కరెంట్​తీగలతో జంతువులను షికార్​చేస్తున్న వేటగాళ్లు

కరెంట్​తీగలతో జంతువులను షికార్​చేస్తున్న వేటగాళ్లు
  • కరెంట్​తీగలతో జంతువులను షికార్​చేస్తున్న వేటగాళ్లు
  • విద్యుదాఘాతానికి బలవుతున్న అమాయకులు
  • నిఘా కరువు.. పట్టించుకోని ఆఫీసర్లు

ఆసిఫాబాద్,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో వన్యప్రాణుల వేట జోరుగా సాగుతోంది. వేటగాళ్లు అటవీ ప్రాంతంలో ఉచ్చులు అమర్చి అటవీ జంతువులను వేటాడుతున్నారు. రాత్రిపూట వ్యవసాయ పనులు, చేలకు వెళ్తున్న రైతులు విద్యుత్​ తీగలకు తాకి ప్రాణాలు వదులుతున్నారు. అయినా ప్రజాప్రతినిధులు, పట్టించుకోవడంలేదు. ఆఫీసర్లు చర్యలు తీసుకోవడంలేదు.

పంటల రక్షణ కోసమని..

అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడుకోవడం కోసం రైతులు.. వన్యప్రాణులను వేటాడేందుకు స్మగ్లర్లు అటవీ ప్రాంతంలోని కరెంట్ లైన్లకు తీగలు వేసి కంచెలు, ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమీ తెలియని రైతులు అటువైపు వెళ్లి విద్యుత్​తీగలకు తగిలి మృతి చెందుతున్నారు. జిల్లాలో ఎక్కువగా పంటపొలాలు ఫారెస్ట్​ఏరియాను ఆనుకొని ఉన్నాయి. అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి చేతికొచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పంట చుట్టూ విద్యుత్​ కంచె ఏర్పాటు చేస్తున్నారు. వేటగాళ్లేమో జంతువుల వేట కోసం ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ వైర్లు అమర్చిన విషయం తెలియక పనులు కోసం పొలాలకు వెళ్లే అమయక ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. స్వార్థం కోసం అమర్చుతున్న విద్యుత్ తీగలతో పేద కుటుంబాల్లో తీరని దుఃఖం మిగులుతోంది. 

చర్యలు శూన్యం..

అడవి జంతువుల కోసం పెడుతున్న కరెంటు తీగలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నా.. ఆఫీసర్లలో చలనం లేదు. ఫారెస్ట్​లో ఎప్పటికప్పుడు ఆఫీసర్లు తనిఖీలు చేస్తూ ఉండాలి. ఫారెస్ట్ ఏరియాలోని కరెంట్​లైన్లను పరిశీలించారు. అక్రమంగా విద్యుత్​ ఉపయోగించడం... కంచెలు ఏర్పాటు చేయడం.. ఉచ్చులు బిగించడంపై ఉక్కుపాదం మోపాలి. కానీ.. క్షేత్రస్థాయిలో అదేది జరగడంలేదు. ఫలితంగా అమయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

  • 2021  జనవరిలో కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి తీగల దుర్గారాజ్, సత్తయ్య వన్యప్రాణుల కోసం అమర్చిన తీగలు తగిలి చనిపోయారు.
  • అదే ఏడాది మార్చి 24 న దహెగాం మండలం చిన్న ఐనం గ్రామానికి చెందిన పోల్క లచ్చన్న (45) వన్యప్రాణుల వేటకు వెళ్లి విద్యుత్​షాక్​తగిలి మృతిచెందాడు.
  • డిసెంబర్​లో అటవీ జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తాకి వాంకిడి మండలం టొక్కిగూడ గ్రామానికి చెందిన నీలబాయి అక్కడిక్కడే మృతిచెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.

విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు

వేటగాళ్లు, పంట పొలాలకు విద్యుత్ తీగలు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటాం. అటవీ జంతువుల వేటకు విద్యుత్ తీగలు అమర్చడం చట్టరీత్యా నేరం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా14 మందిపై కేసులు నమోదు చేసినం. దొంగతనంగా విద్యుత్ తీగలు అమర్చినట్లు తమ దృష్టికి వస్తే ఐపీసీ సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్, పీడీ యాక్ట్​నమోదు చేస్తాం.

- ఎస్పీ సురేశ్​కుమార్

కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామానికి చెందిన ఇంటర్​ స్టూడెంట్​ ఆదే విష్ణు (18 ) డిసెంబర్ 31 రాత్రి న్యూఇయర్​ పార్టీ  కోసమని ఫ్రెండ్స్​తో కలిసి పార్దన్​గూడలోని పంటపొలాల్లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ ​తీగలు తాకడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో  విష్ణు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.చెట్టంతా కొడుకు వేటగాళ్ల ఉచ్చుకు బలికావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.