ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తా :  ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం, సన్న బియ్యం కొనుగోళ్లు, రేషన్ సరుకుల సరఫరాలో జరిగిన అవకతవకలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పేదల బియ్యం పంపిణీకి కేంద్రం రూ.వేల కోట్లు పంపిస్తున్నదని, ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 

శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. అక్రమాలపై ఆధారాలతో సహా బయటపెట్టానని, అయినా సంబంధిత శాఖ మంత్రి మౌనంగా ఉన్నారంటే అక్రమాలు జరిగాయని ఒప్పుకున్నట్టేనన్నారు. తాను చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి నిజనిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలకు మంత్రి సమాధానం చెప్పకుండా.. అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టించి తమపైనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.