
- హుజూరాబాద్ ప్రజలు చరిత్ర తిరగరాశారు
- ప్రలోభాలకు లొంగకుండా.. బెదిరింపులకు భయపడకుండా ఓట్లేసిన ప్రజలకు సెల్యూట్
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం ప్రజల విజయమని, గెలుపు క్రెడిట్ బీజేపీది కాదు ప్రజలదేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజలు చరిత్ర తిరగరాశారని, నీతికి న్యాయానికి మద్దతుగా నిలిచారని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలో బిజెపికి మద్దతు ఇచ్చిన హుజురాబాద్ ప్రజానీకానికి తన తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఖర్చుతో కూడుకున్న ఎన్నికలో పాలక టీఆర్ఎస్ పార్టీ మభ్యపెట్టినా వాటిని లెక్క చేయకుండా ప్రజలు బిజెపికి ఓటు వేసి గెలిపించి హుజురాబాద్ ప్రజలు చరిత్ర తిరగరాశారని కొనియాడారు. గత 40 ఏళ్లలో ఈ తరహా ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు, ఈటల తరువాత ఎక్కువ పర్యటనలు చేసింది తానేనన్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసం వేలాది కోట్ల ప్రాజెక్టులు ప్రవేశపెట్టారని, డబ్బును, పధకాలను ఎరగే వేయడంతోపాటు బెదిరింపులకు దిగినా లొంగకుండా ఓటుహక్కును వినియోగించుకున్న హుజురాబాద్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఈటల రాజేందర్, బిజెపిల పై విశ్వాసం ఉంచి ప్రజలు తీర్పు ఇచ్చారని, ఈ ఫలితంతో నైతిక విలువలున్న ప్రతి ఒక్కరు సంతోష పడతారని అన్నారు.
అహంకారాన్ని, అవినీతిని ప్రజలు వ్యతిరేకించారని, కెసిఆర్ చిత్తశుద్ధి పట్ల ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నది తేట తెల్లమైందన్నారు. ప్రజలు అభ్యర్థులు, పార్టీ మీద విశ్వాసం ఉంచితే ఎన్ని డబ్బులు పెట్టినా అది పనిచేయదని నిరూపితమైందన్నారు. రాజకీయలకి దిశానిర్దేశం చేసేలా నైతిక విలువలతో కూడిన ప్రయత్నం హుజురాబాద్ ప్రజలు చేశారని, హుజురాబాద్ ప్రజలను ఎంత పొగిడినా తక్కువేనన్నారు. హుజురాబాద్ ప్రజలకు బిజెపి రుణపడి ఉంటుందని, అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికలు చిన్నవిషయం అంటూనే ప్లీనరి పెట్టారు, అబద్దాలు అన్నిసార్లు నమ్మరని, ఎన్నికలో మా ఖర్చుకు, టిఆర్ఎస్ కు పోలిక లేదన్నారు. కాంగ్రెస్ లో ఉన్న నాయకులను టిఆర్ఎస్ లోకి తీసుకుంటే మాకు కాంగ్రెస్ ఎలా సహకరిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే టిఆర్ఎస్ పార్టీకే ఉంటుందని అన్నారు.
హుజూరాబాద్ ఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది
హుజురాబాద్ ఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది, హుజురాబాద్ హీరోలు ప్రజలే నన్నారు. ఈటల రాజేందర్ గెలుపు క్రెడిట్ బీజేపీది కాదు..ప్రజల దేనని చెబుతూ వ్యక్తిగత వ్యక్తిత్వం కూడా ఈటల గెలుపునకు తోడైందన్నారు. ఎన్నికలకు ముందే ఈటల రాజేందర్ ను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించామని, బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యులు అంటే రాష్ట్ర అధ్యక్షుడితో సమానమన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు బిజెపికి మంచి భవిష్యత్తును ఇస్తాయన్నారు. తెలంగాణ కు ద్రోహం చేసినవారు కెసిఆర్ పక్కన కూర్చుంటున్నారని, ప్రజలు మార్పు కోరుకున్నపుడు ఖచ్చితంగా తెలంగాణలో మార్పు వస్తుందన్నారు. నేతలు బీజేపీలోకి రాకుండా ఎవరు ఆపలేరని, బిజెపిని,సిద్ధాంతాలను నమ్మి వచ్చే వారిని బిజెపి అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుందన్నారు. పార్టీలో చేరికలు ఏమైనా ఉంటే ముందే చెప్తామని కిషన్ రెడ్డి తెలిపారు.