టార్గెట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం పనిచేస్తేనే జీతాలు ఇస్తాం

టార్గెట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం పనిచేస్తేనే జీతాలు ఇస్తాం
  • ఎలాంటి పర్మిషన్​లేకుండా 150 బ్రాంచ్​లు తెరిచిన్రు
  • 1,500 మంది నిరుద్యోగుల నుంచి రూ.50 కోట్లదాకా వసూళ్లు
  • సుమారు లక్ష మంది నుంచి రూ. 150 కోట్ల డిపాజిట్ల సేకరణ
  •  ఏడాది క్రితం ఆగిపోయిన బ్యాంకు లావాదేవీలు

ముద్ర కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ(ముద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌) స్కాం విలువ ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో 1,500 మంది నిరుద్యోగుల నుంచి రూ. 50 కోట్లు, డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి రూ. 150 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు స్పష్టమవుతోంది. డిపాజిటర్ల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే ఇద్దరు ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నారు. డిపాజిటర్ల సొమ్మును డైరెక్టర్లకు పంచి ఇచ్చినట్లు చైర్మన్​చెబుతుండగా.. డబ్బంతా చైర్మన్​కే ఇచ్చినట్లు డైరెక్టర్లు పేర్కొంటున్నారు. ఏడాది గడుస్తున్నా కేసు కొలిక్కి రాకపోవడంతో డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమను ఉద్యోగాల పేరుతో ఎలా మోసం చేశారో నిరుద్యోగులు ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.  

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/ చిట్యాల, వెలుగు: ఏపీకి చెందిన దాసప్పనాయుడు ‘ముద్ర అగ్రికల్చరల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మల్టీ స్టేట్‌‌‌‌‌‌‌‌ కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ లిమిటెడ్‌‌‌‌’‌‌‌‌ పేరుతో 2017లో కంపెనీ ఏర్పాటు చేశాడు. అతను చైర్మన్​కాగా మరో 8 మంది డైరెక్టర్లు ఉండేవారు. వీరిలో ఒక డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన ఉప్పు నర్సయ్య. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు ఇస్తుండటంతో లోన్‌‌‌‌‌‌‌‌ డబ్బులను తమ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపిణీ చేయడానికి సిబ్బంది అవసరమని నర్సయ్య నిరుద్యోగులకు మాయమాటలు చెప్పాడు. నిరుద్యోగులను నమ్మించేందుకు ముందుగా తన కూతురు, కొడుకులను ఉద్యోగస్తులుగా మార్చి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ముద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్​ను  ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లను కలిసి ఆ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ను చూపిస్తూ తమ బ్యాంకులలో పనిచేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కావాలని నమ్మించాడు. ఒరిజినల్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు తీసుకొని ఒక్కో ఉద్యోగానికి రూ.70 వేల నుంచి రూ.3 లక్షలకు పైగా వసూలు చేశాడు. తెలంగాణలో నలుగురు డైరెక్టర్లు ఉండగా అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మంది నిరుద్యోగుల దగ్గర సుమారు 50 కోట్ల వరకు వసూలు చేశారు. 150 పైగా బ్రాంచీలు ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేశారు. వరంగల్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన నిరుద్యోగులే ఈ బ్రాంచుల్లో ఎక్కువగా  చేరారు. 

ప్రజల నుంచి రూ.150 కోట్ల సేకరణ

ముద్ర బ్యాంక్‌‌‌‌‌‌‌‌ బ్రాంచుల్లో ‌‌‌‌ఉద్యోగంలో చేరిన వాళ్లతో బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డెయిలీ, మంత్లీ, ఇయర్లీ ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్ల రూపేణా నగదు వసూలు చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి పెంచారు. టార్గెట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం పనిచేస్తేనే జీతాలు ఇస్తామని అన్నారు. దీంతో ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ వారికి తెలిసినవాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్​ను ఒప్పించి ముద్ర సొసైటీలో డబ్బులు జమ చేయించారు. డబ్బులిచ్చిన ప్రజలకు బాండ్లు ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల బ్రాంచీలో కోటి రూపాయలు, టేకుమట్ల లో 50 లక్షలు ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లు సేకరించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా బ్రాంచీలలో సుమారు లక్ష మంది రూ.150 కోట్లకు పైగా డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ విధానాన్ని నమ్మని కొందరు ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ కొద్ది నెలలకే ఉద్యోగాలకు రిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. కానీ ఒరిజినల్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు మాత్రం డైరెక్టర్ల దగ్గరే ఉండిపోయాయి. 

