బీజేపీ కార్యకర్త భార్యపై గ్యాంగ్‌ రేప్‌.. ఇద్దరు తృణమూల్ లీడర్ల అరెస్ట్

బీజేపీ కార్యకర్త భార్యపై గ్యాంగ్‌ రేప్‌.. ఇద్దరు తృణమూల్ లీడర్ల అరెస్ట్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వికృత దారిలోకి వెళ్తున్నాయి. బీజేపీకి చెందిన ఓ కార్యకర్త భార్యపై ఐదుగురు దుర్మార్గులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. భర్త ఇంట్లోలేని సమయంలో చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి ఈ అకృత్యానికి పాల్పడ్డారు. హౌరా జిల్లాలోని అమతాలో శనివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్ నేతలే. మిగిలిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇటీవలే స్ట్రోక్‌తో మాట కోల్పోయిన మహిళ

హౌరా జిల్లాలోని అమతాలో నివసించే బీజేపీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు అకృత్యానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితమే బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మాట కోల్పోయిన ఆ మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంట్లో అతడు లేని సమయం చూసి శనివారం రాత్రి ఐదుగురు దుర్మార్గులు చొరబడి ఆమె కాళ్లు చేతులు కట్టేశారు. ఆమె మాట్లాడలేకపోవడంతో సాయం కోసం కేకలు కూడా వేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. అటువంటి స్థితిలో ఉన్న ఆమెపై కర్కశంగా ఐదుగురు కలిసి అత్యాచారానికి ఒడిగట్టి, పారిపోయారు. తెల్లారాక ఆ మహిళ బిడ్డ ఆ గదిలోకి వెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి ఉండడం చూసి భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు. దీంతో ఇరుగుపొరుగు జనాలు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం వచ్చిన ఆమె భర్త ఆస్పత్రిలో వివరాలు తెలుసుకున్నాడు. ఈ అకృత్యానికి పాల్పడిన వాళ్లెవరో తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని చెప్పారు.

తృణమూల్ యూత్ లీడర్, ఏరియా ప్రెసిడెంట్ అరెస్ట్

బీజేపీ కార్యకర్త భార్యపై జరిగిన రేప్‌ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇద్దరిలో ఒక నిందితుడు బగ్నాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ యూత్ లీడర్, రెండో నిందితుడు ఆ ఏరియా ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మిగిలిన ముగ్గురు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లేనని బాధిత మహిళ భర్త ఆరోపిస్తున్నాడు.