జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగును మోడీ తీసేస్తరేమో : అసదుద్దీన్

 జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగును మోడీ తీసేస్తరేమో : అసదుద్దీన్

ప్రధాని నరేంద్రమోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన జాతీయ జెండాలోని ఆకురంగును కూడా మోడీ సర్కారు తొలగిస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆ రంగుతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని అసదుద్దీన్ ప్రశ్నించారు. ప్రతి అంశంపై స్పందించే ప్రధాని మోడీ... చైనా చొరబాటుపై మాట్లాడతారా? బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా? అని నిలదీశారు.

కేంద్ర బడ్జెట్ 2023లో మైనారిటీలకు నిధులు తగ్గించడంపైనా బీజేపీ ప్రభుత్వంపై అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికిగానూ మైనారిటీ వ్యవహారాల శాఖకు బడ్జెట్ కేటాయింపులు 38 శాతం తగ్గాయని అన్నారు. దేశంలోని ముస్లింలు చదువుకోవడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టంలేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడిన అసదుద్దీన్... భారత్‌లో ఆ రెండు పార్టీలు దేశంలో కొందరు సంపన్నులను తయారు చేశారని ఆరోపించారు. అపార సంపదతో దేశం నుంచి పారిపోయిన వ్యక్తుల జాబితాలో మొఘలుల పేరు ఉందా? దీనిపై ఎవరూ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.