బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామన్లే!

బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామన్లే!
  • బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామన్లే!
  • చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పాం: చిదంబరం 
  • బ్యాన్​ హామీపై కాంగ్రెస్ యూ టర్న్
  • అది చట్టపరమైన అంశమని వెల్లడి
  • మత విద్వేషాలు రెచ్చగొడ్తే సహించం
  • బీజేపీవి నీచ రాజకీయాలని విమర్శ

న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్​ను బ్యాన్ చేస్తామనలేదని ఆ పార్టీ సీనియర్​ లీడర్ పి.చిదంబరం అన్నారు. తాము రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా అలా లేదని వివరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బజరంగ్​దళ్, పీఎఫ్ఐ వంటి ఆర్గనైజేషన్స్​పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పామని తెలిపారు. బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించిన క్రమంలో దేశవ్యాప్తంగా బీజేపీ, బజరంగ్​దళ్ లీడర్లు కాంగ్రెస్​పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పి.చిదంబరం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ లీడర్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. బంజరంగ్​దళ్ బ్యాన్ విషయంలో వాళ్లు చేస్తున్న కామెంట్లను ఖండిస్తున్నాను. మత విద్వేషాలను రెచ్చగొట్టే సంస్థలకు హెచ్చరిక లాగా ఉండేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పాం. బజరంగ్​దళ్.. ‘బజరంగ్​బలి’ ఒకటేనా? దీని గురించి మీరు ఎలా వివరిస్తారు?”అని బీజేపీ లీడర్లను ప్రశ్నించారు. 

మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు వద్దు

‘‘రెచ్చగొట్టే కామెంట్లు, అల్లర్లకు కారణమయ్యే అన్ని ఆర్గనైజేషన్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. రెండు సంస్థల పేర్లను ప్రస్తావించాం. బ్యాన్ చేస్తామని హామీ ఇవ్వలేదు. దయచేసి ఆ రెండు కామెంట్లను చదవండి. ఒక సంస్థపై బ్యాన్ విధించడం అనేది చట్టపరమైన అంశం. అది రాష్ట్ర పరిధిలో ఉండదు. కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే సంస్థలను కాంగ్రెస్ వదలదు. దీనికి పార్టీ కట్టుబడి ఉంటుంది”అని చిదంబరం అన్నారు. చట్టం, రాజ్యాంగం ఎంతో పవిత్రమైనవని, వాటిని పార్టీ గౌరవిస్తుందన్నారు. మెజార్టీ, మైనార్టీ వర్గాల మధ్య బజరంగ్​దళ్, పీఎఫ్ఐ రెచ్చగొట్టే కామెంట్లు చేయవని భావిస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే..

రాష్ట్ర ప్రజలంతా కలిసి కాంగ్రెస్​నే గెలిపిస్తారని చిదంబరం ధీమా వ్యక్తంచేశారు. ‘‘కర్నాటకను లిబరల్, డెమోక్రటిక్, డెవలప్​మెంట్ స్టేట్​గా మార్చొచ్చు. బీజేపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయింది. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఓడించాలి. కర్నాటకలో గెలిచి పక్క రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నది. యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్​సీ) అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇది సాధ్యం కాదు. ఈ రెండు హామీలు సమాజాన్ని విభజించే, గొడవలకు కారణమయ్యేవే అనేది మరిచిపోవద్దు” అని ఓటర్లకు చిదంబరం సూచించారు. 


వాళ్లిద్దరూ సీనియర్ లీడర్లే..

కాంగ్రెస్ తరఫున సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీనియర్ లీడర్లే అని, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చిదంబరం స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్​లో ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ, ప్రజా సేవ కోసం అందరూ కలిసి ముందుకెళ్తున్నారు. బీజేపీ, కొన్ని మీడియా సంస్థలే లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. బీజేపీ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీ రూపంలో రాష్ట్రానికి పెద్ద ముప్పు పొంచి ఉంది. దాన్ని కాంగ్రెస్​కు ఓటేసి దూరం చేయాలి. రాష్ట్ర, దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది”అని ఓటర్లను ఉద్దేశిస్తూ చిదంబరం అన్నారు.

బీజేపీ హామీలను తిరస్కరిస్తరు

ఎన్ఆర్​సీ, యూసీసీ అమలు విషయంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని చిదంబరం అన్నారు. కర్నాటక ప్రజలు కూడా తెలుసుకోవాలని, ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘బీజేపీని ఓడిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుం ది. పాలనలో మార్పు రావాలి. నేను కర్నాటక వాసిని కాను. అందుకే కాంగ్రెస్​కు ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేయలేకపోతున్న. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోని సీనియర్​ లీడర్లు గెలుపుపై ఎంతో ధీమాతో ఉన్నారు. స్పష్టమైన మెజార్టీ సాధిస్తామని చెప్పారు”అని చిదంబరం అన్నారు. అవినీతిలో కర్నాటక దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రచారంలో అన్ని అబద్ధాలే చెబుతున్నారని, ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.