కేంద్ర ప్ర‌భుత్వ స్కీమ్: భార్యాభర్తలకు రూ.10 వేల పెన్షన్

కేంద్ర ప్ర‌భుత్వ స్కీమ్: భార్యాభర్తలకు రూ.10 వేల పెన్షన్

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక 2015లో అమ‌లులోకి తెచ్చిన అటల్ పెన్ష‌న్ యోజ‌న స్కీమ్ ద్వారా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూక‌లిసి రూ.10 వేల వ‌ర‌కూ పెన్ష‌న్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) వెల్ల‌డించింది. ఈ స్కీమ్‌లో భార్య‌, భ‌ర్త ఇద్ద‌రూ న‌మోదు చేసుకుంటే గ‌రిష్టంగా ఇద్ద‌రూ చెరో రూ.5 వేల చొప్పున పొంద‌వచ్చ‌ని ట్వీట్ చేసింది. ఈ స్కీమ్‌లో ఎన్‌రోల్ చేసుకునేవాళ్లు 18 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య వాళ్లు మాత్ర‌మే అయ్యి ఉండాలని తెలిపింది. దేశంలో ఉన్న అసంఘ‌టిత రంగంలోని వారు కూడా వృద్ధాప్యంలో గౌర‌వ‌మైన జీవితం గ‌డిపేందుకు వారికి పెన్ష‌న్ ఉండేలా మోడీ స‌ర్కారు అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో చేరే వాళ్ల‌కు బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసులు సేవింగ్స్ అకౌంట్ క‌చ్చితంగా ఉండాలి. ఈ ప‌థ‌కం నుంచి ల‌బ్ధి పొందేందుకు నెల‌కు రూ.42 నుంచి రూ.250 మ‌ధ్య‌ చెల్లిస్తే రూ.1000 నుంచి రూ.5000 వ‌ర‌కు పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు.  ఈ పెన్ష‌న్ 60 ఏళ్ల వ‌య‌సు దాటాక ప్ర‌తి నెల త‌మ బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ అవుతుంది. ఈ పెన్ష‌న్ స్కీమ్‌లో చేరే వారికి కేంద్ర ప్ర‌భుత్వం 50 శాతం ప్రీమియం లేదా ఏడాదిలో రూ.వెయ్యి, ఏది త‌క్కువ ఉంటే ఆ మొత్తం చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వాలు అందించే ఏ సామాజిక భ‌ద్ర‌తా స్కీమ్ పొంద‌ని, ఇన్‌కం ట్యాక్స్ ప‌రిధిలోకి రాని వారికి మాత్ర‌మే కేంద్రం ఆ సొమ్మును జ‌మ చేస్తుంది.