చైనాను వదిలే కంపెనీలకు కేంద్రం రెడ్ కార్పెట్

చైనాను వదిలే కంపెనీలకు కేంద్రం రెడ్ కార్పెట్

న్యూఢిల్లీ : చైనా నుంచి బైటకు వద్దామనుకుంటున్న మల్టీ నేషనల్‌‌ కంపెనీలను (ఎంఎన్‌‌సీలు) ఆకట్టుకునేందుకు తగిన బ్లూప్రింట్‌‌ సిద్ధం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ వెల్లడించారు. చైనా వదిలే వివిధ దేశాలకు చెందిన తయారీ రంగ ఎంఎన్‌‌సీలను గుర్తించి, కొత్త విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో వివరిస్తూ ఆ ఎంఎన్‌‌సీలకు ఆ బ్లూప్రింట్‌‌ ద్వారా తెలియచెప్పనున్నట్లు పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌‌–వరల్డ్‌‌ బ్యాంక్‌‌ మీటింగ్ ముగిసిన తర్వాత నిర్మలా సీతారామన్‌‌ మీడియాతో మాట్లాడారు. చైనా వద్దనుకుంటున్న కొన్ని ఎంఎన్‌‌సీలు ఇండియాకు రావాలని కోరుకుంటున్నాయని, వారి ఆశలకు తగినట్లుగా విధానాలు రూపొందించడం ప్రభుత్వానికి చాలా ముఖ్యమని వెల్లడించారు. దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ఇప్పటికే కిందటి నెలలో కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ను తగ్గించారు. ఎలక్ట్రానిక్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ రంగంలోని మల్టీ నేషనల్స్‌‌ సప్లై చెయిన్‌‌లోని ఇండియా కంపెనీలకు ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.  ఆపిల్‌‌ లాంటి పెద్ద తయారీ రంగ కంపెనీ ఇండియాకు వస్తే, ఆ ప్రభావం మిగిలిన కంపెనీలపైనా పడుతుందని సీతారామన్‌‌ అభిప్రాయపడ్డారు. వియత్నాంలో అవకాశాలు అడుగంటుతున్నాయని, ముఖ్యంగా పనిచేసే మనుషులు అక్కడ దొరకడం లేదని వ్యాఖ్యానించారు. కాబట్టి, చైనా నుంచి వచ్చే కంపెనీలు ఇండియా వైపే ప్రధానంగా దృష్టి పెడతాయని అభిప్రాయపడ్డారు.