ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ .. నాలుగు దశాబ్దాల తర్వాత జీహెచ్ఎంసీ ఫోకస్

 ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ ..  నాలుగు దశాబ్దాల తర్వాత జీహెచ్ఎంసీ ఫోకస్

హైదరాబాద్, వెలుగు:  ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రోడ్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. రద్దీగా ఉండే12  ప్రాంతాల్లో ఇప్పటికే​పనులను ప్రారంభించింది. వీటిలో 4 ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ కూడా పూర్తయింది. లోక్ సభ ఎన్నికల తర్వాత పనులు మొదలుపెట్టనుంది. ఓల్డ్ సిటీలో  రోడ్ల విస్తరణకు ప్రధానంగా ఆస్తుల సేకరణ అడ్డంకిగా ఉండి  ఇబ్బందులు వస్తుండగా దశాబ్దాలుగా ఎక్కడ కూడా పనులు జరగలేదు.  సిటీ డెవలప్ అవుతుండడంతో పాటు జనాభా పెరిగిపోతుండగా చిన్న రోడ్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. 40 ఏళ్ల కింద చార్మినార్ డెవలప్ మెంట్​లో భాగంగా అప్పట్లో కొన్ని రోడ్లను విస్తరించారు. అనంతరం నేటి వరకు  ఎక్కడ కూడా వైడెనింగ్ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం 20 నుంచి 40 ఫీట్లు ఉన్న రోడ్లను 60 నుంచి 80 ఫీట్ల దాకా విస్తరించే పనులు 30 కిలోమీటర్ల మేర కొనసాగిస్తుండగా.. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరనుంది. రోడ్ల విస్తరణ తర్వాత ఓల్డ్ సిటీకి  కొత్త కళ రానుంది. ఏడాదిలోపు పనులను పూర్తిచేయాలని బల్దియా అధికారులు ప్లాన్ చేశారు. మొత్తం 600 ఆస్తులకుగాను ఇప్పటికే 200 ప్రాంతాల్లో సేకరించారు. మొత్తం రూ.600 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేశారు. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. 

జనాభా పెరుగుతుండగా విస్తరణ మస్ట్  

పాతబస్తీలో రోడ్లను వైడెనింగ్​చేసేందుకు పలుమార్లు బల్దియా అనుకున్నప్పటికీ ఆస్తుల సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రాపర్టీ దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా పనులను వాయిదా వేస్తోంది. ఈసారి ప్లాన్ తో రోడ్ల వైడెనింగ్ చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాతో  ప్రస్తుతం విస్తరణ చేయాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడుతుండగా ప్రజలకు నచ్చజెప్పి ఆస్తులను సేకరిస్తున్నారు. కొందరు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తుండగా, మరికొందరు వెనక్కి తగ్గుతున్నారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆస్తుల యజమానులతో మాట్లాడి సేకరించేందుకు సహకరిస్తున్నారు. ఆస్తులను అప్పగించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కూడా బల్దియా అధికారులు కోరుతున్నారు. 

చార్మినార్​ జోన్ లోనే ఎక్కువ..

గ్రేటర్ సిటీలో ఎల్ బీనగర్, ఖైరతాబాద్​, సికింద్రాబాద్​, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, చార్మినార్ జోన్లు ఉండగా, అన్ని జోన్లలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు రోడ్ల విస్తరణ చేస్తున్నారు. ఒక్క చార్మినార్ జోన్​లోనే ఇప్పటి వరకు రోడ్ల వైడెనింగ్​పనులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కూడా ఆస్తులను ఇచ్చేందుకు ప్రజలు ముందుకొస్తుండడంతో పనులు స్టార్ట్​ చేశారు.  బండ్లగూడ జంక్షన్ నుంచి ఎర్రకుంట, ఉమర్ హోటల్ నుంచి బాలాపూర్ 100 ఫీట్ల రోడ్డు, రక్షాపురం నుంచి రియాసత్ నగర్ రోడ్డు,  ఓల్డ్ ఛత్రినాక పీఎస్ నుంచి మహంకాళి టెంపుల్ వరకు రోడ్ల వైడెనింగ్ కు  సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం 120 ఆస్తుల సేకరణ పూర్తి చేశారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత పనులను 
ప్రారంభించనున్నారు.

ఇంకొన్నిచోట్ల విస్తరించాలని స్థానికుల డిమాండ్  

ఓల్డ్ సిటీలో మరిన్ని రోడ్లను విస్తరించాలని స్థానికుల నుంచి డిమాండ్ వస్తోంది. కాలనీ రోడ్లతో పాటు మెయిన్ రోడ్లను కూడా వైడెనింగ్ చేయాలని బల్దియాను కోరుతున్నారు. అలియాబాద్, చంద్రాయణగుట్ట, లాల్ దర్వాజ, తలాబ్ కట్ట, మీరాలంమండి వంటి ప్రాంతాల్లో  మెయిన్ రోడ్లను కూడా చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. 1986లో చార్మినార్ నుంచి చంద్రాయగుట్ట వరకు 80 నుంచి వంద ఫీట్ల వరకు రోడ్డుని విస్తరిస్తామని అప్పట్లో ఎంసీహెచ్ సుప్రీంకోర్టుకు సైతం నివేదిక అందజేసింది. కానీ పనులు మాత్రం నేటికీ చేయలేదు. ఇలాంటి రోడ్లపై బల్దియా ఫోకస్ పెట్టాలని ఓల్డ్ సిటీ జనం కోరుతున్నారు.