అసెంబ్లీలో ఆమోదం తెలిపి.. బయట వ్యతిరేకిస్తారా?.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి

అసెంబ్లీలో ఆమోదం తెలిపి.. బయట వ్యతిరేకిస్తారా?.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లపై ఒక న్యాయం.. తెలంగాణలో ఇంకో న్యాయమా..? అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపి.. ఇప్పుడు బయట వ్యతిరేకించడం దుర్మార్గమని ఆమె ఆరోపించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ  ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 

ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. భారత్ పై ట్రంప్ ట్యాక్సులపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు సీపీఎం పూర్తి మద్దతు ఉంటుందని, సాధించేవరకు ఉమ్మడి కార్యాచరణతో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై పోరాడాలన్నారు.  ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సాగర్, పార్టీ జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు, గీతా దేశనాయక్ పాల్గొన్నారు.