వికీ పేజీలు మార్చేశారు... అదానీ గ్రూప్​పై వికీపీడియా

వికీ పేజీలు మార్చేశారు... అదానీ గ్రూప్​పై వికీపీడియా

న్యూఢిల్లీ: వికీపీడియాలో గౌతమ్​అదానీ, ఆయన ఫ్యామిలీ, గ్రూప్​ కంపెనీల సమాచారాన్ని అదానీ ఉద్యోగులే మానిప్యులేట్ ​చేశారని వికీపీడియా ఆరోపిస్తోంది. వికీపీడియాను ఫ్రీ ఇంటర్నెట్​ ఎన్​సైక్లోపీడియాగా వ్యవహరిస్తారు. నిష్పాక్షికమైన రీతిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తుంది వికీపీడియా. ఎవరైనా, ఎప్పుడైనా ఇక్కడి సమాచారాన్ని ఎడిట్​ లేదా అప్​డేట్​ చేసే వీలుంటుంది. వికీపీడియాలో సమాచారాన్ని అప్​డేట్​ చేసేందుకు చాలా మంది వాలంటీర్లు పనిచేస్తుంటారు. ఏమైనా తేడాలుంటే ఎడిట్​ చేసేందుకూ వీలుంటుంది. గౌతమ్​ అదానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్లు, గ్రూప్​కంపెనీలపై నిష్పాక్షికమైన రీతిలో ఉంచిన సమాచారంలో మార్పులు–చేర్పులు జరిగినట్లు తాము గుర్తించామని వికీపీడియా తాజాగా వెల్లడించింది.

ఇలా మార్పులు–చేర్పులు చేసిన వారిలో కొంత మంది అదానీ గ్రూప్​ ఉద్యోగులైతే, మరికొంత మంది పెయిడ్​ ఎడిటర్లు ఉన్నారని పేర్కొంది. అదానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్​ కంపెనీలపై  9 ఆర్టికల్స్​ ఉంటే, వాటిని రివైజ్​ చేశారని, ఒక రకంగా చెప్పాలంటే తమ ఫిలాసఫీ నాన్–న్యూట్రల్​కు వ్యతిరేకంగా వారు వ్యవహరించారని వికీపీడియా స్పష్టం చేసింది. సంబంధిత ఆర్టికల్స్​ను ఎడిట్ చేసినది అదానీ ఉద్యోగులేనని చెప్పడానికి నిదర్శనంగా వారి  ఐపీ అడ్రస్​లను సైతం లిస్ట్​ చేసింది. వికీపీడియా ప్రకటనపై పంపిన ఈ–మెయిల్​కు  అదానీ గ్రూప్​ స్పోక్స్​పర్సన్​ బదులివ్వలేదు. అదానీపై ఒక ఆర్టికల్​ 2007 లో మొదలైందని, కానీ 2012 నాటికల్లా ముగ్గురు ఎడిటర్లు దానిలో మార్పులు–చేర్పులు చేశారని వికీపీడియా తెలిపింది.

ఆ తర్వాత ఆ ముగ్గురినీ గుర్తించి, బ్లాక్​ చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఫిలాంథ్రపీ సెక్షన్​లో వారు మార్పులు–చేర్పులకు పాల్పడినట్లు వివరించింది. ఒక పెయిడ్​ ఎడిటర్​ కంపెనీ ఐపీ అడ్రస్​నే వాడి అదానీ గ్రూప్​పై ఆర్టికల్​ను పూర్తిగా తిరగ రాసినట్లు వికీపీడియా స్పష్టం చేసింది. వికీపీడియాలోని సమాచారాన్ని అన్​డిక్లేర్డ్​ పెయిడ్​ ఎడిటర్ల ద్వారా ఎడిట్​ చేయించడం ఇది మొదటిసారి కాదని, బిలియనీర్లు కొంత మంది అలా చేస్తున్నారని  వికీపీడియా వివరించింది.