
వింటర్ వస్తూవస్తూనే తనతో పాటు కాసింత బద్ధకాన్ని కూడా తీసుకొస్తుంది. మిగతా సీజన్లలో ఆరుగంటల్లోపే నిద్రలేచే వాళ్లను కూడా, ఇంకాసేపు ముసుగుదన్ని నిద్రపోయేలా చేస్తుంది. ఎంత రాత్రి అయినా, పనులన్నీ పూర్తిచేసుకునే ఇంటికి
చేరుకునే వాళ్లను… ఒక గంట ముందే ఇంటిదారి పట్టిస్తుంది. ఇలా వింటర్ ఎంటరై లైఫ్స్టైల్లో ఎంతోకొంత మార్పును తీసుకొస్తుంది. వీటిలో కొన్నిమార్పులు బాగానే ఉంటాయి కానీ, మిగతా వాటిని ఎంకరేజ్ చేయకూడదు.
వర్కవుట్లకు చెక్ పెట్టొద్దు…
హెల్తీ లైఫ్‌స్టైల్‌ని ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే వాళ్లైనా వింటర్లో కొంత తటపటాయిస్తారు. పొద్దున్నే జిమ్‌లో అదరగొట్టే టైసన్లూ, జిమ్సన్లూ సైతం లైట్ తీసుకుంటారు. అలారం ఐదుకొట్టగానే ట్రాక్ప్యాంట్తో, టీషర్ట్‌తో వాకింగ్‌కు, జాగింగ్‌కు దిగిపోయే వాళ్లంతా కొంత మెండికేస్తారు. ఇంటి దగ్గర్లోని పార్క్‌లో పొద్దున్నే నాలుగైదు రౌండ్లు కొట్టి ఊపిరిపీల్చుకునే మహిళలు ఏదో ఒక వంకతో స్కిప్ చేస్తారు. వాకింగ్‌ను జీవితంలో భాగం చేసుకున్న సీనియర్ సిటిజన్లు కూడా ఇంకాసేపు నిద్రపోదామనే చూస్తుంటారు.
ఇలా వింటర్లో వర్కవుట్లకు చెక్ పెట్టడం మంచిది కాదని ఫిట్నెస్గురూలు చెప్తున్నారు. మిగతా సీజన్లతో పోల్చుకుంటే, వింటర్లోనే శరీరానికి ఎక్కువ వ్యాయామం కావాలి. ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నా, వర్కవుట్లను మాత్రం మానొద్దు. ఒక్కరోజు ఆపేసినా… ఆ బద్దకం అలానే కొనసాగుతుంది. ఆ ఎఫెక్ట్ ఆ తర్వాతి కాలంపైనా పడుతుందంటూ హెచ్చరిస్తున్నారు వాళ్లు.
ఇలా బయటపడొచ్చు
వింటర్ అనగానే చలితో పాటు, స్వెట్టర్లూ గుర్తొస్తాయి. ఇవే ఎంత చలినుంచైనా బయటపడేసి, మనల్ని రోడ్ మీదకి వచ్చేలా చేయడంలో ‘కీరోల్’ ప్లేచేస్తాయి. స్వెట్టర్‌తో ఛాతీ భాగమంతా కవర్ అయి పోతుంది. దీంతో పాటు తప్పకుండా తలను కవర్ చేసుకోవాలి. బాడీ టెంపరేచర్ ఎక్కువగా తల నుంచే బయటకు వెళుతుంది. స్కార్ఫ్లూ, మఫ్లర్లూ చాలా మేలు చేస్తాయి. వీటిని తప్పనిసరిగా వాడేలా చూసుకోవాలి. ముఖాన్నీ, నోటినీ కవర్ చేస్తూ, చలిగాలుల నుంచి కాపాడుతాయి. చెవుల్లోకి గాలి వెళ్లకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.
పొద్దున్నే వర్కవుట్ల కోసం బయటికి వెళ్లాలన్నా, ఏపనైనా చూసుకోవాలన్నా, టూవీలర్ మీద వెళ్తున్నా తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పనిలో పనిగా షూస్ వేసుకుంటే కాళ్లనూ రిక్షించుకోవచ్చు. అయితే ఎలాంటి షూస్ సెలక్ట్ చేసుకోవాలన్నదాని గురించే ఆలోచించాలి. మంచు వల్ల పాడవని వింటర్ షూస్ ఇప్పుడు మార్కెట్లో అన్ని చోట్లా దొరుకుతున్నాయి. వాటిని ఎంచుకుంటేనే బెటర్. సాధారణ దుస్తుల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్కిన్‌కు అతుక్కున్నట్టు ఉండే వాటిని వేసుకోకపోవడమే బెటర్. వీలైనంత వరకూ వదులుగా ఉండే దుస్తులనే వేసుకోవాలి. ఇన్నర్స్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవాలి. తేమను తీసుకోకుండా, బాడీ టెంపరేచర్‌ను మేనేజ్ చేయగలవాటినే వాడాలి. సిల్క్, పాలిప్రొపిలిన్, ఊలు క్లాత్ ఇన్నర్స్ వాడాలి. ఇవి చలిని తట్టుకునే శక్తిని శరీరానికిస్తాయి. వింటర్లో కాటన్ క్లాత్ కంటే ఇవే బాగా అనిపిస్తాయి.
వీటితో జాగ్రత్త
ఎంత కేర్ తీసుకున్నా వింటర్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. జలుబు, న్యుమోనియా, ఫ్లూ వంటివి రెగ్యులర్‌గా ఎటాక్ చేస్తూనే ఉంటాయి. వీటి నుంచి వీలైనంత తెలివిగా తప్పించుకోవాలి. బయటి ఫుడ్‌ని పూర్తిగా తగ్గించేస్తేనే మంచిది. ఎక్కడికి వెళ్లినా మనతో పాటుగా వాటర్‌బాటిల్‌ను తీసుకెళ్లాలి. నీళ్లను కాచి వడపోసి తాగాలి. జలుబు వస్తే, అది పెరిగి జ్వరం వరకూ వెళ్లకుండా జాగ్రత్తపడాలి. రెగ్యులర్‌గా వేడినీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలి. పొడి కర్చీఫ్‌ను ఎప్పడూ పక్కనే ఉంచుకోవాలి. జలుబు ముదిరి జ్వరంగా మారుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికెళ్లాలి.
ఇలా డ్రెస్సింగ్ విషయంలో, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే… వింటర్‌ను అన్ని సీజన్ల కంటే ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. బాడీని పూర్తిగా కవర్ చేసుకుని, కురుస్తున్న వింటర్ మంచును చూస్తూ వాకింగ్ చేయొచ్చు. చలికాలానికి భయపడకుండా మనమే సూర్యుడికి ఎదురెళ్లి… గుడ్‌మార్నింగ్ చెప్పొచ్చు.