ఐరన్ ఓర్, స్టీల్ రేట్లు దిగేనా?

ఐరన్ ఓర్, స్టీల్ రేట్లు దిగేనా?
  • లోకల్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పైపైకి
  • తగ్గిన ప్రొడక్షన్, సప్లయ్‌లో కొరతే కారణం
  • పెరుగుతున్న డిమాండ్‌తో స్టీల్ రేట్లకు రెక్కలు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: ఐరన్ ఓర్‌‌‌‌, స్టీల్‌‌‌‌ ధరలు గత ఏడాది కాలం నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. కిందటేడాది మే లో  సుమారు రూ. 2,000 దగ్గరున్న టన్ను ఐరన్ ఓర్‌‌‌‌‌‌‌‌, ఈ నెలలో సుమారు రూ. 7 వేలకు పెరిగింది.  ఇది సుమారు మూడు రెట్లకు పైగా పెరుగుదల. అదే  హాట్‌‌‌‌ రోల్డ్‌‌‌‌ కాయిల్‌‌‌‌(హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ) స్టీల్ టన్ను ధర రూ. 39,200 నుంచి  రూ. 58 వేలకు పెరిగింది. ఇది సుమారు 50 శాతం పెరుగుదల. మరో రెండు మూడు క్వార్టర్ల వరకు ఐరన్‌‌‌‌ ఓర్‌‌‌‌‌‌‌‌, స్టీల్‌‌‌‌లా డిమాండ్‌‌‌‌ ఇలానే కొనసాగుతుందని ఎనలిస్టులు అంటున్నారు. వీటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం సప్లయ్‌‌‌‌ తగ్గిపోవడమేనని,  కరోనా వలన ఒడిస్సా,  చత్తీస్‌‌‌‌గడ్‌‌‌‌ వంటి ఐరన్ ఓర్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా దొరికే రాష్ట్రాలలో ప్రొడక్షన్‌‌‌‌ తగ్గిపోయిందని చెబుతున్నారు. కొత్తగా వచ్చిన 30 మైన్లలో ఇంకా 8–11 మైన్లలో పనులు మొదలు కాలేదని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఐరన్‌‌‌‌ ఓర్‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌ ధరలు పెరుగుతున్నాయి. గ్లోబల్‌‌‌‌గా ఐరన్‌‌‌‌ ఓర్‌‌‌‌‌‌‌‌ను ఎక్కువగా ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసే కంపెనీలు వేల్‌‌‌‌, బీహెచ్‌‌‌‌పీ, రియో టింటో వంటి కంపెనీలు కరోనా సంక్షోభంతో ప్రొడక్షన్‌‌‌‌ను తగ్గించేశాయి. మరోవైపు చైనా ఎక్కువగా ఐరన్ ఓర్‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌ను దిగుమతి చేసుకుంటోంది. కరోనా కేసులు కంట్రోల్లో ఉండడంతో ఈ దేశ ఎకానమీ పుంజుకుంటోంది. దీంతో చైనాలో వీటి  వాడకం పెరిగిందని చెప్పాలి.  ధరలు పెరగడానికి ఇదొక కారణం. ‘ఐరన్‌‌‌‌ ఓర్‌‌‌‌‌‌‌‌ ధరలు గత పదేళ్లలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా వీటి ధరలు పెరుగుతాయని అంచనావేస్తున్నాం. ప్రస్తుతం ఇండియాలో ఎన్‌‌‌‌ఎండీసీ  ఐరన్‌‌‌‌ ఓర్‌‌‌‌‌‌‌‌(లంప్‌‌‌‌ ఓర్‌‌‌‌‌‌‌‌) టన్ను ధర రూ. 6,970 కి చేరుకుంది. కిందటేడాది మే లో దీని ధర రూ. 2,250 మాత్రమే. గత 11 ఏళ్లలో ఇంతలా ఐరన్‌‌‌‌ ఓర్  ధరలు పెరగడం ఇదే మొదటి సారి. ఒడిస్సా ఐరన్‌‌‌‌ ఓర్ ధరలు కూడా ఇలానే పెరుగుతున్నాయి’ అని ఇక్రా కార్పొరేట్‌‌‌‌ రేటింగ్స్‌‌‌‌ అసోసియేట్ హెడ్‌‌‌‌ రితబ్రాత ఘోష్‌‌‌‌ అన్నారు. దేశంలో ఐరన్‌‌‌‌ ఓర్‌‌‌‌‌‌‌‌ ధరలు ఎక్కువగానే ఉన్నా, దిగుమతి చేసుకుంటున్న ఐరన్ ఓర్‌‌‌‌‌‌‌‌ కంటే ఈ ధరలు తక్కువగానే ఉన్నాయి. 

