ఆక్రమణలు రెగ్యులరైజ్ చేస్తరా? -అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ఆక్రమణలు రెగ్యులరైజ్ చేస్తరా? -అధికారులపై హైకోర్టు ఆగ్రహం

వివరాలివ్వాలని మంచిర్యాల కలెక్టర్‌‌కు నోటీసు

హైదరాబాద్, వెలుగు: చెరువు భూములు కబ్జా చేసిన వ్యక్తుకు వాటి ఎట్ల రెగ్యులరైజ్​ చేస్తరని సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కబ్జాల నుంచి చెరువులను కాపాడాల్సిన అధికారుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. షామీర్‌‌పేటలో బఫర్‌‌ జోన్స్‌‌లో అక్రమ నిర్మాణాలను.. మంచిర్యాల జిల్లా జైపూర్‌‌ మండలంలోని భీమారం ఊరు చెరువులో కబ్జాను సర్కారు రెగ్యులరైజ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని అంది. భీమారం గ్రామంలోని సర్వే నెంబర్‌‌ 570లోని 136 చదరపు గజాల చెరువు స్థలాన్ని ప్రైవేట్‌‌ వ్యక్తికి ఏవిధంగా రెగ్యులరైజ్ చేశారో చెప్పాలని మంచిర్యాల కలెక్టర్‌‌ను ఆదేశించింది. జీవో 59 ద్వారా చెరువు స్థల ఆక్రమణను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్‌‌ చేస్తూ భారతి భరోసా ఫౌండేషన్‌‌ దాఖలు చేసిన పిల్‌‌ను గురువారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టింది. చెరువు ఆక్రమణ దశలోనే అడ్డుకోవాల్సిన అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్‌‌ను ఆదేశించింది. చెరువుల ఆక్రమణలను సర్కారు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌‌రెడ్డిని ప్రశ్నించింది. విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.