ఈ రోజుల్లో పొద్దున లేవగానే పేపర్లో లేదా న్యూస్ ఛానల్స్‌లో పెట్రోల్ రేట్లు ఎంత పెరిగాయో చూడటమే సామాన్యుడికి పెద్ద టాస్క్ అయిపోయింది. అసలే నిత్యావసరాల ధరలు మండిపోతుంటే, దానికి తోడు ఇంధన ధరల పెరుగుదల మధ్యతరగతి జీవితాన్ని మరింత కుదిపేస్తోంది. ఒకప్పుడు కిలోమీటర్ల దూరం అయినా హ్యాపీగా, హెల్తీగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవారు. కానీ ఈరోజు పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాలన్నా బైక్ తీయాల్సిందే.. వాహనాల వాడకం పెరిగి, పెట్రోల్ మీద మనం అంతలా ఆధారపడిపోయాం కాబట్టే.. ఈరోజు రేట్లు పెరిగిన ప్రతిసారీ మనం విలవిలలాడిపోతున్నాం. మరి ఈ పెట్రోల్ సెగ నుంచి తప్పించుకోవాలంటే మళ్ళీ పాత రోజుల్లో లాగా సైకిల్ రాక తప్పదా....
ఒకప్పుడు పక్క ఊరికి, పొలం పనులకి, కిరాణా, బట్టల షాపుకి... ఎక్కడికి పోవాలన్నా... సైకిల్ ఎక్కాల్సిందే. పెడల్ తొక్కాల్సిందే. ఇంటింటికీ తిరిగి పాలపోసే వాళ్ల దగ్గరి నుంచి మొదలు.. పేపర్ బాయ్స్, పోస్ట్ మ్యాన్ల వరకు సైకిల్ లేనిదే పని కాదు. కానీ, ఇప్పుడు... ఎటు చూసినా, ఖరీదైన కార్లు, రమ్మని దూసుకెళ్లే డుగ్దుడుగ్గు బండ్లు. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్లు రకరకాల వెహికల్స్ వాడుతున్నారు. అలాగని సైకిలిని వదిలేశారా! అంటే లేదు. అందుకే ఒకప్పుడు రెండుచక్రాలు, చెయిన్తో నడిచిన సైకిల్స్ కాస్తా రూపురేఖలు మార్చుకుంది. గేర్లు పెట్టుకుని ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు మోడర్న్ లుక్తో రెడీగా ఉన్నానంటోంది.
సైకిల్ డే
ప్రతి ఏటా జూన్ 3న ప్రపంచ సైకిల్ డే జరుపుతారు. పోలాండ్ కి చెందిన లెస్జెక్ సిబిల్స్కి అనే సోషల్ సైంటిస్ట్ అమెరికాలో చేసిన వర్క్ ద్వారా సైకిల్ డే మొదలైంది. ఆయనేం చేశాడంటే... వరల్డ్ సైకిల్ డే జరపాలని సైకిల్ మీద తిరుగుతూ ప్రచారం చేశాడు. 57 దేశాల మద్దతు కూడా వచ్చింది. చివరకు ఆయన కష్టం ఫలించింది. 2018లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను 'ప్రపంచ సైకిల్ దినోత్సవం'గా ప్రకటించారు.
సిటీ ఆఫ్ సైకిల్స్
ప్రపంచంలోనే ది సిటీ ఆఫ్ సైకిల్ గా ఫేమస్ కోపెన్ హాగన్. అక్కడివాళ్లు రోజుకి దాదాపు 1.44 మిలియన్ అంటే 35 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతారు. అక్కడి జనాభాలో సగానికిపైగా సైకిల్ వాడతారు. వెహికల్స్ వెళ్లడానికి హైవేలు ఉన్నట్టే ఇక్కడ సైకిల్స్ వెళ్లడానికే హైవేలు కట్టారు. 390 కిలోమీటర్ల మేర సైకిల్ దారులు, వందల కిలో మీటర్ల వరకు రీజనల్ సైకిల్ హైవేలు ఉన్నాయక్కడ. అంతేకాదు, ఆల్బర్ట్, ల్యాండ్ అనే ఊరికి కనెక్ట్ చేస్తూ సైకిల్ సూపర్ హైవే కూడా ఉంది. సైకిళ్ల సంఖ్య ఇలా ఉంటే, వాటికి గాలి కొట్టించడానికి, రిపేర్లు చేయడానికీ ఎన్ని షాపులు ఉండాలి? అందుకే అక్కడ సైకిల్ రిపేర్ షాపులు చాలానే ఉన్నాయి.
జనాభా కంటే సైకిల్స్ ఎక్కువ
మరొక సిటీ నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్ డామ్. దీన్ని 'ది కాపిటల్ సిటీ ఆఫ్ సైకిల్' అంటారు. ఎందుకంటే ఇక్కడ జనాభాకంటే సైకిళ్లే ఎక్కువ ఉన్నాయి మరి. ఆమ్స్టర్ డామ్ జనాభా 8లక్షలకు పైనే. అయితే అక్కడున్న సైకిల్స్ సంఖ్య తొమ్మిది లక్షలు. 50 శాతానికి పైగా జర్నీలన్నీ సైకిల్ మీదే. అందుకని ఇక్కడ 400 కిలోమీటర్లకు పైగా సైకిల్ పాత్ వేస్ ఉన్నాయి. అందుకే ఈ సిటీని 'సైక్లింగ్ హెవెన్' అని కూడా అంటారు. ఇంటి నుంచి బయటికి అడుగుపెడితే చాలు ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ ఎక్కాల్సిందే. టూరిస్ట్స్ కోసం సైకిల్స్ రెంట్ కి కూడా ఇస్తారు.
ఈ రెండు సిటీలే కాదు... కెనడాలోని మాంట్రియల్, ఫ్రాన్స్ లోని స్ట్రాస్బోర్గ్, బెల్జియంలోని యాంట్ వెర్ప్, జపాన్ లోని టోక్యో, స్పెయిన్లోని బార్సిలోనా, జర్మనీలోని బెర్లిన్, స్వీడన్ లోని మాల్మో సిటీల్లో కూడా సైకిల్ వాడకం ఎక్కువే.
మనదేశంలో...
దాదాపు పన్నెండేండ్ల ముందు వరకు కూడా పుణె ‘ది సిటీ ఆఫ్ సైకిల్స్’గా పాపులర్. కానీ, ఇప్పుడు అదే పుణె ఎక్కువ వెహికల్స్ ఉన్న సిటీగా మారిపోయింది. ముంబై, ఢిల్లీ కంటే ఎక్కువ వెహికల్స్ తిరిగే సిటీ ఇదే. సైకిల్స్ వాడాలని చాలా క్యాంపెయిన్లు కూడా నడిచాయి. పుణె బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 2006లో బస్ కారిడార్స్ అన్నింటిలో సైకిల్ ట్రాక్లు ఉండాలనే రూల్ ఒకటి పెట్టింది. బెంగుళూరు, హైదరాబాద్ లు కూడా ఒకప్పుడు సిటీ ఆఫ్ సైకిల్స్ గా ఉండేవి.
