డిసెంబర్ 13న పార్లమెంట్ పై దాడి చేస్తాం : పన్నూన్ మరో హెచ్చరిక

డిసెంబర్ 13న పార్లమెంట్ పై దాడి చేస్తాం : పన్నూన్ మరో హెచ్చరిక

ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరో హెచ్చరిత వీడియోను విడుదల చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసి డిసెంబర్ 13నాటికి 22 ఏళ్లు పూర్తి కానుంది.

'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్ ' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్‌ను కలిగి ఉన్న ఈ వీడియోలో , భారత ఏజెన్సీలు తనను చంపడానికి చేసిన కుట్ర విఫలమైందని పన్నూన్ చెప్పాడు. డిసెంబరు 13 లేదా అంతకంటే ముందే పార్లమెంటుపై దాడి చేస్తామని హెచ్చరించాడు.

పన్నూన్ బెదిరింపు వీడియో బయటికి రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భద్రతా ఏజన్సీల ప్రకారం, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI K-2 (కశ్మీర్-ఖలిస్థాన్) డెస్క్ భారతదేశ వ్యతిరేక కథనాన్ని ప్రచారం చేసే వారి ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లాలని పన్నన్‌కు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.

అంతకుముందు నవంబర్ 19న సిక్కులెవరూ ఎయిరిండియా విమానాల్లో ప్రయానించొద్దని, ఎవరైనా ప్రయాణిస్తే ప్రాణాలు పోతాయని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నవంబర్ 4న ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. అదే రోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుందని బెదిరించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాయి.