మామూలు పెళ్లాం కాదయ్యా : భర్త నల్లగా ఉన్నాడని.. భార్య వేధింపులు : హైకోర్టు సంచలన తీర్పు..

మామూలు పెళ్లాం కాదయ్యా : భర్త నల్లగా ఉన్నాడని.. భార్య వేధింపులు : హైకోర్టు సంచలన తీర్పు..

వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి. 2007లో వివాహం అయ్యింది. ఆ తర్వాతే అసలు సిసలు టార్చర్ మొదలయ్యింది. నాకు ఇష్టం లేకుండా.. బలవంతంగా పెళ్లి చేశారు.. నువ్వు నల్లగా ఉన్నావు.. అంద విహీనంగా ఉన్నావ్ అంటూ ఇంట్లో పెళ్లాం పోరు ఎక్కువైపోయింది. నిత్యం భార్య వేధింపులతో తీవ్ర మానసిక క్షోభపడ్డాడు ఆ భర్త. ఓ రకంగా నరకం అనుభవించాడు. పెళ్లాం టార్చర్ భరించలేక.. ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశాడు ఆ భర్త. ఇక్కడే ట్విస్ట్.. భర్తను వేధిస్తున్న సంగతిని దాచిపెట్టి.. భర్తపైనే రివర్స్ కంప్లయింట్ చేసింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని.. అందకే విడాకులు కోరుతున్నాడని.. ఇంట్లో అత్త, ఇతర కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ రివర్స్ కేసు పెట్టి.. పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిప్పింది ఈ భార్య. అసలు సిసలు ట్విస్టులతో నడిచిన ఈ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ జంట 2007లో వివాహం చేసుకోగా.. నల్లగా ఉన్నావన్న కారణంతో భార్య.. భర్తను మానసిక వేధనకు గురిచేసింది. ఈ పరిణామాలను తట్టుకోలేని ఆ భర్త.. చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలోనే ఆమె రివర్స్ కేసు పెట్టింది. 2011లో తనపై, తన తల్లి, ఇతర కుటుంబసభ్యులపైనా చిత్ర హింసలకు గురి చేశారని ఫిర్యాదు చేసిందని, దాని వల్ల తాను దాదాపు 10రోజులు పోలీస్ స్టేషన్, కోర్టులో గడిపానని అతను తెలిపాడు. తన భార్య ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని, దాంతో తాను చాలా బాధపడ్డానని, డిప్రెషన్‌లోకి వెళ్లానని భర్త వాదించాడు. అందుకే తాను తనకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించినట్టు స్పష్టం చేశాడు.

అయితే భర్త వేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని భార్య.. కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తన భర్తకు అక్రమ సంబంధం ఉందని, ఆ సంబంధం నుంచి ఒక బిడ్డ కూడా ఉందని ఆమె ఆరోపించింది. అంతే కాదు తన భర్త కూడా పరుష పదజాలంతో దూషించాడని, బయటకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడని తెలిపింది. ఇరువరి వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. భర్తతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని భార్య చెబుతున్నా.. ఫిర్యాదును మాత్రం వెనక్కి తీసుకోకపోవడం తన భర్తతో కలిసి జీవించాలనే ఆసక్తి లేదని సూచిస్తోందని ధర్మాసనం తెలిపింది. జాతి పరమైన వ్యాఖ్యలు చేసి వేధించడాన్ని కోర్టు.. క్రూరత్వంగా పరిగణించింది. అనంతరం చివరికి భర్తకు కోర్టు విడాకులు మంజూరు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది.