అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్​తో బంగారు నగలకు డిమాండ్​

అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్​తో బంగారు నగలకు డిమాండ్​

మొదటి 6 నెలల్లో 49 శాతం పైకి

ముంబై : అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్​తో దేశంలో బంగారు నగలకు డిమాండ్​ పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ డిమాండ్​ 49 శాతం పెరిగి 140.3 టన్నులకు చేరినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. జనవరి– జూన్​ మధ్య కాలంలో ఇండియాలో బంగారం డిమాండ్​ 170.70 టన్నులకు చేరిందని పేర్కొంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్​ 119.6 టన్నులు మాత్రమేనని వరల్డ్ గోల్డ్​ కౌన్సిల్​ రిపోర్టు వెల్లడించింది. విలువపరంగా చూస్తే మన దేశంలో గోల్డ్​ డిమాండ్​ 54 శాతం గ్రోత్​ రేటుతో రూ. 79,270 కోట్లయినట్లు పేర్కొంది. కాకపోతే, ఇటీవల కాలంలో రూపాయి బలహీనపడటం, ఇన్​ఫ్లేషన్​, ప్రభుత్వ పాలసీలలో మార్పు వంటి వాటి ఎఫెక్ట్​ రాబోయే ఆరు నెలల్లో గోల్డ్​ డిమాండ్​పై పడనున్నట్లు అంచనా వేస్తోంది.  

2022లో డిమాండ్​ 850 టన్నులు

2022 పూర్తి ఏడాదికి మన దేశంలో గోల్డ్​ డిమాండ్​ 800 నుంచి 850 టన్నుల దాకా ఉండొచ్చని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ రీజినల్​ సీఈఓ (ఇండియా) పీ ఆర్​ సోమసుందరం వెల్లడించారు. 2021లో ఈ  డిమాండ్​ 797 టన్నులని చెప్పారు. రెండో ఆరు నెలల్లో (అంటే జులై–డిసెంబర్​ కాలంలో) బంగారు నగలకు డిమాండ్​ కొంత తగ్గుతుందని భావిస్తున్నారు. బంగారంపై డ్యూటీ పెంపు, గోల్డ్​ కొనుగోలుపై మరిన్ని ఆంక్షలు, డాలర్​తో రూపాయి మారకపు విలువ క్షీణత నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గుతాయనేది డబ్ల్యూజీసీ అంచనా. అయితే, రుతుపవనాలు సాధారణంగా ఉండి, ఇన్​ఫ్లేషన్​ పెరిగి, బంగారం రేట్లు ఒక రేంజ్​లోనే కదలాడితే మాత్రం డిమాండ్​ ఎక్కువగా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని సోమసుందరం పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 న రూ. 43,994 గా ఉన్న 10 గ్రాముల బంగారం రేటు జూన్​ 30 నాటికి రూ. 46,054 కి పెరిగిందని చెప్పారు. ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో బంగారు నగలకు డిమాండ్​ విలువ పరంగా 60 శాతం పెరిగి రూ. 65,140 కోట్లకు చేరిందన్నారు. ఒక్క రెండో క్వార్టర్​కే చూస్తే బంగారంలో పెట్టుబడులు 20 శాతం పెరిగాయి. దీంతో డిమాండ్​ 30.4 టన్నులకు పెరిగిందని అన్నారు.

మన దేశంలో రీసైకిల్డ్​ గోల్డ్​ గ్రోత్​

2022 రెండో క్వార్టర్లో మన దేశంలో రీసైకిల్డ్​ గోల్డ్​ 18 శాతం పెరిగి 23.3 టన్నులకు చేరింది. ఇదే క్వార్టర్లో దిగుమతులు 34 శాతం పెరిగి 170 టన్నులకు చేరాయి. అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్లో ఈ దిగుమతులు 131.6 టన్నులే. ఓవైపు బంగారం డిమాండ్​ పుంజుకుంటున్నా, మరోవైపు దేశంలోని బులియన్​ మార్కెట్లో కొన్ని ఫండమెంటల్​ మార్పులు చోటు చేసుకుంటున్నాయని సోమసుందరం పేర్కొన్నారు. 

బంగారానికి గ్లోబల్​ డిమాండ్ ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో 8 శాతం తగ్గి 948.4 టన్నులకు చేరింది. కిందటేడాది  రెండో క్వార్టర్లో ఈ డిమాండ్​1,031.8 టన్నులని డబ్ల్యూజీసీ రిపోర్టు తెలిపింది. గోల్డ్​ ఎలక్ట్రానిక్​ ట్రేడెండ్​ ఫండ్స్​ (ఈటీఎఫ్​) అవుట్​ఫ్లో పెరగడంతో పాటు, సెంట్రల్​ బ్యాంకుల నుంచి డిమాండ్​ తక్కువ కావడం వల్లే డిమాండ్​ కొంత తగ్గినట్లు పేర్కొంది. గ్లోబల్​గా ఏప్రిల్​–జూన్​ 2022 మధ్యలో గోల్డ్​ రేట్లు ఔన్సుకి 1,870 డాలర్ల వద్ద నిలిచాయి. కిందటేడాది ఈ రేట్లు 1,816 డాలర్లని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సోమసుందరం చెప్పారు.

ఇంటర్నేషనల్​ బులియన్​ ఎక్స్చేంజ్​  (ఐఐబీఎక్స్​) లాంఛ్​...

అహ్మదాబాద్​లోని గిఫ్ట్​ సిటీలో ఏర్పాటయిన ఐఐబీఎక్స్​లో ట్రేడింగ్​ లాంఛ్​ కానుండటంతో ఒక కొత్త జర్నీ మొదలవుతుందని సోమసుందరం చెప్పారు. గ్లోబల్​ బులియన్​ మార్కెట్లలో ఇండియా ప్రభావం పెరిగేందుకు ఈ కొత్త ఎక్స్చేంజ్​ వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని బంగారం నిల్వలను ఏదో ఒక రకంగా నగదు రూపంలోకి తేవాలనే ఇండియా ప్రయత్నాలకు కూడా ఐఐబీఎక్స్​ మద్దతు దొరుకుతుందని సోమసుందరం చెప్పారు.