వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య
  • కామారెడ్డి జిల్లా గాంధారి సమీపంలో ఈ నెల 16న దొరికిన డెడ్‌‌బాడీ
  • మేడ్చల్‌‌కు చెందిన నరేశ్‌‌గా గుర్తింపు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం సమీపంలో ఈ నెల 16న సగం కాలిన స్థితిలో కనిపించిన యువకుడి డెడ్‌‌బాడీ మిస్టరీ వీడింది. మేడ్చల్‌‌ జిల్లా కీసర మండలానికి చెందిన నరేశ్‌‌గా గుర్తించిన పోలీసులు, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అతడి భార్యే ప్రియుడితో చంపించినట్లు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేశ్‌‌ చంద్ర బుధవారం వెల్లడించారు. 

మేడ్చల్‌‌ జిల్లా కీసర మండలం భవానీనగర్‌‌కు చెందిన నరేశ్‌‌కు తన దగ్గరి బంధువైన నవనీతతో 2012లో పెండ్లి జరిగింది. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవించేవారు. ఆంజనేయులు అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్న క్రమంలో.. నవనీతకు, ఆంజనేయులుకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం నరేశ్‌‌కు తెలియడంతో భార్యను మందలించాడు. దీంతో నరేశ్‌‌ను అడ్డుతొలగించుకోవాలని భావించిన నవనీత ఈ విషయాన్ని ఆంజనేయులుకు చెప్పింది.

క్రమంలో అంజనేయులు ఈ నెల 15న నరేశ్‌‌కు ఫోన్‌‌ చేసి రాంపల్లి చౌరస్తా వద్దకు రప్పించాడు. అక్కడి నుంచి నిజామాబాద్‌‌ జిల్లాలోని పెద్దగుట్ట దర్శనానికి వెళ్దామని చెప్పి బైక్‌‌పై బయలుదేరారు. పెద్దగుట్టలో దర్శనం అనంతరం తిరిగి వెళ్తూ మార్గమధ్యలోని గాంధారిలో మద్యం కొనుక్కొని చద్మల్‌‌ రోడ్డు పక్కన కూర్చొని తాగారు. నరేశ్‌‌ మద్యం మత్తులో ఉన్న టైంలో అంజనేయులు అతడిపై దాడి చేసి హత్య చేశాడు.

శవాన్ని ఎవరూ గుర్తు పట్టకూడదన్న ఉద్దేశంతో పెట్రోల్‌‌ పోసి నిప్పంటించాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి మృ-తుడి వివరాలు సేకరించిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో హత్య విషయం వెలుగుచూసింది. దీంతో అంజనేయులుతో పాటు నవనీతను అరెస్ట్‌‌ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.