పెగాసస్‌ అంశాన్ని వదిలేది లేదు

పెగాసస్‌ అంశాన్ని వదిలేది లేదు

పెగాసస్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. దేశం, వ్యవస్థల కంటే ప్రధాని ఎక్కువ కాదని తెలిపారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెగాసస్‌ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతామన్నారు. ‘‘ప్రధానికి మేం మూడు ప్రశ్నలు సంధిస్తున్నాం. పెగాసస్‌ వాడకానికి ఎవరు అధికారమిచ్చారు?పెగాసస్‌ను ఎవరు ఉపయోగించారు? ప్రజల సమాచారాన్ని ఇతర దేశాలు వాడాయా లేదా?’’ అని ప్రశ్నించారు. పెగాసస్‌ వ్యవహారంపై కమిటీ ఏర్పాటుతో సుప్రీం గొప్ప అడుగు వేసిందని, ఈ కమిటీ ఏర్పాటుతో నిజాలు వెల్లడవుతాయని తమకు నమ్మకం ఉందని రాహుల్ చెప్పారు.

అయితే..పెగాసస్ వ్యవహరంపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నిపుణుల కమిటీ పని తీరును తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ R.V. రవీంద్రన్ నేతృత్వం వహించనున్నారు. సభ్యులుగా అలోక్ జోషి, సందీప్ ఓబెరాయి ఉండనున్నారు. ఆరోపణలపై స్టడీ చేసి రిపోర్టును సమర్పించాలని కమిటీని కోరింది సుప్రీంకోర్టు. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.