చలికాలంలో కరకరలాడే మురుకులు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తింటారు. చాలా మందికి సాయంత్రం వేళ టీ, కాఫీతోపాటు కరకరలాడే మురుకులు తినడం ఎంతో ఇష్టం. . అలాంటివారు కొన్ని టిప్స్ పాటిస్తూ ఇంట్లో జస్ట్ 15 నిమిషాల్లో ఇలా మురుకులు తయారుచేసుకోండి...!
బేసిన్ బటర్ మురుకులు తయారీకి కావలసినవి
- బియ్యప్పిండి: 2 కప్పులు
- మినపప్పు పిండి: 1/2కప్పు
- శెనగపిండి :1/2కప్పు
- వెన్న :2టేబుల్ స్పూన్లు
- కారం: 1 టీస్పూన్
- ఇంగువ: చిటికెడు
- ఉప్పు: తగినంత
- వేడి నూనె: 2 టేబుల్ స్పూన్లు
- వేడి నీళ్లు : పిండి కలపడానికి తగినన్ని
తయారీ విధానం: ముందుగా శెనగపిండిని నూనె లేకుండా వేగించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, మినపప్పు పిండి, కారం, ఇంగువ, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వెన్న వేసి వుండలు లేకుండా కలుపుకొంటూ వేడి నీళ్లతో మురుకులు పిండిలా కలపాలి. దానిపై కొంచెం గోరు వెచ్చని నూనె వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. పొయ్యి మీద వండి పెట్టి మురుకులు వేగించడానికి సరిపడినంత నూనె పోయాలి. తరువాత మురుకుల పిండిని తీసుకొని పెద్ద ముద్దలుగా చేసుకొని మురుకుల గిద్దెలో పిండిని పెట్టి ఒక పేపర్ మీద గుండ్రంగా వత్తాలి. వాటిని వేడి 'నూనెలో వేసి సన్నని మంట మీద ఉంచి రెండు వైపులా కాల్చాలి.
కొబ్బరిపాలతో మురుకులు తయారీకి కావలసినవి
- బియ్యప్పిండి: 2 కప్పులు
- మినపప్పు :1/2 కప్పు
- పెసరపప్పు : 1/2 కప్పు
- వచ్చి కొబ్బరిపాలు: 2 కప్పులు
- ఇంగువ :చిటికెడు
- కారం :1టీస్పూన్ (మీకుకావలసినంత)
- ఉప్పు: తగినంత
- వెన్న: 1 టేబుల్ స్పూన్
- వేడి నూనె: 2 టేబుల్ స్పూన్లు
- వేడి నీళ్లు: పిండి కలపడానికి తగినన్ని
తయారీ విధానం: ముందుగా పొయ్యిమీద బాండీ పెట్టి మినపప్పు, పెసరపప్పును నూనె లేకుండా దోరగా వేగించాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి. ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యప్పిండి, మినప, పెసర పప్పుల పొడి, ఇంగువ, ఉప్పు, వెన్న, కారం వేసి కలపాలి. తరువాత కొబ్బరి పాలను 5 నిమిషాలు వేడిచేయాలి.
మురుకులు పిండిలోకి కావలసినన్ని పాలు పోసి పిండిని కలపాలి. ఈ పిండిలో పై నుంచి వేడి నూనె వేసి కలపాలి. పొయ్యి మీద బాండి పెట్టి మురుకులు వేగించడానికి సరిపడినంత వేడెక్కాక పిండిని తీసుకొని పెద్ద ముద్దలుగా చేయాలి. వాటిని గిద్దలో తీసుకొని ఒక పేపర్ మీద గుండ్రంగా వత్తాలి. వేడి నూనెలో వేసి సన్నని మంట మీద రెండు వైపులా కాల్చాలి
మిక్స్ డాల్ తో మురుకులు తయారీకి కావలసినవి
- బియ్యం పిండి: 2 కప్పులు
- మినపప్పు :1 టేబుల్ స్పూన్
- పెసరపప్పు: 2 టేబుల్ స్పూన్లు
- శెనగపప్పు:1 టేబుల్ స్పూన్
- కందిపప్పు: 1 టేబుల్ స్పూన్
- శెనగలు: 1 టేబుల్ స్పూన్
- ఇంగువ :చిటికెడు
- కారం: 1 టీస్పూన్ (మీకు కావలసినంత)
- ఉప్పు: తగినంత
- వేడినూనె : 2 టేబుల్ స్పూన్లు
- వేడి నీళ్లు : పిండి కలపడానికి తగినన్ని
తయారీ విధానం: పెసరపప్పు, శెనగపప్పు కందిపప్పు శెనగపప్పును నూనె లేకుండా వేగించి పక్కన పెట్టాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి పట్టాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి కారం, ఇంగువ, కారం, ఉప్పు, వేడి నూనె, ముందుగా తయారు చేసుకున్న పప్పుల పొడిని వేసి ఉండలు లేకుండా కలుపుకొని అందులో వేడి నీళ్లు వేసి మురుకుల పిండిలా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టాలి. పొయ్యి మీద బాండీ పెట్టి మురుకులు వేగించడానికి కావలసినంత నూనె పోయాలి. నూనె వేడయ్యాక మురుకుల పిండిని తీసుకొని, పెద్ద ముద్దలుగా చేయాలి. మురుకుల గిద్దెలో పిండిని పెట్టి ఒక పేపర్ మీద మురుకుల్లా గుండ్రంగా వత్తాలి. నూనెలో వేసి సన్నని మంట మీద ఉంచి రెండు వైపులా కాల్చాలి..
