చిట్యాల జాతీయ రహదారిపై ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేస్తా: మంత్రి వెంకట్ రెడ్డి

చిట్యాల జాతీయ రహదారిపై ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేస్తా: మంత్రి వెంకట్ రెడ్డి

నల్లగొండ: చిట్యాల మున్సిపాలిటీకి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి చిట్యాలకు వచ్చిన మంత్రికి.. ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిట్యాల సెంటర్ లో మహనీయుల విగ్రహాలకు మంత్రి వెంకట్ రెడ్డి పూలమాల వేసిన నివాళులర్పించారు. 

అనంతరం మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో నకిరేకల్ లో  గెలిపించి వేరేశంను ఎమ్మెల్యే గా చేసినందుకు మీకు ధన్యవాదాలు. చిట్యాలలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్  నిర్మాణానికి జనవరి 2న టెండర్ స్టార్ట్ చేసి సంక్రాంతికి శంకుస్థాపన చేస్తాం.  చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని హామీ ఇస్తు్న్నా.  గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ లే ఉన్నాయి. అప్పుడు ఎలాగైతే రెట్టింపు వేగంతో పనిచేశామో.. అంతకంటే ఎక్కువ రెట్టింపుతో పని చేసి నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం" అని అన్నారు. 

అంతకుముందు యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో అమ్మావారిని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన  మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.