
లండన్: వింబుల్డన్ టోర్నమెంట్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. వరల్డ్ మూడో ర్యాంకర్లు అలెగ్జాండర్ జ్వెరెవ్, జెస్సికా పెగులా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ పోరులో జర్మనీ స్టార్ జ్వెరెవ్ 6–7 (3/7), 7–6 (10/8), 3–6, 7–6 (7/5), 6--–4 తో 72వ ర్యాంకర్ ఆర్థర్ రిండెర్క్‌నెచ్ (ఫ్రాన్స్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు.
నాలుగు గంటల 40 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 31 ఏస్‌లు, 71 విన్నర్లు కొట్టిన జ్వెరెవ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా నెగ్గలేకపోయాడు. ఐదు డబుల్ ఫాల్ట్స్, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 25 ఏస్‌లు, 78 విన్నర్లు కొట్టిన ఆర్థర్ మూడు బ్రేక్ పాయింట్లు సాధించి కెరీర్‌లో అతి పెద్ద విజయం సాధించాడు.
వరల్డ్ నంబర్ వన్ జానిక్ సినర్ 6–-4, 6–-3, 6–-0తో వరుస సెట్లలో ఇటలీకే చెందిన లూకా నార్డిని ఓడించాడు. కానీ, గతేడాది సెమీఫైనలిస్ట్, ఏడో సీడ్ లొరెంజో ముసెట్టికి షాక్ తగిలింది. జార్జియాకు చెందిన క్వాలిఫయర్ నికోలోజ్ బాసిలాష్విలి 6–-2, 4-–6, 7-–5, 6–-1 తో ముసెట్టి పని పట్టాడు. ఆస్ట్రేలియా ప్లేయర్, 11వ సీడ్ అలెక్స్ డిమినార్ 6-–1, 6-–2, 7-–6తో రాబర్టో కార్బల్లెస్ (స్పెయిన్)ను సునాయాసంగా ఓడించగా, ఐదో సీడ్ అమెరికా స్టార్ టేలర్ ఫ్రిట్జ్ తొలి రెండు సెట్లు కోల్పోయినా గొప్పగా పుంజుకొని 6–-7(6/8), 6–-7 (8/10), 6–-4, 7–-6(8/6), 6–-4తో జియోవానీ పెరికార్డ్ (ఫ్రాన్స్) గెలిచి రెండో రౌండ్ చేరాడు.
స్వైటెక్, క్రెజికోవా బోణీ
విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్ పోరులో ఇటలీ ప్లేయర్ ఎలిసబెటా కొకియారెట్టో 6-–2, 6–-3తో మూడో సీడ్ అమెరికా స్టార్ పెగులాకు షాకిచ్చింది. కేవలం 58 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం విశేషం. గత ఐదేండ్లలో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పెగులా ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓడటం ఇదే తొలిసారి. పెగులా ఈ మ్యాచ్‌లో కేవలం ఐదు విన్నర్లు మాత్రమే కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్స్, 24 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
ఇతర మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ బర్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 3–-6, 6–-2, 6–-1తో 20 ఏండ్ల అలెగ్జాండ్రా ఇలా (ఫిలిప్పీన్స్)పై పోరాడి గెలవగా, ఎనిమిదో సీడ్ ఇగా స్వైటెక్ (పోలాండ్) 7–-5, 6–-1తో పోలినా కుదెర్మెటోవా (రష్యా)ను ఓడించింది. ఏడో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) 6–3, 6–3తో మాయర్ షెరీఫ్ (ఈజిప్ట్)పై నెగ్గగా, కాథెరీనా సినియాకోవా (చెక్) 7–-5, 4-–6, 6-–1తో ఐదో ర్యాంకర్ క్విన్వెన్ జెంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించింది.