రిపోర్ట్ బయటపెట్టకపోతే నిరాహార దీక్ష చేస్తా

రిపోర్ట్ బయటపెట్టకపోతే నిరాహార దీక్ష చేస్తా

పంజాబ్ లో సొంత ప్రభుత్వానికే తలనొప్పిగా మారారు పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాలు, వాటి వల్ల ఏర్పడుతున్న అనర్థాలపై ప్రభుత్వ రిపోర్ట్ బయట పెట్టాలని సిద్ధు డిమాండ్ చేశారు. ఆ రిపోర్ట్‌ను బయటపెట్టకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే నాలుగు వారాల్లోనే డ్రగ్ మాఫియా వెన్ను విరగ్గొడతామని 2017 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని సిద్ధూ గుర్తు చేశారు. కానీ, నేషనల్ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌‌బీ) రిపోర్టులు చూస్తే 2017 నుంచి 2020 వరకూ ప్రతి ఏటా డ్రగ్స్‌కు సంబంధించిన నేరాల్లో దేశంలోనే పంజాబ్ టాప్‌ ప్లేస్‌లో ఉందని అన్నారు.

అయితే ఈ డ్రగ్స్‌ మాఫియా అరాచకాలను అరికట్టేందుకు నియమించిన స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ 2018లోనే రిపోర్ట్ ఇచ్చిందని, ఆ రిపోర్ట్ ఆధారంగా డ్రగ్స్ ముఠాల ఆటకట్టించకుండా ఉండిపోవడం దారుణమని సిద్ధూ అన్నారు. కనీసం ఇప్పటికైనా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ రిపోర్టులో ఏం ఉందో బయటపెట్టి, డ్రగ్స్ ముఠాలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్ణీత కాల పరిమితిలోపు డ్రగ్స్ దందాల్లో ఉన్న పెద్ద పెద్ద తిమింగలాలను అరెస్టు చేసి, శిక్షలు పడేలా చేయాలని అన్నారు.