మన దేశం పేరు మారిపోయింది : ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. పార్లమెంట్ లో బిల్లు రాబోతున్నదా..?

మన దేశం పేరు మారిపోయింది : ప్రెసిడెంట్ ఆఫ్  భారత్.. పార్లమెంట్ లో బిల్లు రాబోతున్నదా..?

ఇకపై మన దేశం పేరు మారనుందా..? ఇండియా నుంచి భారత్ గా మారనుందా..? మన రాజ్యాంగాన్ని సవరించి.. తీర్మానం చేయనున్నారా..?  అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుత మన దేశ రాజకీయ పరిణామాలు చూస్తుంటే... ఇది నిజమేననే తెలుస్తోంది. అసలింతకు ఇదే సమయంలో మన దేశం పేరు మారుస్తున్నారనే చర్చ ఎందుకు మొదలైంది...? మార్చాల్సిన అవసరం ఏంటి..? ఇన్నాళ్లు ఈ విషయం మన పాలకులకు తెలియదా..? లేక ఎలక్షన్స్ ముందు పేరు మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది...?

భారతదేశం అధ్యక్షతన ఈ వారంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9న ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌ నుంచి అతిథులకు ఆహ్వానం వెళ్లాయి. అయితే... ఈ ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించి ఉండటం సర్వత్రా ఆసక్తితో పాటు చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ :ఇండియా కాదు.. భారత్ : పేరు మార్చాలన్న బీజేపీ ఎంపీ

అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికలో President of Bharat అని ముద్రించి ఉండటంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. జీ-20 విందు కోసం President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ఇంతకుముందు ‘ఇండియా: అది భారత్‌’ అని ఉంటుందనీ, ఇప్పుడు మోదీ సర్కార్‌ వల్ల దీన్ని.. భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య అని చదవాలి అని,  ఇది రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతోన్న దాడి అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్వీట్ చేశారు.


జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ మన దేశం పేరు ‘భారత్‌’ అని ముద్రించారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అందులో రాసి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. 

ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగంలో ‘ఇండియా: దటీజ్‌ భారత్‌’ అని ఉండగా.. ఇకపై ‘భారత్‌’ అనే పేరు మాత్రమే ఉండేలా సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. 

సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీల మధ్య అంటే ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు సమాచారం అందుతోంది.