స్టీల్‌‌‌‌ ఫుల్ జోష్​..
గత కొన్ని క్వార్టర్ల నుంచి స్టీల్  డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. ఈ ఏడాది స్టీల్ డిమాండ్‌‌‌‌ 19.8 శాతం వరకు రికవర్ అవుతుందని వరల్డ్‌‌‌‌ స్టీల్‌‌‌‌ అసోసియేషన్ అంచనావేస్తోంది. ఈ మెటల్‌‌‌‌ను  వాడుతున్న ప్రధాన దేశాలతో పోలిస్తే ఇండియాలోనే డిమాండ్‌‌‌‌ రికవరీ ఎక్కువగా ఉంది. మరోవైపు కరోనా పేషెంట్లకు సాయం చేసేందుకు స్టీల్‌‌‌‌ కంపెనీలు తమ ప్రొడక్షన్‌‌‌‌ను ఆపేసి మెడికల్‌‌‌‌ ఆక్సిజన్‌‌‌‌ను తయారు చేస్తున్నాయి.  జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్‌‌‌‌, టాటా స్టీల్ వంటి పెద్ద కంపెనీలు  ఆక్సిజన్‌‌‌‌ను తయారు చేసి, హాస్పిటల్స్‌‌‌‌కు సప్లయ్ చేస్తున్నాయి. దీంతో స్టీల్ సప్లయ్‌‌‌‌లో అంతరాయం ఏర్పడుతోంది.

స్టీల్‌‌‌‌ దిగుమతులపై కస్టమ్స్‌‌‌‌ డ్యూటీ తగ్గింపు!
రా మెటీరియల్‌‌‌‌ ధరలు పెరుగుతుండడంతో స్టీల్ ధరలు పెరుగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ అందుకునేందుకు స్టీల్‌‌‌‌ దిగుమతులపై  కస్టమ్స్‌‌‌‌ డ్యూటీని ప్రభుత్వం తగ్గించాలని చూస్తోంది.  ‘మెటల్‌‌‌‌ రేట్లు,  ముఖ్యంగా స్టీల్‌‌‌‌ ధరలు పెరుగుతున్నాయి. లోకల్‌‌‌‌గా స్టీల్‌‌‌‌ డిమాండ్ ఊపందుకుంది. దేశంలో సప్లయ్‌‌‌‌ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం స్టీల్ దిగుమతులపై సుంకాలను, యాంటి డంపింగ్‌‌‌‌ డ్యూటీని తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. దీనిని ప్రభుత్వం పరిశీలిస్తోంది’ అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌లో  స్టీల్ రా మెటీరియల్స్‌‌‌‌పై కస్టమ్స్‌‌‌‌ డ్యూటీని 7.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, అదనంగా యాంటి డంపింగ్ డ్యూటీ(ఏడీడీ), కౌంటర్‌‌‌‌‌‌‌‌వేయిలింగ్‌‌‌‌ డ్యూటీ(సీవీడీ) లను విధించింది. కాగా, స్టీల్‌‌‌‌ దిగుమతులపై విధిస్తున్న కస్టమ్స్‌‌‌‌ డ్యూటీని 3 శాతం లోపునకు తీసుకురావాలని  చిన్న ఇండస్ట్రీలు కోరుతున్నాయి.  

స్టీల్ షేర్లతో లాభాల పంట
స్టీల్ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్నాయి. గత ఏడాది కాలంలో  టాటా స్టీల్‌‌‌‌(299 శాతం అప్‌‌‌‌) , జేఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్‌‌‌‌(337 శాతం) , సెయిల్‌‌‌‌(358 శాతం) , జిందాల్‌‌‌‌ స్టీల్ అండ్‌‌‌‌ పవర్‌‌‌‌ (411 శాతం) ‌‌‌‌, టాటా స్టీల్ బీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ (458 శాతం)  వంటి షేర్లు భారీగా లాభపడ్డాయి. మరో రెండు క్వార్టర్ల వరకు స్టీల్‌‌‌‌ ఇండస్ట్రీ పాజిటివ్‌‌‌‌గా ఉంటుదని ఎనలిస్టులు అంటున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌లో టన్ను హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ ధర సుమారు రూ. 7 వేల దగ్గరుంది. అదే జపాన్‌‌‌‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న  హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ ధర టన్నుకు రూ. 12,000 పలుకుతోంది. దీంతో రేట్లు పెరగడానికి మరింత అవకాశం ఉందని ఎనలిస్టులు పేర్కొన్నారు.