బల్దియా ఆఫీసర్లలో టెన్షన్.. టెన్షన్

బల్దియా ఆఫీసర్లలో టెన్షన్.. టెన్షన్
  •     మొన్నటిదాకా గత పాలకుల కనుసన్నల్లో పాలన
  •     ఏకపక్షంగా పనిచేసిన అధికారుల్లో కలవరపాటు
  •     ప్రజలు ఫోన్లు చేసినా పట్టించుకోని వారిలో ఆందోళన 
  •     ఇక్కడే కొనసాగేలా కాంగ్రెస్ పెద్దల టచ్​లోకి పలువురు ఉన్నతాధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుతో బల్దియా ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. మొన్నటి వరకు గత పాలకుల కనుసన్నల్లో పనిచేసిన అధికారులు, ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రాకతో కలవరపాటుకు గురవుతున్నారు. బల్దియాలోనే కొనసాగేందుకు కొందరు ఉన్నతాధికారులు ఇప్పటికే కాంగ్రెస్​పెద్దలతో టచ్​లోకి వెళ్లినట్లు తెలిసింది. గత పాలకుల అండతో ఒకే పదవిలో ఏళ్లుగా ఉన్నవారు ఇప్పుడేం చేయాలనే టెన్షన్​లో ఉన్నారు.  కొందరు అధికారులైతే ప్రభుత్వ పెద్దల అండతో ప్రజలను సైతం దూరం పెట్టారు.

అంతా సొంత నిర్ణయాలతో కేవలం ఒకరిద్దరి పాలకుల మాటలు మాత్రమే వింటూ పనులు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొందరు అధికారులు లీవ్​లు పెట్టి వెళ్లారు.  ఇంకొందరు కాంగ్రెస్​ పెద్దలతో మాట్లాడి ఇక్కడే ఉండే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కొందరు ఉన్నతాధికారులు బల్దియాను  వీడటం లేదు. పదవీ విరమణ సమయం అయిపోయినా కూడా కొందరు అధికారులకు గడువు పెంచి మరీ  ఇక్కడే పాతుకుపోయేలా చేశారు.

ప్రజల సమస్యలు తీర్చే ప్రజావాణిని సైతం కరోనా పేరుతో పక్కన పెట్టారు. కరోనా తర్వాత అన్ని జిల్లాల్లో ప్రజావాణి కొనసాగిస్తుండగా.. బల్దియాలో మాత్రం జరగడంలేదు. కొందరు అధికారులైతే ఆఫీసుకి ఎప్పుడొస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియడంలేదు. ఇలాంటి వారిని ఆర్డర్​లో పెట్టేందుకు కొత్త ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే చర్చ కూడా బల్దియాలో జరుగుతుంది. 

నాలుగేళ్లకి మించిన వారే..

బల్దియాలో ప్రస్తుతం ఉన్న అధికారుల్లో దాదాపు సగానికిపైగా మంది 4 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారే ఉన్నారు. అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సహా పలువురు అధికారులు ఏండ్లకు ఏండ్లుగా ఇక్కడే పాతుకుపోయారు.  ఎన్నికల కోడ్ వచ్చినా బల్దియాలోనే  అటు ఇటు బదిలీలు చేస్తున్నారే తప్ప వేరే ప్రాంతాలకు బదిలీ చేయలేదు. మళ్లీ ఎన్నికలు అయిపోయాక తిరిగి ఎవరి పోస్ట్​లోకి వారు వస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ మార్పుతో అధికారుల్లో కదలిక కనిపిస్తుంది. ఇప్పటివరకు పాలకుల కోసం మాత్రమే అన్నట్లుగా పనిచేసిన  వారిలో గుబులు మొదలైంది. 

 పాలకుల కోసమే అన్నట్టుగా..


మొన్నటి వరకు పాలకులను మెప్పించడం కోసమే అన్నట్లుగా అధికారులు పని చేశారు. కేవలం సంబంధిత శాఖ మంత్రితో మాత్రమే తమకు అవసరం అన్నట్లుగా కొందరు ఉన్నతాధికారులు వ్యవహరించారు. కనీసం ప్రజలకు అందుబాటులో కూడా ఉండని అధికారులు సైతం ఇప్పటికీ ఉన్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొద్దామని ఫోన్లు చేస్తే 60 శాతం మంది లిఫ్ట్ కూడా చేయడం లేదు.  

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమను ఇక్కడే కొనసాగిస్తుందా?లేక వేరే చోటకు బదిలీలు చేసే అవకాశం ఉంటుందా అని టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కొందరు అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్లారు. కొత్త  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బల్దియాను కూడా ప్రక్షాళన చేస్తే ఇక్కడ కొందరు అధికారులు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి.