ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపిస్తం : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపిస్తం : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి
  • అవసరమైతే లోన్లు ఇప్తిస్తం
  • నిర్వీర్యమైన తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తం
  • రైస్​మిల్లర్ల ఆటలు ఇక సాగవ్​
  • బెల్ట్​షాపుల విషయంలో రేవంత్​రెడ్డిని అభినందిస్తున్నా
  • ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి  

రాయికల్, వెలుగు : మహాలక్ష్మి స్కీంతో ఉపాధి కోల్పోయామని బాధపడుతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నట్టు కరీంనగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్​రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్​లోని కాంగ్రెస్​ఆఫీసులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లు గిరాకీల్లేక తిప్పలు పడుతున్నామని ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ​ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి నిలదొక్కుకునేలా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేసేంత వరకు నిద్రపోరన్నారు. ఈ విషయంలో ఆయనను అభినందిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం మిషన్​భగీరథ అంటూ రాయికల్, జగిత్యాల మండలంలోని పొలాస, బీర్​పూర్ ​మండలాల్లోని ఫిల్టర్ ​బెడ్​లను నిర్వీర్యం చేసిందని, వాటిని పునరుద్ధరించేందుకు అధికారులతో కలిసి పరిశీలించానని చెప్పారు.

ఆఫీసర్లను అంచనాలు రూపొందించాలని కూడా  చెప్పామని, ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదన్నారు. ధాన్యం కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని, రైస్​ మిల్లర్ల ఆటలు ఇక సాగవన్నారు. సెంటర్ల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు పంపుతామని, అక్కడ కోతలు లేకుండా చూస్తామన్నారు. ఈనెల17న ఎస్సారెస్పీ ఆఫీసర్లతో మాట్లాడతానని, రైతులకు కాల్వల ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయికల్​లో రిజిస్ట్రేషన్​ ఆఫీసు పునరుద్ధరణ కోసం రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు కొండపెల్లి రవీందర్​రావు, లీడర్లు ఎద్దండి దివాకర్​రెడ్డి, మ్యాకల రమేశ్, మహిపాల్​రెడ్డి, బాపురం నర్సయ్య, ఆరె శ్రీను, మండ రమేశ్, శ్రీకాంత్​, రవీందర్​రెడ్డి పాల్గొన్నారు.