గతానికి గుడ్ బై చెబుతూ.. భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆశిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్

గతానికి గుడ్ బై చెబుతూ.. భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆశిస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్

“రేపు అనే 365 పేజీల పుస్తకంలో మొదటి ఖాళీ పేజీ. మంచిగా రాయండి" అని బ్రాడ్ పైస్లీ చెప్పినట్టు.. రేపు అనేది ఎలా ఉండాలో ముందే నిశ్చయం అయిపోవాలి. దాని కోసం పెద్ద కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. అలా అని ఈ క్షణాన్ని నిర్లక్ష్యమూ చేయొద్దు. ప్రతీ రోజూ మన జీవితంలో ఉత్తమమైన రోజుగా ఉండాలని కోరుకుంటే చాలు. ఏదైనా కొత్త వస్తువు లేదా కొత్త మనుషులు ముందు బాగానే అనిపిస్తాయి. కానీ కాలం గడిచే కొద్దీ.. వస్తువులు పాతవైపోతాయి.. మనుషులు మారిపోతూ ఉంటారు. అలాగే ఈ రోజున్న కాలం.. రేపుండదు.. రేపున్న సంతోషం.. ఎల్లుండికి శాశ్వతం కాదు. కాబట్టి ఉన్న క్షణాలను ఆస్వాదించాలి..రేపటి సంతోషం కోసం దారులు వెతకాలి... అదే జీవితం.

మామూలుగా అందరూ అడుగుతూ ఉంటారు కదా. కొత్త సంవత్సరం వస్తుంది కదా..కొత్తగా ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని. నిజానికి ఈ ప్రశ్న ప్రతి ఏడాదీ వినిపించేదే అయినా.. నిర్ణయాలు మాత్రం మారుతూ ఉంటాయ్. కానీ వాటిలో ఎన్ని చేస్తున్నాం.. దాని కోసం ఎంత టైం వెచ్చిస్తున్నాం. అయినా ఏదైనా మార్చాలని నువ్వు గట్టిగా అనుకుంటే.. దానికి కాలం కోసం ఎదురుచూడకు. ఏదైనా మార్చుకోవాలని అనుకుంటే ఇప్పుడే మార్చుకో. దానికి ఈ కొత్త సంవత్సరాలు అని పేరు పెట్టడం ఎందుకో కదా. కానీ ఇదీ ఒకందుకు మంచికేనేమో.. ఇలాగైనా తమను తాము మార్చుకోవడానికి, మారడానికి ఆస్కారం ఉందేమో..

ఎవరైతే భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుకు సాగుతారో వారినే విజయం వరిస్తుంది. ఎవరైతే గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతారే.. వారి ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. నిన్న ఎలా ఉన్నదాని కన్నా ఈ రోజు ఎలా ఉన్నామన్నది ముఖ్యం. అలాగే.. ఈ రోజు ఎలా ఉన్నా.. రేపు ఎలా ఉంటామన్నది ముఖ్యం. కాబట్టి ప్రతి ముగింపునూ వేడుకగా జరుపుకోండి. అవే కొత్త ఆరంభాలకు నాంది పలుకుతాయి. జీవితం అందరికీ ఒకటే. కాకపోతే పరిస్థితులే దాన్ని మారుస్తాయి. పాత సంవత్సరానికే కాదు... కాసేపు పాత పద్దతులకూ వీడ్కోలు పలికి.. జీవితంలో కొత్త ఆలోచనలను, కొత్త ఆశయాలను.. ముందుకు తీసుకెళ్లేందుకు ఎంచుకున్న మార్గమే ఈ కొత్త సంవత్సరం. కాబట్టి గతాన్ని మర్చిపోవాలి. భవిష్యత్తును ఆహ్వానించాలి. అవకాశాలను అందుకోవాలి. ఆశతో అడుగులు వెయ్యాలి. V6 పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. వెల్ కమ్ 2023.