- నెల వ్యవధిలోనే అమ్రాబాద్, దోమలపెంట రేంజ్ పరిధిలో 21 చోట్ల మంటలు
- 100 హెక్టార్ల అటవీ సంపద నాశనం
- అగ్ని పోర్టల్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నా ఆగని నష్టం
- ప్రాణాలు కోల్పోతున్న అడవి బిడ్డలు
నాగర్ కర్నూల్, వెలుగు : నల్లమల అభయారణ్యం ఈసారి వేసవి రాకముందే కార్చిచ్చు కోరల్లో చిక్కుకుంది. అమ్రాబాద్, దోమలపెంట రేంజ్ పరిధిలో ఇప్పటికే 21 చోట్ల మంటలు చెలరేగగా, దాదాపు 100 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలిబూడిదైందని అటవీ శాఖ గుర్తించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు జిల్లాల సరిహద్దుల్లో దాపు 2.55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నల్లమల అడవిలో 2.611 చదరపు కిమీల విస్తీర్ణంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంటుంది.
ఈ అడవిలో ఎండల తీవ్రతకు ఎండిన గడ్డి, ఆకులు చిన్నపాటి నిప్పు రవ్వతోనే భయంకరమైన మంటలుగా మారుతున్నాయి. గాలి వాటానికి వేగంగా విస్తరిస్తున్న ఈ కార్చిచ్చును అరికట్టడంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫైర్ లైన్లు విఫలమవుతున్నాయి.
‘అగ్ని పోర్టల్’ అలర్ట్ చేస్తున్నా..
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ అటవీ నష్టాన్ని పూర్తిగా నివారించలేకపోతున్నారు. శాటిలైట్ పర్యవేక్షణ ద్వారా ‘అగ్ని పోర్టల్’ నుంచి అలర్ట్స్ అందుతున్నా, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
గడిచిన రెండేండ్లలో అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లిన 11 మంది చెంచులు అగ్ని ప్రమాదాల బారిన పడగా, మల్లాపూర్, బౌరాపూర్ లాంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. నివాస గుడిసెలు, నిల్వ చేసుకున్న తిండి గింజలు అగ్నికి ఆహుతవడంతో అడవి బిడ్డల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి.
వన్యప్రాణుల మనుగడకు శాపంగా..
నల్లమల అడవిలోని అరుదైన వృక్షజాతులు, వన్యప్రాణుల మనుగడకు ఈ కార్చిచ్చు పెను శాపంగా మారింది. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు లాంటి క్రూర మృగాలతో పాటు జింకలు, దుప్పులు లాంటి శాఖాహార జంతువులు మంటల ధాటికి చెల్లాచెదురవుతున్నాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో జంతువులకు మేతగా ఉపయోగపడే గడ్డి క్షేత్రాలే వేసవిలో మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణమవుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా అడవిని లావా మాదిరి దహించివేస్తున్న ఈ మంటల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
మానవ తప్పిదాలతో..
మానవ తప్పిదాలు కూడా ఈ విపత్తుకు ఆజ్యం పోస్తున్నాయి. అడవిలోకి వెళ్లే వారు వంటలు చేసుకుని నిప్పు ఆర్పకపోవడం, బీడీలు కాల్చి పడేయడం, ఇప్పపూవు సేకరణ కోసం చెట్ల కింద గడ్డిని తగులబెట్టడం లాంటి చర్యలు భారీ అగ్నిప్రమాదాలకు దారితీస్తున్నాయి. 11 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు ఎయిర్ బ్లోయర్ల ద్వారా గంటల తరబడి శ్రమించినా అపార నష్టం వాటిల్లుతోంది.
ఇటీవల బ్రహ్మగిరి రేంజ్లోని వట్వవర్లపల్లి, తాటిగుండాల సెక్షన్లలో మంటలను ఆర్పేందుకు 20 మంది సిబ్బంది దాదాపు 20గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ పరికరాలను సమకూర్చడంతో పాటు, ఖాళీగా ఉన్న ఫైర్ వాచర్లు, బీట్ వాచర్ల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
