాండ్ దేశం పొగాకు రహిత దేశంగా తమ దేశాన్ని ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

దుష్పరిణామాలు అనేకం

సిగరెట్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు, వాటి పరిణామాలు మొదలగు వాటిపై విస్తృత మైన ప్రచారం పట్టణ, గ్రామాల్లో జరగాలి. ప్రజలను చైతన్య వంతులను చేయాలి. డాక్యుమెంటరీ చిత్రాలను చూపించాలి. సిగరెట్ ప్యాక్ పై , బీడీల కట్ట పై,  క్యాన్సర్​ కారకాల లేబుల్స్​ పెడుతున్నారు.    అది ఏమేరకు మార్పు తెచ్చిందో తెలియదు. అసలు సిగరెట్స్ ఎక్కడా విక్రయించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటే పొగాకు వాడకం తగ్గుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ అదే  దిశలో అడుగు వేస్తోంది. పొగాకు విక్రయించాలి అంటే వయసుకు సంబంధించిన ఆధారాలు చూపించవల్సి ఉంటుంది. యువతకు ఎక్కడా వీటిని విక్రయించ రాదు, పొగ తాగరాదు అని ప్రకటన చేయాలి. ఏదయినా షాప్ లలో అది చిన్నదైనా, పెద్దదైన సిగరెట్​ ఎక్కడా అమ్మరాదు. సిగరెట్ అమ్ముతున్న వివిధ అంగళ్ళల్లో విస్తృత తనిఖీలు చేసి జరిమానా విధిస్తే చాలా వరకు సిగరెట్ తాగే వారు తగ్గుతారు. ఫలితంగా సిగరెట్ అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోతాయి. ఇక ఎవరు వాటి వైపు కన్నెత్తి కూడాచూడరు అని సిగరెట్  అంటే వాడని వారు చెప్పే మాటలు.  కానీ సిగరెట్ ఎక్కువగా తాగే వారి మాటలు వేరే విధంగా ఉన్నాయి.సిగరెట్లు తాగడం వల్ల మాకు చక్కని ఆలోచనలు వస్తాయి,  పనిలో వత్తిడి ఉన్నప్పుడు పొగ పీల్చడం మాకు ఎంతో శ్రేయస్కరం అని రోజూ ఒకటి లేదా రెండు సిగరెట్లు కాల్చడం వలన వచ్చే ముప్పు ఏమీ లేదని  సిగరెట్ ప్రియులు అంటున్నారు. అయితే ఈ విషయంలో సిగరెట్ నిషేధకులు ఏకీభవించడం లేదు.

పొగాకు రహిత దేశంగా..

పొగ అనేది చాలా ప్రమాదమని అది వ్యక్తులకే కాక పర్యావరణాన్ని కూడా పాడు చేస్తుందని, దీనికి అందరూ దూరంగా ఉండాలని, పొగాకు రహిత దేశంగా ఉండటం ఉత్తమమని, ఈ విషయంలో న్యూజిలాండ్ లో చేసిన చట్టం సత్పలితాలు ఇచ్చి, అన్ని దేశాలకు ఆదర్శం అవుతుందని చెబుతున్నారు. న్యూజిలాండ్ ఆశించిన విధంగా 2025 నాటికి ఆ దేశం పూర్తిగా ధూమపాన రహిత దేశంగా మనగలుగుతూ ఇతర దేశాలకు ఆదర్శం అవుతుందని చెప్పాలి.  ఇప్పటికే న్యూజిలాండ్ లో పొగతాగడం చాలా వరకు అయిష్టతతో ఉన్నారని  గణాంకాలు చెబుతున్నాయి. చట్టాలు చేయడం ముఖ్యం కాదు. వాటిని ఆచరించి, అమలు చేసే వ్యవస్థ కఠినంగా ఉండాలి. భారత్ లో అటువంటి వ్యవస్థ పొగతాగడం నిషేధం ఉన్నా, చట్టం ఉన్నా నిర్వీర్యం అయ్యాయి. కానీ న్యూజిలాండ్ పటిష్టమైన చట్టం తీసుకు రావడం, ఆ దిశలో అడుగులు వేయడం అభినందించదగ్గ విషయం. న్యూజిలాండ్ లో ఈ చట్టం విజయవంతమైతే ఆ బాటలోనే మరిన్ని దేశాలు ముందుకు వచ్చి సిగరెట్లు పూర్తిగా నిషేధించి ఆరోగ్యమే లక్ష్యంగా అన్ని దేశాలు సాగుతాయని ఆశిద్దాం. 

న్యూజిలాండ్​లో చట్టం అమలు

2025 నాటికి దేశంలో ఎక్కడా పొగాకు ఉత్పత్తులు ఉండకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందు నిమిత్తం ఓ వినూత్న చట్టాన్ని ఆ దేశం తీసుకు వచ్చింది. సిగరెట్ కొనుగోలు చేయకుండా యువత పై జీవిత కాలం నిషేధం విధించే దిశగా  ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించింది.2009 జనవరి 1 నుంచి, ఆ తర్వాత పుట్టిన వారికి పొగాకు నిషేధిస్తూ ఓ కొత్త చట్టాన్ని తెచ్చింది. 2025 నాటికి న్యూజిలాండ్ పొగాకు రహిత  దేశంగా ఉండాలని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారుల ఆలోచన. ధూమపానం చేసే వారికి ప్రథమంలో ఓ సున్నిత హెచ్చరిక చేసి, తదుపరి అదే చేస్తే భారీ జరిమానా విధించడానికి కూడా న్యూజిలాండ్ వెనుకాడదు. దేశంలో సిగరెట్ తాగే వారి కన్నా, వారి నుంచి వదిలే పొగ వలన ఏంతో మందికి నష్టం కలుగుతోంది. కేవలం పొగ తాగనంత మాత్రాన సరిపోదు. ఆ పొగ వదులుతున్న వ్యక్తి  ప్రక్క వారికి కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పొగరాయుళ్లు ఒకరికి ఇబ్బందులు కలిగించ కూడదు. ధూమపానం ఒక్క సారిగా మాన కున్నా.. దశల వారిగా వదిలేస్తూ రావాలి.భారత్ లో కూడా ఈ ధూమపానం పై నిషేధాలు ఉన్నా చట్టాలు పకడ్బందీగా లేకపోవడంతో ఆశయం నీరుగారింది. భారత్ లో విచ్చలవిడిగా సిగరెట్లు పీల్చే వాళ్ళు ఉన్నారు. ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా పొగను గాలిలోకి వదులుతూ ఆనందించే వారు కోకొల్లలు.  మైనారిటీలు కూడా దీన్ని ఒక ఫ్యాషన్ గా అనుకుంటున్నారు. కానీ అది ఎంత చెడ్డదో ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలియడం లేదు. అందుకే పొగాకు నిషేధంతో  సిగరెట్ నియంత్రణ లోనికి వస్తుందని చెబుతున్నా రు. కానీ పొగాకు వాణిజ్య పంట కాబట్టి ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడితే తప్ప దాన్ని నిషేధించాల్సిందే.

- కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు