డీలిమిటేషన్ ఎఫెక్ట్ : తెలంగాణలో 4 ఎంపీ సీట్లు తగ్గనున్నాయా..?

డీలిమిటేషన్ ఎఫెక్ట్ : తెలంగాణలో 4 ఎంపీ సీట్లు తగ్గనున్నాయా..?

హైదరాబాద్: తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఏపీలోనూ లోక్  సభ నియోజకవర్గాల సంఖ్య పడిపోనుంది. 2026లో లోక్ సభ స్థానాల విభజనపై చేపడితే తెలంగాణలో మూడు నుంచి నాలుగు సీట్లు తగ్గే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ అదే స్థాయిలో సెగ్మెంట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే చాన్స్ కనిపిస్తోంది. ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఏపీలో 25, తెలంగాణలో 17 మొత్తం 42 లోక్ సభ స్థానాలున్నాయి. 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని డీలిమిటేషన్ చేస్తే 37 పార్లమెంటు స్థానాలకు తగ్గుతాయి.

 2026లో లెక్కలు తీసి డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే 34 కు పడిపోయే ప్రమాదం ఉందని వాషింగ్టన్ కు చెందిన కార్నెగి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నివేదిక వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 నుంచి ఎనిమిది లోక్  సభ స్థానాలు తగ్గుతాయని తెలిపింది. ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని డీలిమిటేషన్ చేపట్టారని.. దక్షిణాదిలోనూ అదే నిబంధనలు వర్తింపజేయాలని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ అంటున్నారు. తెలంగాణలాంటి  అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల లోక్ సభ స్థానాలను తగ్గిస్తే కేంద్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు.  దీనిపై సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో గళం విప్పే అవకాశం ఉంది.  తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దీనిపై ఇదివరకే స్పందించారు.  దక్షిణాదిపై వేలాడే కత్తిగా ఆయన అభివర్ణించిన విషయం తెలిసిందే. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వాలని స్టాలిన్ కోరారు.   

పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

డీలిమిటేషన్ జరిగితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగడం విశేషం. నియోజకవర్గాలను 119 నుంచి 153కి పెంచేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే అది సాధ్యమయ్యే సూచనలున్నాయని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నివేదిక వెల్లడించింది. అదే విధంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు 225కి పెరగనున్నాయని పేర్కొంది. 

ఒక ఓటు.. ఒక విలువ (బాక్స్)

భారతదేశ పౌరులందరి ఓటుకు ఒకే విలువ ఉండాలని రాజ్యాంగం కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం యూపీలో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు.  అంటే ఇప్పుడు తమిళ ఓటరు విలువ ఎక్కువ, యూపీ ఓటర్ విలువ తక్కువ అవుతుంది కదా.. అలా జరగకుండా ఉండటం కోసం జనాభా ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ లెక్కన నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.