డబ్బులు ఎక్కడికి పోయినయ్..

2020‒21లో ముద్ర బ్యాంక్​కంపెనీ లావాదేవీలన్నీ ఆగిపోయాయి. దీంతో ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ తీవ్ర అయోమయంలో పడిపోయారు.  విషయం తెలుసుకోవడానికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా అక్కడ గొడవలు జరిగి పోలీస్‌‌‌‌‌‌‌‌ కేసుల వరకు వెళ్లాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల  పేరుతో వసూలు చేసిన రూ. 50 కోట్లు, బ్రాంచీలలో ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన రూ. 150 కోట్లు డైరెక్టర్లకు పంచి ఇచ్చానని చైర్మన్‌‌‌‌‌‌‌‌ దాసప్ప నాయుడు చెబుతుండగా తాము వసూలు చేసిన సొమ్మంతా చైర్మన్‌‌‌‌‌‌‌‌కే ఇచ్చామని  డైరెక్టర్లు చెబుతున్నారు. దీంతో ఈ కేసు జఠిలంగా మారింది. 200 కోట్ల మేర జరిగిన స్కాంలో నిరుద్యోగులు, ప్రజలే మోసపోయారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, మంచిర్యాలలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు డిపాజిటర్ల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తోటి ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు. పోలీసులు త్వరగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 

పోలీసుల విచారణ వేగవంతం

ముద్ర బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల పేరుతో ఆశ చూపించి తమ దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని ముద్ర బ్యాంక్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉప్పు నర్సయ్యపై మంగళవారం నలుగురు నిరుద్యోగులు హనుమకొండ జిల్లా శాయంపేట పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. దీంతో పోలీసులు నర్సయ్యను పిలిచి విచారించగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ముద్ర సొసైటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా తాను పనిచేసిన మాట వాస్తవమేనని, ప్రజల నుంచి వసూలు చేసిన ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్ల సొమ్మును, ఉద్యోగం ఆశతో నిరుద్యోగులు ఇచ్చిన డబ్బులను అంతా చైర్మన్‌‌‌‌‌‌‌‌ దాసప్పనాయుడికే ఇచ్చినట్లు పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.  

రూ. కోటి డిపాజిట్లు పోయినయ్​

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముద్రా బ్యాంక్‌‌‌‌లో నేను ఇన్​చార్జి మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశాను. ఈ ఉద్యోగం కోసం రూ.3 లక్షలు ఇస్తే నాకు ఓ బాండ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి పోస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఇక్కడ నాతో పాటు ఐదుగురు ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ పనిచేసేవారు. అందరూ డబ్బులిచ్చి ఉద్యోగంలో చేరినవాళ్లే. మేమంతా కలిసి సుమారు 200 మంది కస్టమర్ల దగ్గర రూ.కోటికి పైగా డబ్బులు డిపాజిట్ల రూపంలో వసూలు చేసి ముద్ర సంస్థలో జమ చేశాం. ఈ సంస్థ బోగస్‌‌‌‌‌‌‌‌ అని తేలడంతో మేమిచ్చిన డబ్బులతో  పాటు ప్రజల సొమ్ము కూడా రాకుండా పోయింది.

‒ కొమ్ము అశోక్‌‌‌‌‌‌‌‌, ముద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌ చిట్యాల బ్రాంచీ ఇన్​చార్జి  మేనేజర్‌‌‌‌‌‌‌‌, భూపాలపల్లి

రూ.1.82 లక్షలు చెల్లించా

నాది కిరాణం షాపు. చిట్యాల ముద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో రోజువారీగా డబ్బులు జమ చేస్తే ఏడాది తర్వాత రూ. 3 వడ్డీతో డబ్బులు చెల్లిస్తామని ఆ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దీంతో నేను డెయిలీ రూ.500 చొప్పున  ఏడాదిపాటు రూ.1.82 లక్షలు జమ చేశా. ఏడాది తర్వాత వెళ్లి అడిగితే మెయిన్‌‌‌‌‌‌‌‌ బ్రాంచీ నుంచి డబ్బులు పంపిస్తాం అని చెప్పారు. తర్వాత వారం రోజులకే బ్యాంకు మూసేసి వెళ్లిపోయారు. ఈ డబ్బుల కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చుట్టూ తిరుగుతున్నా.

‒ అమీర్‌‌‌‌‌‌‌‌ సొహైల్‌‌‌‌‌‌‌‌, జూకల్లు, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా