మదర్ డెయిరీపై పంతం నెగ్గేనా?.. పాలకవర్గం రద్దుపై హైకోర్టు స్టే

మదర్  డెయిరీపై  పంతం నెగ్గేనా?.. పాలకవర్గం రద్దుపై హైకోర్టు స్టే
  • అకౌంట్స్​ బుక్స్​ హ్యాండోవర్​ చేసిన డీసీఓ

నల్గొండ, వెలుగు : మదర్​ డెయిరీపై పట్టు సాధించేందుకు వైరి వర్గం చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది. సెప్టెంబర్​లో డైరెక్టర్​ ఎన్నికలు పెట్టకుండా డెయిరీ పాలకవర్గం మ్యాక్స్​ చట్టాన్ని ఉల్లంఘించందన్న కారణంతో రంగారెడ్డి జిల్లా డీసీఓ ధాత్రిదేవి పాలకవర్గాన్ని రద్ధు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాలకవర్గానికి హైకోర్టు నుంచి స్టే రాకుండా చేసేందుకు పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు కేవియట్​ పిటిషన్​ దాఖలు చేశారు. కానీ కొద్ది రో జుల క్రితం డెయిరీ పాలకవర్గం హైకోర్టులో స్టే కోసం పిటిషన్ ​ వేసింది. దీంతో పాలకవర్గం రద్దు ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిందని డెయిరీ చైర్మన్​ శ్రీకర్​ రెడ్డి ‘వెలుగు’ కు చెప్పారు. అంతేకాకుండా డీసీఓ సీజ్  ​చేసిన అకౌంట్స్​ బుక్స్ ను తిరిగి హ్యాండోవర్​ చేశారని ఆయన తెలిపారు.

అయితే హైకోర్టు రెండు వారాలు మాత్రమే స్టే ఇచ్చిందని, కానీ తమ పోరాటం ఇంతటితో ఆగిపోలేదని పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. డెయిరీ వివాదం కోర్టుకెక్కడంతో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది. మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి తమ్ముడు మాజీ చైర్మన్​ గుత్తా జితేందర్​ రెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని, తిరిగి చైర్మన్​ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పాలకవర్గం ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎ న్నికల్లో జితేందర్​ రెడ్డి వర్గం చిట్యాల మండలంలో పరోక్షంగా కాంగ్రెస్​  విజయానికి సహరించిందని ప్రచారం జరుగుతోంది. జితేందర్​రెడ్డికి తిరిగి చైర్మన్​ పదవి కట్టబెట్టే విషయంలో లోపాయికారంగా ఒప్పందం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆలేరు, భువనగిరిలో సొసైటీలు ఎక్కువగా ఉన్నందున ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త మహేందర్​ రెడ్డి తన అనుచరుడు శ్రీకర్​ రెడ్డిని చైర్మన్​గా గత ఎన్నికల్లో ఎన్నుకున్నారు.

ఏడాది తిరగక ముందే మళ్లీ డెయిరీలో వివాదాలు తలెత్తడం రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన డెయిరీ.. అసలే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో డెయిరీ రాజకీయాలపై నల్గొండ, యాదాద్రి జిల్లాల కాంగ్రెస్​ ముఖ్య నేతలు దృష్టిపెట్టారు. దీంతో డెయిరీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు, పాల సంఘాల అధ్యక్షులు ఎదురుచూస్తున్నారు.