క్యాన్సర్​ పేషెంట్లకు ఫ్రీగా విగ్స్​

క్యాన్సర్​ పేషెంట్లకు ఫ్రీగా విగ్స్​

ప్రస్తుతం క్యాన్సర్​తో బాధపడేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంట్​ తీసుకునే చాలామంది తమ జుట్టును కోల్పోతున్నారు. కొందరు విగ్​లు పెట్టుకుంటారు. కానీ, క్యాన్సర్​తో బాధపడే  పేదవాళ్లు వేల రూపాయలు పెట్టి విగ్​ కొనుక్కోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. విగ్​ కొనాలంటే  రూ.25 వేల నుంచి 40వేల పైనే ఖర్చు అవుతుంది. ట్రీట్మెంట్​కే అప్పులు చేసేవాళ్లు  అన్ని డబ్బులు పెట్టి విగ్​ కొనలేరు. అలాంటివాళ్లను చూసి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ అయిన శివకి ఓ ఆలోచన వచ్చింది.  విగ్​లు తయారుచేసి ఇస్తే క్యాన్సర్​ పేషెంట్ల జీవితంలో సంతోషాలు నింపొచ్చని  అనుకున్నాడు.2019లో  ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్’ ఎన్జీవో పెట్టాడు.  
అవేర్​నెస్​ పెరిగింది  
మొదట్లో వారానికి ఒకరిద్దరు మాత్రమే హెయిర్​ డొనేట్​ చేసేందుకు వచ్చేవాళ్లు. లాక్​డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్​లైన్ చదువులు మొదలయ్యాక హెయిర్​ డొనేట్​ చేసేవాళ్ల సంఖ్య పెరిగింది. పిల్లలు, యంగ్‌స్టర్స్, హౌజ్ వైవ్స్​  జుట్టు ఇచ్చేందుకు ముందుకు వస్తుండడం విశేషం. కొందరు గుండు చేయించుకుని జుట్టు డొనేట్​ చేస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే హెయిర్​ డొనేషన్​ మీద అవేర్​నెస్​ పెరిగింది.  
సొంత డబ్బు, డోనర్ల సాయంతో...
హెయిర్ డొనేట్​ చేయాలనుకునేవాళ్లు శివ ఆఫీసుకివెళ్తే అతనే జుట్టు కట్ చేస్తాడు. ఆ హెయిర్​ని క్లీన్ చేసి, విగ్​​ తయారీకి పనికొచ్చే హెయిర్​ని సపరేట్ చేస్తాడు.  తన టీమ్​తో కలిసి అక్కడే ఆ జుట్టుతో విగ్​ తయారుచేస్తాడు. విగ్​ల తయారీ కోసం తన ఆదాయంలో కొంత, డోనర్స్​ ఇచ్చిన ఫండ్స్​  కొంత ఖర్చు చేస్తున్నాడు శివ. 
ఎంతదూరమైనా వెళ్లి ఇస్తారు
సోషల్ మీడియా, వెబ్​సైట్ల ద్వారా శివను కాంటాక్ట్​ అవుతున్నారు చాలామంది. హైదరాబాద్​లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లోనూ ఫ్రీగా విగ్​లు పంచుతున్నారు ఈ సంస్థ వాళ్లు. క్యాన్సర్ హాస్పిటల్స్​లో సంస్థ  డీటెయిల్స్ ఉంచుతారు. విగ్​ కావాల్సిన వాళ్లు ఫోన్​ చేస్తే, వాళ్ల వివరాలు తెలుసుకొని నేరుగా వెళ్లి విగ్స్​ ఇస్తున్నారు.  
చాలా హ్యాపీగా ఉన్నారిప్పుడు
జుట్టు లేకుండా బాధపడ్డవాళ్లు ఇప్పుడు శివ ఇచ్చిన విగ్స్​ పెట్టుకుని సంతోషంగా ఉన్నారు. వీళ్లలో ఒకరు మల్కాజిగిరికి చెందిన ఉమ. క్యాన్సర్​తో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కీమోథెరపీ వల్ల హెయిర్ మొత్తం పోయింది.  రెండు నెలల క్రితం  బంధువుల ద్వారా ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్’ సంస్థ గురించి తెలుసుకుని, వాళ్లని కలిసి విగ్​ తెచ్చుకుంది.  విగ్​ పెట్టుకోవడంతో  కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పింది ఉమ. ఎల్బీనగర్​లో ఉంటున్న లక్ష్మీది కూడా అచ్చం ఉమలాంటి కథే . ఆమెకి అలోపేసియా అనే ఆటోఇమ్యూన్​ డిసీజ్ కారణంగా  జుట్టు ఊడిపోయింది. దాదాపు పదేండ్లు సఫర్ అయింది. యూట్యూబ్​లో ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్’ సంస్థ గురించి తెలిసింది. దాంతో వాళ్లకి ఫోన్​ చేసి మరుసటి రోజే  విగ్ తెచ్చుకుంది లక్ష్మి. 
                                                                                                                                                                                                 ::: అంజుమా మహ్మద్, హైదరాబాద్, వెలుగు

 ఒక విగ్​కి నాలుగు వేల ఖర్చు
క్యాన్సర్, ఇతర వ్యాధుల కారణంగా జుట్టు కోల్పోయి, విగ్ కొనేందుకు డబ్బులు లేని పేదవాళ్లు మా నెంబర్​ 9666406586కి ఫోన్​ చేస్తే, ఫ్రీగా విగ్​ ఇస్తాం. ‘హైదరాబాద్​ హెయిర్​ డొనేషన్స్​ ఫర్​ క్యాన్సర్​ పేషెంట్స్​’ ఫేస్​బుక్​ పేజీ ద్వారా కూడా  మమ్మల్ని కాంటాక్ట్​ అవ్వొచ్చు. డోనర్స్​ నుంచి 12 ఇంచుల పొడవు జుట్టు తీసుకుంటాం. ఒక విగ్ చేయడానికి 4 రోజులు పడుతుంది. అందుకు  ఏడు పోనీ టెయిల్స్ అవసరం. అంతేకాదు 4వేల వరకు ఖర్చు అవుతుంది. హెయిర్ డొనేట్​ చేయలేని వాళ్లు మనీ ఇవ్వొచ్చు. అందుకోసం ‘స్పాన్సర్ ఏ విగ్ కాన్సెప్ట్’ని మొదలుపెట్టాం.  ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా 50కి పైగా విగ్స్​ డిస్ట్రిబ్యూట్​ చేయాలనుకుంటున్నాం’’. 
                                                                                                                                                           - శివ , ఫౌండర్, హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్
సోషల్​ మీడియాలో చూసి..
‘‘నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇంట్రెస్ట్. కానీ, ఎలా చేయాలో తెలియదు. ఓసారి సోషల్ మీడియాలో హెయిర్ డొనేషన్ చేయడం వల్ల  క్యాన్సర్ పేషెంట్లకు అవసరమయ్యే విగ్స్ తయారీకి హెల్ప్ అవుతుందనే న్యూస్ చూశాను. వెంటనే ఆ సంస్థకు కాల్ చేసి జుట్టు డొనేట్​ చేశాను. సోషల్​ సర్వీస్​ చేయాలనే నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది’’. 
                                                                                                                                                                                                              - అలివేలు, చందానగర్​